Telugu Global
National

ఏది ఎక్కువ కులం..? ఏది తక్కువ కులం..?

'ఫ్రీడం మూమెంట్‌ ఆఫ్ తమిళనాడు ఫ్రం 1800-1947' అనే సబ్జెక్టు క్వశ్చన్ పేపర్ లో ఈ ప్రశ్న వచ్చింది. 'కింది వాటిలో తమిళనాడుకు చెందిన తక్కువ కులం ఏది?' అనే ప్రశ్న అడిగారు.

ఏది ఎక్కువ కులం..? ఏది తక్కువ కులం..?
X

కులమతాల ప్రస్తావన లేని విద్యా వ్యవస్థ ఉండాలనేది ప్రభుత్వాల ధ్యేయం. అయితే నేటికీ కొంతమంది నిమ్నవర్గాల వారు చదువు విషయంలో వివక్షతకు గురవుతున్నారనే విమర్శలున్నాయి. అన్ని కులాలు సమానమే, అన్ని మతాల సారాంశం ఒక్కటేననేది విద్యార్జనతోనే అలవడాల్సిన జ్ఞానం. కానీ ఆ విద్యలోనే కులమతాల మధ్య వర్గీకరణ ఉంటే ఇక విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు అలవాటవుతాయి. కులాల కుంపట్లు తొలగించాల్సిన విద్యా వ్యవస్థ వారి మధ్య చిచ్చుపెట్టినట్టే కదా..? ఇలాంటి ఉదాహరణే తమిళనాడులో జరిగింది. పెరియార్ యూనివర్శిటీ పరీక్షల్లో కులానికి సంబంధించిన ప్రశ్న అడిగారు.

కులాల గురించిన ప్రశ్నలే పరీక్షల్లో అడగాల్సిన అవసరం లేదు, అలాంటిది కులాల్లో ఏది ఎక్కువ కులం, ఏది తక్కువ కులం అంటూ అర్థంలేని ప్రశ్న అడిగారు. పెరియార్ యూనివర్శిటీ ఎంఏ హిస్టరీ రెండో సెమిస్టర్ పరీక్షల్లో ఈ ప్రశ్న రావడం కలకలం రేపింది. 'ఫ్రీడం మూమెంట్‌ ఆఫ్ తమిళనాడు ఫ్రం 1800-1947' అనే సబ్జెక్టు క్వశ్చన్ పేపర్ లో ఈ ప్రశ్న వచ్చింది. 'కింది వాటిలో తమిళనాడుకు చెందిన తక్కువ కులం ఏది?' అనే ప్రశ్న అడిగారు. కింద నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు.

ఈ వ్యవహారం ఆనోటా, ఈనోటా బయటపడింది. చివరకు ఆన్ లైన్లో ప్రశ్నాపత్రం బయటకు రావడంతో నెటిజన్లు పెరియార్ యూనివర్శిటీ అధికారులపై మండిపడుతున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా ప్రకటించిన విద్యాసంస్థల ర్యాంకుల్లో పెరియార్ వర్శిటీ కూడా అగ్రభాగాన నిలిచింది. అలాంటి సంస్థలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా అని పెదవి విరుస్తున్నారు నెటిజన్లు. సమాజంలో అసమానతలు రూపుమాపే దిశగా విద్యను అందించాల్సిన ప్రొఫెసర్లు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ స్పందించారు. ప్రశ్నాపత్రం తాము తయారు చేయలేదని, వేరే యూనివర్శిటీ సిబ్బంది రూపొందించారని వివరణ ఇచ్చారు. క్వశ్చన్‌ పేపర్‌ లీక్ కాకూడదనే ఉద్దేశంతో ఇతర యూనివర్శిటీ సిబ్బందితో తాము ప్రశ్నా పత్రాలు తయారు చేయిస్తున్నామని తెలిపారు. అందుకే ఆ ప్రశ్నాపత్రంలో ఎలాంటి ప్రశ్నలిచ్చారనేది తమకు తెలియదన్నారు. ఈ విషయంపై కచ్చితంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారాయన.

First Published:  17 July 2022 7:43 AM GMT
Next Story