Telugu Global
National

వీసాల‌కు అమెరికా మ‌రోసారి అవ‌కాశం.. - ఢిల్లీ, చెన్నై, కోల్‌క‌తాల‌లో స్లాట్ల విడుద‌ల‌

ఇప్పటివరకు వీసా స్లాట్లు లభించని వారికి కూడా స్లాట్లను వేర్వేరుగా విడుదల చేసింది. ఢిల్లీ రాయబార కార్యాలయంతో పాటు ముంబై, చెన్నై, కోల్‌క‌తాలలోని కాన్సులేట్ల పరిధిలో ఈ స్లాట్లు విడుదల చేశారు.

వీసాల‌కు అమెరికా మ‌రోసారి అవ‌కాశం.. - ఢిల్లీ, చెన్నై, కోల్‌క‌తాల‌లో స్లాట్ల విడుద‌ల‌
X

వీసా ఇంటర్వ్యూలో తిరస్కరణకు గురైన వారికి అమెరికా మరో అవకాశం కల్పించింది. దీంతో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులకు ఇది నిజంగా సంతోష‌క‌ర‌మైన వార్తే. ఈనెల చివరి వారం నుంచి సెప్టెంబరు రెండో వారం వరకు ఫాల్ సీజనుకు సంబంధించి విద్యాసంస్థలు తరగతులను ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా తాజాగా తీసుకున్న నిర్ణయం విద్యార్థుల‌కు ఉప‌యోగ‌క‌రంగా మార‌నుంది.

ఇప్పటివరకు వీసా స్లాట్లు లభించని వారికి కూడా స్లాట్లను వేర్వేరుగా విడుదల చేసింది. ఢిల్లీ రాయబార కార్యాలయంతో పాటు ముంబై, చెన్నై, కోల్‌క‌తాలలోని కాన్సులేట్ల పరిధిలో ఈ స్లాట్లు విడుదల చేశారు. హైదరాబాద్ కాన్సులేట్ పరిధిలో మాత్రమే స్లాట్లు విడుదలవకపోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుత ఫాల్ సీజన్‌లో భారతీయ విద్యార్థులకు పెద్దసంఖ్యలో వీసాలు జారీ చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పటికే భారీగా వీసాలు జారీ చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం చివరి దశకు చేరిన నేపథ్యంలో తాజాగా వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసింది. దీంతో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఉపశమనం లభించినట్లయింది.

ఈనెల‌ చివ‌రి వ‌ర‌కు అందుబాటులో..

ఒకసారి ఇంటర్వ్యూలో వీసా లభించని విద్యార్థులు రెండు నెలలుగా వాటికోసం నిరీక్షిస్తున్నారు. తొలిసారి ఇంటర్వ్యూలో వీసా ఆమోదం పొందకపోయినప్పటికీ తక్షణమే మరో దఫా ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు గతంలో అవకాశం ఉండేది. అయితే, ఒక విద్యాసంవత్సరంలో ఒకసారి మాత్రమే ఇంటర్వ్యూకు హాజరయ్యేలా అమెరికా ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రెండోసారి ఇంటర్వ్యూకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేకంగా స్లాట్లు జారీ చేస్తుండటంతో వారికి మరో అవకాశం కలిగినట్లయింది. ఈనెల చివరి వారం వరకు తాజా స్లాట్లు అందుబాటులో ఉంటాయి.

టూరిస్ట్ వీసాదారుల నిరీక్షణ

టూరిస్ట్‌ వీసా (బి1/బి2)తో అమెరికా వెళ్లాలనుకునే వారికి ఎదురుచూపులు తప్పటం లేదు. తొలిసారి అమెరికా వెళ్లేందుకు వీసాల కోసం ఎంతోమంది గత కొన్నినెలలుగా వేచి చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో స్వల్ప సంఖ్యలో స్లాట్లు విడుదల చేసినా.. 2024లోనే ఇంటర్వ్యూ తేదీలు లభిస్తున్నాయి. విద్యార్థి వీసాల ప్రక్రియ పూర్తయిన తరువాత టూరిస్ట్‌ వీసా స్లాట్లు విడుదల చేస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

First Published:  13 Aug 2023 1:40 AM GMT
Next Story