Telugu Global
National

'సనాతనం'పై చరిత్ర లోతుల్లోకి వెళ్లకండి.. మంత్రులకు మోడీ సూచన!

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని మంత్రులకు సలహా ఇచ్చారు.

సనాతనంపై చరిత్ర లోతుల్లోకి వెళ్లకండి.. మంత్రులకు మోడీ సూచన!
X

'సనాతన ధర్మం' అనే అంశంపై ఆచితూచి మాట్లాడాలని కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. ఈ విషయంపై అతిగా స్పందించ వద్దని కూడా చెప్పినట్లు తెలుస్తున్నది. జీ20 సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 'సనాతన ధర్మం', 'భారత్' అంశాలను ప్రధాని మోడీ ప్రస్తావించినట్లు తెలుస్తున్నది.

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని మంత్రులకు సలహా ఇచ్చారు. అదే సమయంలో చరిత్ర లోతుల్లోకి వెళ్లవద్దని.. రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు కట్టుబడి ఉండాలని మంత్రులకు ప్రధాని మోడీ సూచించినట్లు తెలుస్తున్నది. సమకాలీన పరిస్థితుల గురించి మాత్రమే మాట్లాడండి.. అంతేకానీ వివాదాస్పద వ్యాఖ్యలను మరింత లోతుకు వెళ్లి జఠిలం చేయవద్దని చెప్పినట్లు తెలుస్తున్నది. ఇలాంటి వ్యాఖ్యలను సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.

భారత్ అనే అంశాన్ని కూడా ప్రధాని ప్రస్తావించినట్లు తెలుస్తున్నది. గత రెండు రోజులుగా మీడియాలో 'భారత్' అనే అంశంపై విస్తృతంగా కథనాలు వెలువడుతున్నాయి. కొంత మంది మంత్రులు, బీజేపీ నాయకులు ఈ విషయంలో పలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇకపై ఎవరు పడితే వాళ్లు ఈ అంశంపై మీడియా ముందు మాట్లాడటం కానీ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ చేయవద్దని కఠినంగానే చెప్పినట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో నిర్దేశించిన కొంత మంది మాత్రమే స్పందిస్తారని మోడీ స్పష్టం చేసినట్లు సమాచారం.

జీ20 సదుస్సు నేపథ్యంలో విదేశీ అతిథులకు ఏ లోటు రాకుండా చూసుకోవాలని అన్నారు. సదస్సు జరిగే వేదిక వద్దకు చేరుకునేందుకు అధికారిక వాహనాలు ఉపయోగించ వద్దని మోడీ సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన షటిల్ సర్వీసులను ఉపయోగించి ఆయా వేదికల వద్దకు చేరుకోవాలని కోరారు. అలాగే జీ20 ఇండియా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని.. విదేశీ ప్రతినిధులతో చర్చలు జరిపే సమయంలో అందులోని అనువాద సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు.

First Published:  7 Sep 2023 3:24 AM GMT
Next Story