Telugu Global
National

కరెన్సీ నోటుపై పెన్ను గీత పడితే, ఇక అంతేనా..?

కరెన్సీ నోటుపై పొరపాటున పెన్ను గీత పడితే, అది చెల్లని కాగితం అవుతుందని, దాన్ని మార్పిడి చేసుకోవాలంటే పెద్ద తతంగం ఉంటుందని, కొంతమంది కేటుగాళ్లు అమాయకుల దగ్గర అసలు విలువను తగ్గించి అలాంటి నోట్లను సేకరిస్తున్నారు.

కరెన్సీ నోటుపై పెన్ను గీత పడితే, ఇక అంతేనా..?
X

కరెన్సీ నోట్లకు ఓ చివరన వాటర్ మార్క్ కనపడేందుకు తెల్లటి ఖాళీ ప్రదేశాన్ని వదిలిపెడతారు. అవసరం అనుకుంటే అక్కడ ఎవరైనా గుర్తుకోసం నోట్ల సంఖ్యను రాసుకుంటారు. ఆ తర్వాత కాలక్రమంలో అక్కడ పేర్లు, ప్రేమ లేఖలు కూడా రాసేవాళ్లు మొదలయ్యారు.

ఈరోజుల్లో అయితే ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు కూడా రాసేవాళ్లేమో. కానీ కొత్త నోట్లు వచ్చాక వాటిపై గీతలు, రాతలు చాలా వరకు తగ్గాయి. దీనికి కారణం ఒకటే. నోట్లపై పెన్ను గీత పడితే అది చెల్లదు అనే ప్రచారం ఉండటం.

కరెన్సీ నోటుపై పెన్నుగీత పడితే దానికి చెల్లుబాటు ఉండదు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఒకరకంగా ఇది మంచిదే, ఆ భయంతో అయినా ఎవరూ నోట్లపై పిచ్చి రాతలు రాయడంలేదు, కనీసం నెంబర్ రాయాలన్నా కూడా ఆలోచిస్తున్నారు, బ్యాంక్ ఉద్యోగులు కూడా పెన్సిల్ దగ్గర పెట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి ప్రచారాలు కొన్ని సందర్భాల్లో అమాయకులు మోసపోవడానికి కూడా కారణం అవుతున్నాయి.

కరెన్సీ నోటుపై పొరపాటున పెన్ను గీత పడితే, అది చెల్లని కాగితం అవుతుందని, దాన్ని మార్పిడి చేసుకోవాలంటే పెద్ద తతంగం ఉంటుందని, కొంతమంది కేటుగాళ్లు అమాయకుల దగ్గర అసలు విలువను తగ్గించి అలాంటి నోట్లను సేకరిస్తున్నారు. ఈ వ్యవహారం ఇటీవల ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది. దీంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దీనిపై క్లారిటీ ఇచ్చింది. పెన్నుతో గీత పడితే కరెన్సీ నోట్లు చెల్లవు అనేది తప్పుడు ప్రచారం అని తేల్చి చెప్పింది.


కానీ..!!

పెన్నుతో రాసినంత మాత్రాన నోటు చెల్లకుండా పోదు అన్నారే కానీ ఇది తెలిసిన వెంటనే అందరూ నోట్లపై గీతలు, రాతలతో చండాలం చేయొద్దని కేంద్రం హెచ్చరించింది. కరెన్సీ నోట్లను శుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతో నోట్లపై ఎలాంటి రాతలు ఉండకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అలా చేస్తే నోట్లు చూసేందుకు బాగుండవని, వాటి జీవితకాలం తగ్గుతుందని పీఐబీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. పెన్ను గీత పడినా కరెన్సీ నోటుని తీసుకునేందుకు భయపడొద్దు, ఎవరైనా వ్యతిరేకిస్తే ఊరుకోవద్దు. అలాగని ఇష్టం వచ్చినట్టు నోట్లపై పెన్నుతో రాయొద్దు.

First Published:  9 Jan 2023 1:18 AM GMT
Next Story