Telugu Global
National

ఒడిశాలో మరో ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు

భారత్ లో రైలు ప్రయాణం ఎంతవరకు శ్రేయస్కరం అనే ప్రశ్న తలెత్తుతోంది. కోరమాండల్ ప్రమాదం రెండు దశాబ్దాల్లోనే అత్యంత పెద్దది అంటున్నారు.

ఒడిశాలో మరో ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు
X

కోరమాండల్ విషాదం ఇంకా కళ్లముందు కదలాడుతుండగానే మరో ప్రమాదం రైల్వే వ్యవస్థ అవస్థకి అద్దం పట్టింది. అది కూడా ఒడిశాలోనే జరగడం మరో విశేషం. ఒడిశాలోని బర్గఢ్‌ జిల్లాలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. సున్నపు రాయి లోడుతో వెళుతున్న ఈ రైలు సంబర్‌ ధార వద్ద ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. గూడ్స్ రైలు కావడంతో ప్రాణ నష్టమేమీ లేదని తెలుస్తోంది. ఈ రైలు బర్గఢ్‌ నుంచి దుంగ్రీ ప్రాంతానికి వెళుతుండగా సంబర్ ధార వద్ద పట్టాలు తప్పి పడిపోయింది.


ఈస్ట్ కోస్ట్ రైల్వే మాత్రం ఇందులో తమ తప్పేమీ లేదంటోంది. అది నారో గేజ్ మార్గం అని, ఆ రైలు పూర్తిగా ప్రైవేట్ కంపెనీ అధీనంలో ఉందని, ఆ రైలు ప్రమాదానికి భారతీయ రైల్వేకు సంబంధం లేదంటోంది.

పదే పదే ఎందుకిలా..?

భారత్ లో రైలు ప్రయాణం ఎంతవరకు శ్రేయస్కరం అనే ప్రశ్న తలెత్తుతోంది. కోరమాండల్ ప్రమాదం రెండు దశాబ్దాల్లోనే అత్యంత పెద్దది అంటున్నారు. సిగ్నలింగ్ లోపంతో ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్థారించారు. మూడు నెలల ముందు ఓ అధికారి హెచ్చరించినా, గతేడాది కాగ్ అక్షింతలు వేసినా ఉన్నతాధికారులు సైలెంట్ గా ఉన్నారు. కనీసం కేంద్రం కూడా స్పందించలేదు. దీంతో కోరమాండల్ ఘోరం జరిగి వందలాది మంది మృత్యువాత పడ్డారు. వేలాది కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

ఆ అతే కొంప ముంచుతుందా..?

కోరమాండల్ ప్రమాదం జరిగిన రోజుల వ్యవధిలోనే డౌన్ లైన్ పునరుద్ధరించామని ఆ లైన్ లో రైలు ప్రయాణాలు మొదలయ్యాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గొప్పగా చెప్పుకున్నారు. స్పీడ్ అవసరమే అదే సమయంలో క్వాలిటీ కూడా ముఖ్యమే కదా. మా సామర్థ్యం ఇదిగో చూడండి అని గొప్పలు చెప్పుకోవడమే కాదు, భారత రైల్వే ప్రమాదాలు లేని సురక్షిత ప్రయాణాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవడం కూడా అవసరమే కదా. ఎంతసేపు వందే భారత్ అని గొప్పలు చెప్పుకోడానికే కేంద్రానికి టైమ్ సరిపోతోంది కానీ, రైల్వేలో సిబ్బంది నియామకాన్ని పూర్తి చేయడం, ప్రమాదాల నివారణకు నిధులు కేటాయించడానికి మాత్రం వెనకడుగు వేస్తోంది. హంగు ఆర్భాటాల గురించి ఆలోచించినంత కాలం, ఇలాంటి ఘోరాలు తప్పవు.

First Published:  5 Jun 2023 6:44 AM GMT
Next Story