Telugu Global
National

ఆట ఇప్పుడే మొదలైంది.. ఎన్నికల తర్వాత JDU ఉండదు - తేజస్వి

2022లో మహాఘట్‌బంధన్‌ సర్కార్ ఎన్నో ఆశలతో ఏర్పడిందన్న తేజస్వి.. ఆ ఆశలను నితీశ్‌ హత్య చేశారని విమర్శించారు. గతం గురించి ఆలోచించే ఆసక్తి తనకు లేదన్న తేజస్వి.. ఇక భవిష్యత్‌ ప్రణాళికలపై దృష్టి పెడతామన్నారు.

ఆట ఇప్పుడే మొదలైంది.. ఎన్నికల తర్వాత JDU ఉండదు - తేజస్వి
X

బిహార్‌లో నితీశ్‌ కుమార్‌ ఇండియా కూటమిని వీడి.. ఎన్డీఏలో చేరడంపై ఫస్ట్ టైం స్పందించారు RJD నేత తేజస్వియాదవ్‌. ఆట ఇప్పుడే షురూ అయిందన్నారు. నితీశ్‌ కుమార్ పార్టీని తీసుకెళ్లినందుకు బీజేపీకి కృతజ్ఞతలు చెప్పారు తేజస్వి. నితీష్‌ కుమార్ ముఖ్యమంత్రిగా అలసిపోయారన్నారు. 2024 ఎన్నికల తర్వాత జేడీయూ ఉండదని.. తన మాట గుర్తుంచుకోవాలన్నారు తేజస్వి. ప్రజలు RJD వెంటే ఉన్నారని చెప్పారు. 2022లో మహాఘట్‌బంధన్‌ సర్కార్ ఎన్నో ఆశలతో ఏర్పడిందన్న తేజస్వి.. ఆ ఆశలను నితీశ్‌ హత్య చేశారని విమర్శించారు. గతం గురించి ఆలోచించే ఆసక్తి తనకు లేదన్న తేజస్వి.. ఇక భవిష్యత్‌ ప్రణాళికలపై దృష్టి పెడతామన్నారు. బిహార్‌లో ఆట ఇంకా ముగియలేదన్నారు.


ఇండియా కూటమిని వీడిన జేడీయూ అధినేత నితీష్‌ కుమార్.. ఎన్డీఏలో చేరి 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణస్వీకారం తర్వాత మాట్లాడిన నితీశ్‌ కుమార్‌ ఇండియా కూటమి వర్కవుట్ కాదన్నారు. అందుకే ఎన్డీఏలో చేరుతున్నామని ప్రకటించారు.

2020లో బిహార్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపితో కలిసి పోటీ చేశారు నితీష్ కుమార్. బీజేపీ 74, జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించింది. అయితే 2022లో ఎన్డీఏ కూటమిని వీడిన నితీశ్ కుమార్‌.. ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ కూటమిలో ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాంగ్రెస్‌కు 19 మంది సభ్యులు ఉన్నారు. తాజాగా ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో పొత్తు తెగదెంపులు చేసుకున్న నితీష్‌ మళ్లీ ఎన్డీఏ కూటమికి షిఫ్ట్ అయ్యారు.

First Published:  28 Jan 2024 4:28 PM GMT
Next Story