Telugu Global
National

బలపరీక్షలో నెగ్గిన సీఎం నితీష్

సభలో ఉన్న 129 మంది ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ కు మద్దతుగా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానంలో నితీష్ సర్కార్ విజయం సాధించింది.

బలపరీక్షలో నెగ్గిన సీఎం నితీష్
X

బీహార్ అసెంబ్లీ బలపరీక్షలో నితీష్ కుమార్ నెగ్గారు. ఆయనకు 129 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో బలపరీక్షలో సునాయాసంగా విజయం సాధించారు. కొద్ది రోజుల కింద మహాకూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ ఎన్డీయేలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు. అయితే నితీష్ కుమార్ వర్గం కుట్ర చేస్తోందని ఆరోపణలు చేస్తూ విపక్ష పార్టీలు అయిన ఆర్జేడీ, కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేశాయి.

సభలో ఉన్న 129 మంది ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ కు మద్దతుగా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానంలో నితీష్ సర్కార్ విజయం సాధించింది. నితీష్ కుమార్ 2022లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ఆర్జేడీ, కాంగ్రెస్ తదితర చిన్న పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశారు. ఆ కూటమి తరపున ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

ఆ తర్వాత ఆయన జాతీయ స్థాయిలో 'ఇండియా కూటమి' ఏర్పాటుకు తీవ్ర కృషి చేశారు. అయితే కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించడంతో నితీష్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి మహాకూటమి నుంచి బయటకు వచ్చారు.

ఆ తర్వాత నితీష్ ఎన్డీయేలో చేరి 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇప్పుడు తాజాగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. జేడీయూకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తారేమోనన్న ప్రచారం జరిగినప్పటికీ ఎమ్మెల్యేలంతా నితీష్ కే మద్దతుగా నిలిచారు. జేడీయూ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా నితీష్ కు అండగా నిలవడంతో ఆయన బలపరీక్షలో విజయం సాధించారు.

First Published:  12 Feb 2024 11:18 AM GMT
Next Story