Telugu Global
National

సినిమా వాళ్లు వస్తుంటారు.. పోతుంటారు.. వాళ్ల వల్ల పార్టీలు గెలవవు.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు

'ఎంతోమంది సినిమా వాళ్ళు వస్తుంటారు.. వెళ్తుంటారు.. సినిమాలు వేరు. రాజకీయాలు వేరు. వారి రాక రాజ‌కీయాల‌పై ఎలాంటి ప్ర‌భావాలు చూపించబోవు. సినిమా వాళ్ళ మద్దతుతో గెలుస్తామనుకోవడం బీజేపీ భ్రమ'

సినిమా వాళ్లు వస్తుంటారు.. పోతుంటారు.. వాళ్ల వల్ల పార్టీలు గెలవవు.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు
X

క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చ సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడాన్ని ఇతర పార్టీల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కర్ణాటకలో సుదీప్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయన మద్దతు కోసం కర్ణాటకలోని ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నించాయి. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కూడా ఆయనతో సంప్రదింపులు జరిపాయి. అయితే సుదీప్ మాత్రం బీజేపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని కలిసి తన మద్దతు ప్రకటించారు. బీజేపీలో చేరేది లేదని, ఎన్నికల్లో పోటీ చేయనని.. బొమ్మై సూచించిన అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని సుదీప్ ప్రకటించారు.

కాగా, సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడంపై కర్ణాటకలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలు పార్టీలతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. సుదీప్ బీజేపీకి అలా మద్దతు ప్రకటించారో లేదో అప్పుడే ఆయనపై విమ‌ర్శ‌లు కూడా మొదలయ్యాయి. సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం పట్ల కర్ణాటక కాంగ్రెస్ అగ్ర నేత డీకే శివకుమార్ స్పందిస్తూ.. రాజకీయాలు, సినిమాలు వేరని, అది ఒకదానిపై మరొకటి ప్రభావం చూపెట్టలేవని వ్యాఖ్యానించారు.

'ఎంతోమంది సినిమా వాళ్ళు వస్తుంటారు.. వెళ్తుంటారు.. సినిమాలు వేరు. రాజకీయాలు వేరు. వారి రాక రాజ‌కీయాల‌పై ఎలాంటి ప్ర‌భావాలు చూపించబోవు. సినిమా వాళ్ళ మద్దతుతో గెలుస్తామనుకోవడం బీజేపీ భ్రమ' అని శివకుమార్ వ్యాఖ్యానించారు.

బీజేపీకి సుదీప్ చేరువ కావడంపై జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడానికి సినిమా నటులను వాడుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని, అది వర్కౌట్ కాదన్నారు. సినిమా నటులను చూసేందుకు జనం వస్తుంటారని, అంతమాత్రాన ఓటేస్తారనే భ్ర‌మ‌లో ఉండొద్ద‌న్నారు. సెలబ్రిటీలు ఏ పార్టీకి పరిమితం కాదని కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. బసవరాజ్ బొమ్మైకి సుదీప్ మద్దతు ఇవ్వడం పట్ల నటుడు ప్రకాష్ రాజ్ కూడా తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి పౌరుడు ఇకపై మిమ్మల్ని, మీ పార్టీని ప్రశ్నిస్తుంటాడని.. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలన్నారు.

First Published:  7 April 2023 5:22 AM GMT
Next Story