Telugu Global
National

అమెరికాలో భారత మహిళ ఆత్మహత్య... కొడుకుని కనాలని వేధింపులు

ఎనిమిదేళ్లుగా తన భర్త తనని హింసిస్తున్నాడని, ప్రతిరోజూ కొడుతున్నాడని, ఇక తనకు భరించే శక్తి లేదని తనను క్షమించమని, తాను చనిపోతున్నానని... ఆమె తన తండ్రిని ఉద్దేశించి పంజాబీ భాషలో వీడియోలో తెలిపింది.

అమెరికాలో భారత మహిళ ఆత్మహత్య... కొడుకుని కనాలని వేధింపులు
X

ఉత్తర ప్రదేశ్ కి చెందిన మహిళ అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు ఆడపిల్లలున్న మన్ దీప్ కౌర్ ని ఆమె భర్త కొడుకుకోసం వేధించినట్టుగా తెలుస్తోంది. తను అనుభవిస్తున్న కష్టాలను ఆమె వీడియోగా చిత్రించగా అది వైరల్‌గా మారింది. ఎనిమిదేళ్లుగా తన భర్త తనని హింసిస్తున్నాడని, ప్రతిరోజూ కొడుతున్నాడని, ఇక తనకు భరించే శక్తి లేదని తనను క్షమించమని, తాను చనిపోతున్నానని.... ఆమె తన తండ్రిని ఉద్దేశించి పంజాబీ భాషలో వీడియోలో తెలిపింది. ఆమెకు ఆరు, నాలుగేళ్ల వయసున్న కూతుళ్లున్నారు. వారిద్దరినీ వారి తండ్రి నుండి తీసుకుని వెళ్లిపొమ్మని ఆమె వీడియోలో తన పుట్టింటివారిని అభ్యర్థించింది. మన్ దీప్ కుటుంబం ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్ నూర్ జిల్లాలో నివసిస్తోంది. ఆమె భర్త రణ్ జోధ్ బీర్ సింగ్ కుటుంబం కూడా అదే ఊళ్లో నివసిస్తోంది. మన్ దీప్ తండ్రి జశ్ పాల్ సింగ్.... కూతురి భర్త, అత్తమామల పైన తమ సొంత ఊరిలో కేసు పెట్టారు. న్యూయార్క్ లోని తమ బంధువులు అక్కడి పోలీసులతో మాట్లాడుతున్నారన్నారని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం తమకు సహాయం చేయాల్సిందిగా ఆయన కోరారు.

తమకు తమ కుమార్తె పడుతున్న కష్టాలు మొదటి నుండీ తెలుసునని, పెళ్లయినప్పటి నుండీ ఆమె కష్టాలు పడుతూనే ఉన్నదని, కూతురు పుట్టాక ఆమెని హింసించడం పెరిగిందని, మరొక కూతురు పుట్టాక ఆమెని మరింతగా హింసించారని మన్ దీప్ తండ్రి తెలిపాడు. కొన్నేళ్ల క్రితం తమ కుమార్తె... తనని భర్త కొడుతున్న వీడియోని పంపటంతో న్యూయార్క్ లో కేసు పెట్టామని... అయితే తమ కుమార్తె అతనిపై పోలీసులు చర్యలు తీసుకునేందుకు ఒప్పుకోలేదని, తాను అతణ్ణి క్షమిస్తున్నానని కోర్టుకి చెప్పిందని ఆయన తెలిపారు. పిల్లలను ఒంటరిగా పెంచలేననే భయంతో ఆమె తన భర్తకు శిక్ష పడకూడదని కోరుకుందని, తాము కూడా అందుకే అతనికి మరో అవకాశం ఇవ్వాలని అనుకున్నామని, అయితే అతను మళ్లీ ఆమెను హింసించడం మొదలుపెట్టాడని మన్ దీప్ తండ్రి తెలిపాడు. మన్ దీప్ చనిపోయిన తరువాత ఆమె భర్త నుండి కానీ, అతని కుటుంబం నుండి కానీ ఎలాంటి స్పందన లేదని, అమెరికాలో వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయంలో కూడా తమకు సమాచారం లేదని అతను తెలిపాడు.

మన్ దీప్ కౌర్, రణ్ జోధ్ బీర్ సింగ్ ల వివాహం 2015లో జరిగింది. అతను అక్కడ ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కూతుళ్లు పుట్టాక వారిని తాను పెంచలేనని, వారిని పెంచడానికి 50 లక్షలు తీసుకురావాలని భార్యను వేధించాడు. తాను తన ట్రక్ తాలూకూ లోన్ కట్టుకోవాల్సి ఉందని... కనుక ఆడపిల్లల పెంపకం కోసం అయ్యే ఖర్చు ఆమె తేవాలంటూ హింసించేవాడు. ఆమె అత్తమామలు సైతం ఇండియా నుండి ఫోన్ చేసి తమకు మనుమడు కావాలని... మగబిడ్డని కనాలంటూ ఆమెని వేధించేవారని, తాము న్యూయార్క్ లో కేసు ఫైల్ చేసినప్పుడు వారు భయపడ్డారని, కానీ... వాళ్లు బ్రతిమలాడటంతో తమ సోదరి అతనికి శిక్ష పడకుండా కాపాడిందని... వాళ్లు ఆమెని ఆటబొమ్మలా చేసి ఆడించారని మన్ దీప్ సోదరుడు సందీప్ సింగ్ అన్నారు. తన అక్క పిల్లలను తాము తెచ్చుకుంటామని తల్లిలాగే వారిని పెంచుతానని మన్ దీప్ కౌర్ సోదరి తెలిపింది. న్యూయార్క్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా 'తాము అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, అన్ని విధాలుగా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్విట్టర్లో పేర్కొంది.

First Published:  8 Aug 2022 3:46 AM GMT
Next Story