Telugu Global
National

ఓటింగ్ సమయాన.. బీజేపీకి ఓటెయ్యొద్దని పిలుపులు

కవిత ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు చేశారు. 'డియర్ కర్ణాటక.. విద్వేషాన్ని తిరస్కరించు. సమాజాభివృద్ధి, శ్రేయస్సు, సంక్షేమానికి ఓటు వేయండి' అని ట్వీట్ చేశారు.

ఓటింగ్ సమయాన.. బీజేపీకి ఓటెయ్యొద్దని పిలుపులు
X

కర్ణాటక రాష్ట్రంలో భారీ బందోబస్తు మధ్య బుధవారం ఉదయం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు క్యూ కడుతున్నారు. అయితే ఇలా పోలింగ్ మొదలైందో లేదో అప్పుడే బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ పిలుపులు మొదలయ్యాయి.

బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత బీజేపీ ప్రస్తావన తీసుకురాకుండానే ఆ పార్టీకి ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఉదయం కవిత ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు చేశారు. 'డియర్ కర్ణాటక.. విద్వేషాన్ని తిరస్కరించు. సమాజాభివృద్ధి, శ్రేయస్సు, సంక్షేమానికి ఓటు వేయండి' అని ట్వీట్ చేశారు.


కొద్దిరోజుల కిందట కర్ణాటకకు చెందిన బీజేపీ మంత్రులు ఏ ఒక్క ముస్లిం తమ పార్టీకి ఓటు వేయవలసిన అవసరం లేదని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజల్లో బీజేపీ విద్వేషాలను రెచ్చగొట్టి గెలిచే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. మంత్రులు చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్సీ కవిత విద్వేషాన్ని తిరస్కరించండి.. అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ బుధవారం ఉదయం బెంగళూరు నగరంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలి.. కర్ణాటక ఉజ్వలంగా ఉండాలి.. అని వ్యాఖ్యానించారు. ఆయన కూడా బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని.. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పరోక్షంగా ప్రజలకు పిలుపు ఇచ్చారు.

వీళ్లే కాదు ఎన్నికలకు ఒక్కరోజు ముందు కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం కర్ణాటక ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా సుస్థిరత, అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు. బీజేపీకి ఓటు వేయవద్దని.. వాళ్లు ప్రమాదకారులని సూచించారు. ఒకవైపు ఎన్నికలకు పోలింగ్ కూడా మొదలు కాగా.. ఇప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా గళాలు వినిపిస్తున్నాయి. ఇవి ఓటర్లపై ఎంత మేరకు ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది.

First Published:  10 May 2023 6:49 AM GMT
Next Story