Telugu Global
National

అయోధ్య ఆలయ నిర్మాణ ప్రాంతంలో డ్యాన్సులు.. నలుగురు మహిళా కానిస్టేబుళ్ల సస్పెన్షన్

అయోధ్య ఆలయ నిర్మాణ ప్రాంతంలో మహిళా కానిస్టేబుళ్లు డ్యాన్స్ వేశారన్న కారణంతో వారిని విధుల నుంచి సస్పెండ్ చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అయోధ్య ఆలయ నిర్మాణ ప్రాంతంలో డ్యాన్సులు.. నలుగురు మహిళా కానిస్టేబుళ్ల సస్పెన్షన్
X

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కర్ణాటకలో ఒక రైల్వే స్టేషన్ భవనానికి ఆకుపచ్చ రంగు వేయడాన్ని కూడా బీజేపీ నాయకులు తప్పుపట్టారు. ఇక పఠాన్ సినిమాలో హీరోయిన్ దీపిక పదుకొనే కాషాయ రంగు బికినీ ధరించడంపై కూడా బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భక్తి కోణంలో, రంగు కోణంలో ప్రతి విషయాన్ని బీజేపీ నేతలు వివాదంగా మ‌లుస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య ఆలయ నిర్మాణ ప్రాంతంలో ఓ సినిమా పాటకు డ్యాన్స్ వేశారని ఆరోపిస్తూ నలుగురు మహిళా కానిస్టేబుళ్లను విధుల నుంచి సస్పెండ్ చేశారు. పాలకులు తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది.

అయోధ్యలో ప్రస్తుతం రామ మందిర నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ కొందరు పోలీసులు భద్రతా పనులు కూడా పర్యవేక్షిస్తున్నారు. సెక్యూరిటీ విధుల్లో మహిళా కానిస్టేబుళ్లు కూడా పాలుపంచుకుంటున్నారు. కాగా, ఆలయ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం వద్ద ఉన్న ఓ గదిలో నలుగురు మహిళా కానిస్టేబుళ్లు ఓ భోజ్ పురి పాటకు డ్యాన్స్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ట్రెండ్ అయ్యింది.

ఆలయ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో సినిమా పాటకు డ్యాన్స్ వేయడం ఏంటని అధికారులు మహిళా కానిస్టేబుళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు ఎస్పీ పంకజ్ పాండే ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించి అధికారులకు నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా మహిళా కానిస్టేబుళ్లు కవితా పటేల్, కామినీ కుష్వాహ్, కాశిష్ సాహ్ని, సంధ్యా సింగ్ లను సస్పెండ్ చేస్తూ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మునిరాజ్ ఆదేశాలు జారీ చేశారు.

కాగా, అయోధ్య ఆలయ నిర్మాణ ప్రాంతంలో మహిళా కానిస్టేబుళ్లు డ్యాన్స్ వేశారన్న కారణంతో వారిని విధుల నుంచి సస్పెండ్ చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వారేమీ ఆలయం వద్ద డ్యాన్స్ వెయ్యలేదు కదా.. ఒక గదిలో వేశారు.. అంతమాత్రానికే విధుల నుంచి సస్పెండ్ చేయాలా..? అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

డ్యాన్స్ వేసే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు యూనిఫామ్ లో కూడా లేరని.. ఇక వారిపై చర్యలు తీసుకోవడం ఎందుకని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా వైరల్ అయిన వీడియోలో ఒక మహిళా కానిస్టేబుల్ డ్యాన్స్ వేస్తుండగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఆమె చేస్తున్న డ్యాన్స్ ని ఎంకరేజ్ చేస్తూ మాత్రమే కనిపించారు. ఇక మరో మహిళా కానిస్టేబుల్ అయితే అసలు వీడియోలో కనిపించనేలేదు. అయినా నలుగురు మహిళా కానిస్టేబుళ్లను విధుల నుంచి సస్పెండ్ చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

First Published:  16 Dec 2022 7:14 AM GMT
Next Story