Telugu Global
National

ఆత్మహత్యకు అనుమతి కోరిన మహిళా సివిల్‌ జడ్జి.. తక్షణ నివేదికకు ఆదేశించిన సీజేఐ

పని ప్రదేశంలో జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి తాను జూలైలో హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లానని, కానీ ఎలాంటి ప్రయోజనం లేదని ఆ మహిళా న్యాయమూర్తి లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఆత్మహత్యకు అనుమతి కోరిన మహిళా సివిల్‌ జడ్జి.. తక్షణ నివేదికకు ఆదేశించిన సీజేఐ
X

ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళా సివిల్‌ జడ్జి రాసిన లేఖ న్యాయవర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. బారాబంకి సివిల్‌ కోర్టులో జిల్లా జడ్జి తనను లైంగికంగా వేధిస్తున్నారని, ప‌లుమార్లు ఫిర్యాదుచేసినా చర్యలు తీసుకోవటం లేదని, శారీరక, మానసిక వేధింపులను ఇక ఎదుర్కోలేనని, ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతివ్వాలని ఉత్తరప్రదేశ్‌ బాందా జిల్లా సివిల్‌ జడ్జి అర్పితా సాహూ సీజేఐకి తాజాగా రెండు పేజీల లేఖ రాశారు.

అతని నుంచి తరుచూ అనుచిత డిమాండ్లు వచ్చేవని, రాత్రి సమయాల్లో కలవాలని ఒత్తిడి తీసుకొచ్చేవాడని లేఖలో ఆమె ఆరోపించారు. ఈ లైంగిక వేధింపులు ఇక భరించలేనని తనకు గౌరవప్రదంగా చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె రాసిన లేఖతో సాక్షాత్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్ రంగంలోకి దిగారు. ఈ ఘటనపై తక్షణమే నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు ఆదేశాలు జారీచేశారు.

పని ప్రదేశంలో జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి తాను జూలైలో హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లానని, కానీ ఎలాంటి ప్రయోజనం లేదని ఆ మహిళా న్యాయమూర్తి లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సాక్షులు ఆ జిల్లా న్యాయమూర్తి కింద పనిచేసేవారేనని, వారు తమ బాస్‌కు వ్యతిరేకంగా ఎలా సాక్ష్యం చెప్పగలరని తాను ఎలా నమ్మగలనని ఆమె లేఖలో ప్రశ్నించారు. అందుకే దర్యాప్తు పూర్తయ్యేంత వరకు ఆ న్యాయమూర్తిని మరో చోటుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశానని కానీ, దానిని తక్షణం కొట్టివేశారని తెలిపారు. ఏడాదిన్నరగా తానో జీవచ్ఛవంలా బతుకుతున్నానని, అయినా తాను బతికుండి ప్రయోజనం లేదని గౌరవప్రదంగా చనిపోయేందుకు తనకు అనుమతి ఇవ్వాలని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

లేఖ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్‌ను ఆదేశించారు. మహిళా న్యాయమూర్తి ఫిర్యాదు, దానిపై విచారణకు సంబంధించిన మొత్తం వివరాలను సమర్పించాలని అలహాబాద్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు కుర్హేకర్ లేఖ రాశారు.

First Published:  15 Dec 2023 11:22 AM GMT
Next Story