Telugu Global
National

బైక్‌లో గన్ పెట్టి బుక్కైన ఖాకీలు

తనిఖీల కోసం ఇంటి డోర్ కొట్టే ముందు వాళ్లే బైక్‌లో తుపాకీ పెట్టడం ఆ వీడియోలో కనిపించింది. దీంతో తమ కుమారుడిని పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ అజిత్‌ త్యాగి తల్లిదండ్రులు సీసీటీవీ ఫుటేజీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

బైక్‌లో గన్ పెట్టి బుక్కైన ఖాకీలు
X

ఎవరినైనా కావాలని కేసుల్లో ఇరికించాలంటే పోలీసులు వాళ్ళమీద దొంగ కేసులు పెడతారు. డ్రగ్స్‌, మారణాయుధాలు లాంటివి టార్గెట్‌ చేసిన వ్యక్తుల ఇళ్లలో, వాహనాల్లో వాళ్ళే పెట్టేసి తరువాత సీరియస్ ఫేసులు పెట్టుకొని రైడింగ్ చేసి "యు ఆర్ అండర్ అరెస్ట్ " అంటూ డైలాగులు చెబుతారు.. సినిమాల్లోనో.. సీరియల్స్‌లోనో.. ఇలాంటి సీన్లు చాలా చూసుంటాం. కానీ ఇటువంటి నిజమైన సంఘటన మాత్రం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు రావడంతో మొత్తం బండారం బయటపడింది.

వివరాల్లోకి వెళితే..

మీరట్‌లో ఉంటున్న అజిత్ త్యాగి అనే వ్యక్తి ఇంటికి సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి పోలీసులు వెళ్లారు. కొంతమంది తనిఖీల నెపంతో ఇంట్లోకి వెళ్లగా మరి కొంతమంది అజిత్ త్యాగి బైక్ వద్దకు వెళ్లి చెక్ చేశారు. బైక్‌లో నుంచి ఒక తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నావంటూ హడావిడిగా అజిత్‌ను అరెస్ట్ చేశారు. అయితే అసలు బైక్‌లోకి తుపాకీ ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు అజిత్ కుటుంబ సభ్యులు సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. అందులో రికార్డు అయిన ఫుటేజీని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. తనిఖీల కోసం పోలీసులు ఇంటి డోర్ కొట్టే ముందు వాళ్లే బైక్‌లో తుపాకీ పెట్టడం ఆ వీడియోలో కనిపించింది. దీంతో తమ కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ అజిత్‌ త్యాగి తల్లిదండ్రులు సీసీటీవీ ఫుటేజీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తమకు ఒకరితో భూవివాదం ఉందని, పోలీసులు తమ ప్రత్యర్థులతో చేతులు కలిపి ఇలా అక్రమంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేసి ఉంటారని అజిత్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు విషయం బయటపడ్డాక సీసీ టీవీ ఫుటేజీని తొలగించాలంటూ బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన మీరట్ ఎస్పీ దర్యాప్తున‌కు ఆదేశించారు. ఈ ఘటన వెనుక ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నట్టు గుర్తించామని, అలా ఎందుకు చేశారో వారిని ప్రశ్నిస్తున్నామని, నిందితులను చట్టప్రకారం శిక్షిస్తామని తెలిపారు.


First Published:  28 Sep 2023 8:17 AM GMT
Next Story