Telugu Global
National

అదానీపై వికీపీడియా సంచలన ఆరోపణలు

అదానీ గ్రూప్‌కు అనుకూలంగా కంటెంట్ ను చేర్చిన వారిలో ఆ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారని ఆరోపించింది. కంటెంట్ మార్పులు చేసిన ఐపీ అడ్రస్ లు కూడా అదానీ కంపెనీలకు చెందినవేనని బయటపెట్టింది.

అదానీపై వికీపీడియా సంచలన ఆరోపణలు
X

సినిమా ఆఖరిలో విలన్ బొక్కలన్నీ ఒక్కసారిగా బయటపడినట్టు ఇప్పుడు అదానీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటికే హిండెన్ బర్గ్ రిపోర్ట్ దెబ్బకు ఎక్కడ ఆగుతుందో కూడా తెలియని స్థాయిలో గ్రూప్ పతనం కొనసాగుతోంది. లేటెస్ట్ గా వికీపీడియా కూడా అదానీ ఒక మోసమని, తమ వికీపీడియా కంటెంట్ విషయంలోనూ తప్పుడు మార్గాలను అనుసరించారని ఆరోపిస్తోంది.

గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ సభ్యులు, గ్రూప్ కంపెనీలకు సంబంధించి వికీపీడియాలో ఉద్దేశపూర్వకంగా పదేపదే తప్పుడు సమాచారాన్ని, పక్షపాతంతో కూడిన కథనాలను జోడించారని వికీపీడియా ఆరోపించింది. వికీపీడియా కు చెందిన న్యూస్ పత్రిక ది సైన్ పోస్ట్ ఈ వ్యవహారంపై ఒక ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. వికీపీడియాలో అదానీ, ఆయన కంపెనీలకు సంబంధించి పొగడ్తలతో ముంచేత్తుతూ కంటెంట్ జోడించారని ఆ కథనంలో వివరించింది.

తొలినాళ్లల్లో అదానీ గ్రూప్‌కు సంబంధించిన కథనాలు ముక్కుసూటిగా ఉండేవని వికీపీడియా వెల్లడించింది. 2012 నుంచి ధోరణి మారిందని, ముగ్గురు ఎడిటర్లు అదానీకి సంబంధించిన కంటెంట్ లో అనుకూలమైన మార్పులు చేశారని వెల్లడించింది. వికీపీడియా ఈ మార్పులపై ఇచ్చిన వార్నింగ్ టెక్స్ట్ ను కూడా తొలగించారని ఆరోపించింది. ఇలా అదానీ అనుకూలంగా వికీపీడియాలో సమాచారాన్ని జోడించిన వారంతా పెయిడ్ ఎడిటర్లు అని అలాంటి 40 మందిని బ్లాక్ చేసినట్టు వికీపీడియా పత్రిక తన కథనంలో వివరించింది.

అదానీ గ్రూప్‌కు అనుకూలంగా కంటెంట్ ను చేర్చిన వారిలో ఆ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారని ఆరోపించింది. కంటెంట్ మార్పులు చేసిన ఐపీ అడ్రస్ లు కూడా అదానీ కంపెనీలకు చెందినవేనని బయటపెట్టింది.

వికీపీడియా క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్ కు కూడా దొరకని స్థాయిలో ఆర్టికల్స్ రూపొందించారని కథనం చెబుతోంది. ఇలాంటి వాస్తవ దూరమైన ఆర్టికల్స్ ను రివ్యూ చేసే రివ్యూయర్ అయినా హేచెన్స్ తన స్థానాన్ని దుర్వినియోగం చేశారని, అతనిపై తమ సంస్థ నిషేధం విధించిందని వికీపీడియా ప్రకటించింది. అదానీ సంబంధించి తొమ్మిది ఆర్టికల్స్ లో ఏడింటిని రివ్యూయర్ ఆమోదించారని అవినీతికి పాల్పడి ఈ పని చేసినట్టు వికీపీడియా అనుమానం వ్యక్తం చేసింది.

వికీపీడియా పత్రికలో వచ్చిన కథనాన్ని హిండెన్ బర్గ్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు ఆండర్సన్ ట్వీట్ చేశారు. గతంలోనూ కొందరు బిలినియర్లు ఇలాగే పెయిడ్ ఎడిటర్లను నియమించుకొని వికీపీడియాలో తమకు అనుకూలంగా కంటెంట్ జోడించిన ఉదంతాలు ఉన్నాయి. వికీపీడియాలో తమకు అనుకూలంగా అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో కంటెంట్ ను జోడించారని, ఐపీ అడ్రస్‌లు ఆ గ్రూపు కంపెనీలవేనని, అవినీతి మార్గాల్లోనూ ఈ పని చేశారని వికీపీడియా ఆరోపించిన నేపథ్యంలో అదానీ గ్రూప్ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.

First Published:  21 Feb 2023 3:12 PM GMT
Next Story