Telugu Global
National

పేరుమార్పు, చార్జీ పెంపు.. స్పెషల్ ట్రైన్లతో రైల్వేకి భారీ ఆదాయం..

2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతీయ రైల్వేకు స్పెషల్ ట్రైన్ల ద్వారా సమకూరిన ఆదాయం అక్షరాలా 17,526.48 కోట్ల రూపాయలు. రెండేళ్ల క్రితం 800 కోట్లుగా ఉన్న ఆదాయం, ఇప్పుడు 17 వేల కోట్లను దాటడం విశేషం.

పేరుమార్పు, చార్జీ పెంపు.. స్పెషల్ ట్రైన్లతో రైల్వేకి భారీ ఆదాయం..
X

పండగలు, ఇతర రద్దీ సీజన్లలో సహజంగానే రద్దీ పెరుగుతుంది. ఆయా సమయాల్లో ప్రైవేట్ యాజమాన్యాలు టికెట్ రేట్లు పెంచి దోపిడీకి పాల్పడుతుంటాయి. ఇలాంటి దోపిడీకి ప్రభుత్వరంగ సంస్థలు కూడా ఏమాత్రం వెనకాడబోవని తేలింది. భారతీయ రైల్వే కూడా ఇటీవల స్పెషల్ ట్రైన్ల పేరుతో భారీ దోపిడీకి తెగబడినట్టు ఆర్టీఐ కింద చేసిన దరఖాస్తు బయటపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతీయ రైల్వేకు స్పెషల్ ట్రైన్ల ద్వారా సమకూరిన ఆదాయం అక్షరాలా 17,526.48 కోట్ల రూపాయలు. రెండేళ్ల క్రితం 800కోట్లుగా ఉన్న ఆదాయం, ఇప్పుడు 17వేల కోట్లను దాటడం విశేషం.

ఎందుకీ దోపిడీ..

స్పెషల్ ట్రైన్. ఈ పేరు మాత్రమే స్పెషల్, సౌకర్యాల్లో మార్పులేవీ ఉండవు. కేవలం ప్రయాణికుల రద్దీని క్యాష్ చేసుకోడానికి ప్రవేశ పెట్టిన రైళ్లు ఇవి. అసలు ట్రైన్లు క్యాన్సిల్ అయినా కూడా స్పెషల్ ట్రైన్లతో దోపిడీ ఆగదు. రైల్వేకు ఏమాత్రం అదనపు ఖర్చు ఉండదు, కానీ ప్రయాణికుడికి మాత్రం 50శాతం చార్జీ అదనం. ఇలా స్పెషల్ ట్రైన్ల పేరుతో రైల్వే భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంది.

స్పెషల్ ట్రైన్ల ఆదాయాన్ని రైల్వే ఎప్పుడూ బయటపెట్టాలనుకోదు. కానీ చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి ఆర్టీఐకి దరఖాస్తు చేయడంతో విషయం బయటపడింది.

2019-20 లో స్పెషల్ ట్రైన్ల ద్వారా ఆదాయం.. రూ.804.78 కోట్లు

2020-21 లో స్పెషల్ ట్రైన్ల ద్వారా ఆదాయం.. రూ.12,027.81 కోట్లు

2021-22 లో ఆదాయం రూ.17,526.48 కోట్లు

కరోనా కాలంలో ఆదాయం తగ్గిందనే సాకుతో ఇటీవల సీనియర్ సిటిజన్ల రాయితీకి కూడా రైల్వేలు మంగళం పాడాయి. జర్నలిస్ట్ లకు ఇచ్చే రాయితీ సహా, చాలా రకాల కన్సెషన్లు తీసేసింది. ఓవైపు రాయితీలు కోసేస్తూ ఖర్చులు తగ్గించేసుకుంటున్న సంస్థ.. మరోవైపు స్పెషల్ ట్రైన్ల పేరుతో అడ్డగోలు దోపిడీకి మాత్రం వెనకాడ్డంలేదు.

First Published:  17 Oct 2022 2:41 AM GMT
Next Story