Telugu Global
National

నేను బతికుండగా.. అందుకు అంగీకరించను.. - శ్రీదేవి బయోపిక్‌పై తేల్చిచెప్పిన బోనీకపూర్‌

ఆమె వ్యక్తిగత విషయాలు బయటికి చెప్పడానికి ఇష్టపడేది కాదని ఆయన తెలిపారు. జీవితమంతా ఆమె అలానే ఉందని వివరించారు. ఇప్పుడు ఆ పర్సనల్‌ విషయాలు బయటకు చెప్పడానికి తాను అంగీకరించనని ఆయన తేల్చిచెప్పారు.

నేను బతికుండగా.. అందుకు అంగీకరించను.. - శ్రీదేవి బయోపిక్‌పై తేల్చిచెప్పిన బోనీకపూర్‌
X

ఇండియన్‌ సినీ ఇండస్ట్రీలో అరుదైన తారగా వెలుగొందిన దివంగత నటి శ్రీదేవి బయోపిక్‌ రానుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ తాజాగా స్పందించారు. శ్రీదేవి బయోపిక్‌ తీసేందుకు తాను బతికున్నంతవరకు అంగీకరించనని ఆయన స్పష్టం చేశారు. తన భార్య చాలా ప్రైవేట్‌ పర్సన్‌ అని.. ఆమె వ్యక్తిగత విషయాలు బయటికి చెప్పడానికి ఇష్టపడేది కాదని ఆయన తెలిపారు. జీవితమంతా ఆమె అలానే ఉందని వివరించారు. ఇప్పుడు ఆ పర్సనల్‌ విషయాలు బయటకు చెప్పడానికి తాను అంగీకరించనని ఆయన తేల్చిచెప్పారు.

బోనీకపూర్‌ నిర్మించిన తాజా చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ బయోపిక్‌ గురించి మాట్లాడారు. శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ చిత్రాన్ని మొదట ఐశ్వర్యారాయ్‌తో తీయాలనుకున్నారని, కానీ ఐశ్వర్య ఒకప్పటి మిస్‌ ఇండియా అని.. కాబట్టి ఆమె ఇంగ్లిషు రాని పాత్రలో నటిస్తే ప్రేక్షకులకు నచ్చదని చెప్పానని వివరించారు. ఆ పాత్రకు శ్రీదేవి కచ్చితంగా సరిపోతుందని చెప్పడంతో దర్శకనిర్మాతలు అంగీకరించారని ఆయన తెలిపారు. ఇంగ్లిష్‌ వింగ్లిష్‌ చిత్రంలో ఇంగ్లిషు రాని గృహిణి పాత్రలో శ్రీదేవి జీవించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం మంచి సక్సెస్‌ కూడా సాధించింది.

ఇక సినీ నటిగా భారత్‌లోని సినీ అభిమానులందరికీ అభిమాన తారగా మారిన శ్రీదేవి బాలనటిగానే తన సినీ కెరీర్‌ని స్టార్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దాదాపు అందరు అగ్రహీరోలతో కలిసి ఆమె నటించారు. తన నటనతో అన్ని భాషల్లోని సినీ అభిమానులనూ అలరించారు. ఆమె నటనకు వచ్చిన అవార్డులు, రివార్డులు కూడా తక్కువేమీ కాదు. ఇక ఈ అగ్రకథానాయిక జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలపై ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్‌.. శ్రీదేవి బయోగ్రఫీని రచించనున్నారు. ‘ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌‘ పేరుతో ఇది రానుంది. దీనికోసం శ్రీదేవి కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.

First Published:  4 April 2024 10:44 AM GMT
Next Story