Telugu Global
National

చున్నీ లాగి హత్యకు కారణమైన యువకులపై కాల్పులు

మరణించిన విద్యార్థిని తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ముగ్గురు నిందితులను ఫైసల్, షాబాజ్, అర్బాజ్‌లుగా గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.

చున్నీ లాగి హత్యకు కారణమైన యువకులపై కాల్పులు
X

విద్యార్థిని చున్నీ లాగి ఆమె మృతికి కారణమైన ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దొరికిన వెంటనే వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతో వారిపై కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో నిందితుల కాళ్లకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌లో ఈ సంఘటన జరిగింది. వారాహి గ్రామానికి చెందిన 17 ఏండ్ల నైన్సీ పటేల్, హీరాపూర్ బజార‌లోని ఒక కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. శుక్రవారం కాలేజీ ముగిసిన తర్వాత ఆమె స్నేహితులతో కలిసి సైకిల్‌పై ఇంటికి వెళుతోంది. అదే సమయంలో కొందరు ఆకతాయిలు బైక్ పై ఆ యువతిని వెంబడించారు. బైక్‌ వెనుక కూర్చున్న యువకుడు నైన్సీ చున్నీ లాగాడు. దీంతో ఆమె సైకిల్‌ అదుపుతప్పింది.


అదే సమయానికి వెనుక వస్తున్న మరో బైక్‌తోపాటు ఎదురుగా వచ్చిన బైక్‌ ఆమె సైకిల్‌ను ఢీకొట్టాయి. ఈ నేపథ్యంలో రోడ్డుపై పడిన ఆ విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా తలకి బలమైన గాయం తగలడంతో అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.



మరణించిన విద్యార్థిని తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ముగ్గురు నిందితులను ఫైసల్, షాబాజ్, అర్బాజ్‌లుగా గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. వీరిని ఈరోజు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్తుండగా వారు పోలీసుల రైఫిల్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలు అవ్వడంతో ఇద్దరు కదలలేక అక్కడే ఆగిపోగా మరో నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. 20 ఏళ్ల వయసున్న ముగ్గురు నిందితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

First Published:  17 Sep 2023 1:54 PM GMT
Next Story