Telugu Global
National

తాజ్ మహల్ కు ఇంటి పన్ను.. ఎందుకో తెలుసా..?

Taj Mahal House Tax Notice: బ్రిటిష్ వారు కూడా పన్ను అడగలేదని, అలాంటిది ఇప్పుడు బకాయిలు కట్టాలంటూ ఆగ్రా కార్పొరేషన్ నోటీసులివ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు ఆర్కియాలజీ అధికారులు.

తాజ్ మహల్ కు ఇంటి పన్ను.. ఎందుకో తెలుసా..?
X

తాజ్ మహల్ కు ఇంటి పన్ను.. ఎందుకో తెలుసా..?

తాజ్ మహల్ కి ఇంటి పన్ను నోటీసు ఎవరైనా ఇస్తారా, చార్మినార్ కి ఆస్తి పన్ను కట్టాలని ఎవరైనా అడుగుతారా..? అడగరు అనుకుంటే అది మీ పొరపాటే. అవును తాజ్ మహల్ కి తాజాగా ఇంటి పన్ను నోటీసు పంపించే వరకు ఈ విషయం అసలు చర్చకే రాలేదు. కానీ ఆ నోటీసు రానే వచ్చింది. ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ఆ నోటీసులో లక్షా 40వేల రూపాయలు పన్ను చెల్లించాలంటూ పేర్కొన్నారు. తక్షణం పన్ను చెల్లించాలంటూ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ASI)కి నోటీసులు జారీ చేశారు.

బకాయిలు కట్టండి, లేకపోతే..

తాజ్‌ మహల్‌ పై ఇప్పటి వరకు ఉన్న ఇంటి పన్ను బకాయి రూ. 1.4లక్షలు తక్షణం జమ చేయాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో అసలుపై వడ్డీ 47వేల రూపాయలు. పన్ను చెల్లించడానికి 15రోజులు గడువు కూడా ఇచ్చారు. గడువు లోగా పన్ను చెల్లించకపోతే ఆస్తిని అటాచ్ చేస్తామనే హెచ్చరిక కూడా ఉంది. దీనిపై ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తాజ్ మహల్ కి పన్ను వేయడమేంటని అంటున్నారు ఆర్కియాలజీ అధికారులు. బ్రిటిష్ వారు కూడా పన్ను అడగలేదని, ఇప్పుడు బకాయిలు కట్టాలంటూ ఆగ్రా కార్పొరేషన్ నోటీసులివ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.

తప్పు ఎక్కడ జరిగిందంటే..?

తాజ్ మహల్ వంటి రక్షిత స్మారక చిహ్నాలకు పన్ను చెల్లింపులు ఉండవు. కానీ ఈసారి తాజ్ మహల్ తోపాటు, మరో రక్షిత స్మారక చిహ్నం 'టోంబ్ ఆఫ్ ఇత్మాద్-ఉద్-దౌలా'కి కూడా నోటీసు ఇచ్చారు. అయితే ఈ నోటీసుల వెనక ఓ కాంట్రాక్ట్ సంస్థ నిర్వాహం ఉన్నట్టు తేల్చారు అధికారులు. ఇటీవల ఇంటి పన్ను వసూలు చేసే పనిని ఓ కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించింది ఆగ్రా కార్పొరేషన్. ఆ ప్రైవేటు సంస్థ.. వరసబెట్టి కట్టడాలన్నిటికీ నోటీసులు పంపించింది. అందులో తాజ్ మహల్ కూడా ఉంది. అదీ సంగతి.

First Published:  19 Dec 2022 5:08 PM GMT
Next Story