Telugu Global
National

కేంద్రం ఐటీ రూల్స్‌పై బాంబే హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021కి సవరణలు చేసింది. అయితే, ఈ కొత్త నిబంధనలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.

కేంద్రం ఐటీ రూల్స్‌పై బాంబే హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
X

కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకొచ్చిన ఐటీ నిబంధ‌న‌ల‌పై బాంబే హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌న ఉద్దేశాలు ఎంత ఉన్న‌తంగా ఉన్న‌ప్ప‌టికీ.. చ‌ట్టంలో రూపొందించే నిబంధ‌న‌ల ప్ర‌భావం రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే వాటిని మానుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ఐటీ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా దాఖ‌లైన పిటిష‌న్ల‌పై గురువారం చేప‌ట్టిన విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది. న‌కిలీ, త‌ప్పుడు స‌మాచార వ్యాప్తిని నిరోధించేందుకు ఈ నిబంధ‌న‌లు కొత్త‌గా తీసుకొస్తున్న‌ట్టు కేంద్రం చెబుతోంది.

ఏప్రిల్‌లో ప్ర‌క‌ట‌న‌..

ఆన్‌లైన్‌లో వ‌చ్చే స‌మాచారంలో న‌కిలీ, త‌ప్పుడు వివ‌రాలు ఉంటే వాటిని గుర్తించేందుకు గాను ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను తీసుకొస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలిపింది. ఇందుకోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021కి సవరణలు చేసింది. అయితే, ఈ కొత్త నిబంధనలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే వాటి చెల్లుబాటును సవాల్ చేస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మ్యాగజైన్స్ బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ప్ర‌జ‌ల‌పై వారికి న‌మ్మ‌కం లేదు..

ఈ పిటిషన్లపై బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా కునాల్ కమ్రా తరఫున సీనియర్ కౌన్సిల్ నవ్రోజ్ సీర్వాయ్ వాదనలు వినిపిస్తూ..``ప్రభుత్వం కోరుకున్నది, వారు నిజమని చెప్పిందే సామాజిక మాధ్యమాలు ప్రసారం చేయాలని కేంద్రం భావిస్తోంది. మిగతాదంతా సెన్సార్ చేయాలని చూస్తోంది. ప్రజాభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించట్లేదు. ప్రజలపై వారికి నమ్మకం లేదు. అందుకే.. నిజానిజాలను దాచేస్తూ దేశ ప్రజలకు నానీ పాత్ర పోషిస్తోంది" అని వాదించారు. ఈ కొత్త నిబంధనలు వ్యక్తుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆయ‌న ఆరోపించారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ పై వ్యాఖ్య‌లు చేసింది. అనంత‌రం దీనిపై విచార‌ణ‌ను వాయిదా వేసింది. ఐటీ కొత్త నిబంధనల కింద ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటు నిర్ణయంపై జూలై 10 వరకు ముందుకు వెళ్లబోమని గత విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపిన కేంద్రం.. విచార‌ణ ప్ర‌స్తుతం కొన‌సాగుతున్నందున ఈ యూనిట్‌ను ఇప్పుడే ఏర్పాటు చేయ‌బోమ‌ని తెలిపింది.

First Published:  7 July 2023 1:33 AM GMT
Next Story