Telugu Global
National

అలా పిలవడం లైంగిక వేధింపే.. - హైకోర్టు తీర్పు

విచారణ చేపట్టిన నార్త్‌ – మిడిల్‌ అండమాన్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. మూడు నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది.

అలా పిలవడం లైంగిక వేధింపే.. - హైకోర్టు తీర్పు
X

విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌తో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడమే గాక.. ఆమెను ‘డార్లింగ్‌’ అంటూ పిలిచాడు. దీంతో ఆమె ఫిర్యాదు చేయగా.. న్యాయస్థానం ఈ కేసులో అతన్ని దోషిగా తేల్చింది. నిందితుడు హైకోర్టు వరకు వెళ్లగా.. అక్కడా అతనికి చుక్కెదురైంది. పరిచయం లేని మహిళను ‘డార్లింగ్‌’ అని పిలిచిన వ్యక్తులను ఐపీసీ 354ఏ, 509 సెక్షన్ల కింద నేరస్తులుగా పరిగణించవచ్చని తెలిపింది. ఈ మేరకు పోర్టు బ్లెయిర్‌లోని హైకోర్టు బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జై సేన్‌ గుప్తా తీర్పు వెలువరించారు.

అసలేం జరిగిందంటే.. గతేడాది అండమాన్‌ నికోబార్‌లోని మాయాబందర్‌ ప్రాంతంలో దుర్గా పూజ సందర్భంగా పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను జనక్‌ రామ్‌ అనే వ్యక్తి మద్యం మత్తులో ‘డార్లింగ్‌’ అంటూ పిలవడంతో పాటు ‘చలాన్‌ ఇవ్వడానికి వచ్చావా?’ అంటూ దూషించాడు. సదరు మహిళా కానిస్టేబుల్‌ ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

దీనిపై విచారణ చేపట్టిన నార్త్‌ – మిడిల్‌ అండమాన్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. మూడు నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. ఈ తీర్పును అడిషనల్‌ సెషన్స్‌ కోర్టులో అతడు సవాల్‌ చేయగా.. దాన్ని తిరస్కరించారు. అనంతరం అతను కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. అక్కడా చుక్కెదురైంది. దీనిపై హైకోర్టులో విచారణ జరిపిన జస్టిస్‌ జై సేన్‌ గుప్తా ధర్మాసనం ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అంతేకాదు.. పరిచయం లేని మహిళను ‘డార్లింగ్‌’ అని పిలవడం లైంగిక వేధింపేనని స్పష్టం చేసింది.

First Published:  4 March 2024 2:40 AM GMT
Next Story