Telugu Global
National

మిషన్ గగన్‌యాన్‌కు షెడ్యూల్ ఖరారు.. ఎప్పుడంటే..

ఈ క్రూ మాడ్యూల్ టీవీ-డీ1ను లాంచింగ్ కోసం ఇటీవ‌లే కాంప్లెక్స్‌కు తీసుకువచ్చింది. ఈ ప‌రీక్ష స‌మ‌యంలో మాడ్యూల్ 17 కిలోమీట‌ర్ల ఎత్తుకు వెళ్లిన త‌ర్వాత‌ అబార్ట్ సీక్వెన్స్‌లో భాగంగా మ‌ళ్లీ భూమి మీద‌కు వ‌స్తుంద‌ని ఇస్రో తెలిపింది.

మిషన్ గగన్‌యాన్‌కు షెడ్యూల్ ఖరారు.. ఎప్పుడంటే..
X

మానవ సహిత అంతరిక్ష యాత్రకు సంబంధించి కీలక అప్డేట్‌ని ఇస్రో విడుదల చేసింది. గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌లో అక్టోబర్ 21న కీలక అడుగు ముందుకు పడనుంది. ఎందుకంటే టీవీ-డి1 టెస్ట్ ఫ్లైట్ అక్టోబర్ 21 ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య షెడ్యూల్ చేయబడిందని ఇస్రో ప్రకటించింది. ఈ టెస్ట్ వెహికల్ డెవలప్‌మెంట్ ఫ్లైట్ (TV-D1) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో నిర్వహించబడుతుంది. క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపడం.. ఆ తర్వాత సురక్షితంగా భూమికి తీసుకురావడానికి సంబంధించిన టెస్ట్ నిర్వ‌హించ‌నున్నారు.




పీడ‌నం లేని క్రూ మాడ్యూల్‌లో వ్యోమ‌గాములను నింగిలోకి పంపించనున్నారు. అయితే ప్రస్తుతం చేయనున్న పరీక్షల్లో ఈ క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి ఖాళీగా పంపి.. అక్కడి నుంచి సేఫ్‌గా బంగాళాఖాతంలో ల్యాండ్ చేయనున్నారు. అక్కడ ముందుగానే సిద్ధంగా ఉన్న ఇండియ‌న్ నేవీ ఆ మాడ్యూల్ మిష‌న్‌ను తిరిగి భూమి మీదకు తీసుకువస్తుంది. ఈ క్రూ మాడ్యూల్ టీవీ-డీ1ను లాంచింగ్ కోసం ఇటీవ‌లే కాంప్లెక్స్‌కు తీసుకువచ్చింది. ఈ ప‌రీక్ష స‌మ‌యంలో మాడ్యూల్ 17 కిలోమీట‌ర్ల ఎత్తుకు వెళ్లిన త‌ర్వాత‌ అబార్ట్ సీక్వెన్స్‌లో భాగంగా మ‌ళ్లీ భూమి మీద‌కు వ‌స్తుంద‌ని ఇస్రో తెలిపింది. శ్రీహ‌రికోట నుంచి 10 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స‌ముద్ర ప్రాంతంలో ఆ మాడ్యూల్ ల్యాండ్‌ కానుంది.




గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా ముగ్గురు వ్యోమగాములను మూడు రోజుల పాటు భూమి నుంచి 400 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి తీసుకెళ్తారు. సాధారణంగా ఉపగ్రహాలను నింగిలోకి పంపే ప్రక్రియతో పోల్చితే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియ అత్యంత క్లిష్టమైనది. ఇక గగన్ యాన్ యాత్ర మ‌ధ్య‌లో వ్యోమగాములు అత్యవసర పరిస్థితులలో సురక్షితంగా తప్పించుకునేందుకు వీలుగా ఈ అబార్ట్ మిషన్ వన్ రూపొందించారు. టెస్టింగ్ కోసం ఆ మాడ్యూల్‌ను ఖాళీగా నింగిలోకి పంపి, మ‌ళ్లీ భూమిపైకి చేర్చ‌నున్నారు. ఈ క్రమంలో రాకెట్ నుంచి విడివడే క్రూ మాడ్యుల్ పారాషూట్ల సాయంతో బంగాళాఖాతంలో దిగుతుంది. ఈ ప్రక్రియలో వ్యోమగాముల రక్షణకు ఏర్పాటు చేసిన వ్యవస్థల పనితీరును మాడ్యూల్‌లోని వివిధ పరికరాలతో శాస్త్రవేత్తలు సేకరిస్తారు. క్రూ మాడ్యూల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నాక అందులోని డాటా ఆధారంగా మరిన్ని మెరుగులు దిద్దుతారు.




ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ దేశాలు మాత్రమే మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేప‌ట్ట‌గా, వాటి స‌ర‌స‌న నిలిచేందుకు భార‌త్ తొలిసారి మానవ సహిత అంతరిక్ష యాత్ర చేయనుంది.

First Published:  16 Oct 2023 12:02 PM GMT
Next Story