Telugu Global
National

8 ఏళ్లకు జీవితఖైదు నుంచి విముక్తి .. అంతలోనే మళ్లీ..

తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నిందితుల విడుదలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.

8 ఏళ్లకు జీవితఖైదు నుంచి విముక్తి .. అంతలోనే మళ్లీ..
X

మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టయి.. జీవితఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌.సాయిబాబాను బాంబే హైకోర్టు మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో సెషన్స్‌ కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. సాయిబాబాతోపాటు అరెస్టయిన మరో అయిదుగురిని కూడా నిర్దోషులుగా తేల్చింది. నిందితులపై ఉన్న అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైనట్లు ధర్మాసనం పేర్కొంది. నిందితుల విడుదలకు తాము ఆదేశాలు జారీ చేశామని, ఈ దశలో తీర్పుపై స్టే విధించి వారి వ్యక్తిగత స్వేచ్ఛాహక్కును భంగపరచలేమని కోర్టు తెలిపింది. సాయిబాబా బృందాన్ని నిర్దోషులుగా పేర్కొంటూ బాంబే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

నిషేధిత మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 90 శాతం వైకల్యంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైన సాయిబాబాతో పాటు మరో అయిదుగురిని మహారాష్ట్ర పోలీసులు 2014లో అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసు విచారణను NIA చేపట్టింది. 2017లో గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు నిందితులందరికీ జీవితఖైదు విధించింది. అప్పటి నుంచి సాయిబాబా నాగ్‌పుర్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సెషన్స్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం 2022 అక్టోబరులోనే వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ.. వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.

తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నిందితుల విడుదలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. హైకోర్టు తీర్పును 2023 ఏప్రిల్‌లో పక్కనపెట్టింది. నిందితుల అప్పీళ్లపై మళ్లీ మొదట్నుంచీ విచారణ జరపాలని ఆదేశించింది. మళ్లీ విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు.. సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర సర్కారు మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కడం హాట్ టాపిక్‌గా మారింది. సాయిబాబా కేసులో ఈసారి అత్యున్నత ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది.

First Published:  6 March 2024 4:17 AM GMT
Next Story