Telugu Global
National

పరిశ్రమల్లో ఇక 12 గంటల పని విధానం.. బిల్లు తెచ్చిన తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు

ఇకపై ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో రోజుకు 12 గంటల పాటు పనిచేసేలా తమిళనాడు ప్రభుత్వం ఓ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. డీఎంకే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

పరిశ్రమల్లో ఇక 12 గంటల పని విధానం.. బిల్లు తెచ్చిన తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు
X

గతంలో కుటుంబాలకు కుటుంబాలు బతుకుదెరువు కోసం వెట్టిచాకిరి చేసేవి. కొన్ని కుటుంబాలైతే ఏడాది, రెండేళ్ల ఒప్పందాలతో తమ పిల్లలను పనిలో చేర్చేవారు. అయితే రాను రాను ఈ బానిస బతుకులు కొంత తగ్గాయి. ప్రభుత్వాలు 8 గంటల పని విధానం అమల్లోకి తెచ్చిన తర్వాత శ్రామికులకు కాస్త ఉపశమనం లభించింది. అయితే పేరుకు ఎనిమిది గంటల పని విధానం అమల్లో ఉన్నప్పటికీ కొన్ని ప్రైవేట్ సంస్థలు అంతకంటే ఎక్కువ గంటలు పనిచేయించుకుంటున్నాయి.

ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలకు లబ్ధి చేకూరేలా తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇకపై ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో రోజుకు 12 గంటల పాటు పనిచేసేలా తమిళనాడు ప్రభుత్వం ఓ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. డీఎంకే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సభ నుంచి వాకౌట్ చేశాయి. కాంగ్రెస్ మినహా డీఎంకే మిత్రపక్షాలు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టాయి. ప్రతిపక్షాల నిరసనను ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం మూజువాణి ఓటింగ్ తో బిల్లును ఆమోదింప చేసింది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శ్రామికులను మరింత కష్టాల్లోకి నెట్టుతుందని.. ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చాలా దేశాల్లో ఇప్పుడు నాలుగు రోజుల పని విధానం అమల్లో ఉంది. అంటే వారంలో చివరి శుక్ర,శని, ఆదివారాలు సెలవే. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇటువంటి పని విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం 12 గంటల పని విధానం అమల్లోకి తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తమిళనాడుకు పరిశ్రమల రాష్ట్రంగా పేరుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా తమిళనాడు వ్యాప్తంగా ప్రైవేట్ పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల్లో లక్షలాదిమంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా వారందరూ ఇబ్బందుల్లో పడనున్నారు.

ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి స్పందించారు. విదేశీ సంస్థలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని, అందుకే కొత్తగా ఏర్పాటు అయ్యే కర్మాగారాలు, కంపెనీలలో ఉత్పత్తిని పెంచుకునేందుకు వీలుగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. 12 గంటల పని విధానం పరిశ్రమల యాజమాన్యం, కార్మికుల పరస్పర అంగీకారం మేరకు అమలు అవుతుందని.. ఇందులో ఎటువంటి బలవంతం ఉండదని ఆయన పేర్కొన్నారు.

First Published:  22 April 2023 6:40 AM GMT
Next Story