Telugu Global
National

ఉదయనిధితో పాటు మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడిపై కేసు నమోదు

మతపరమైన మనోభావాలను దెబ్బ తీసినందుకు వారిద్దరిపై యూపీలోని రాంపూర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఉదయనిధితో పాటు మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడిపై కేసు నమోదు
X

'సనాతన ధర్మం నిర్మూలన' వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఒక కార్యక్రమంలో 'సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి' అంటూ వ్యాఖ్యానించారు. దేశంలో మానవత్వం పరిఢవిల్లాలంటే ఆ ధర్మాన్ని కూకటి వేళ్లతో పెకిలించాని పిలుపునిచ్చారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే సమర్థించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై కేసు నమోదు అయ్యింది.

మతపరమైన మనోభావాలను దెబ్బ తీసినందుకు వారిద్దరిపై యూపీలోని రాంపూర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 295-ఏ (మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం), 153-ఏ(రెండు వర్గాలను రెచ్చగొట్టడం) సెక్షన్ల కింద ఇద్దరిపై కేసు బుక్ అయ్యింది. యూపీలోని రాంపూర్‌కు చెందిన లాయర్లు హర్ష్ గుప్తా, రామ్ సింగ్ లోదీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాంపూర్‌లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

తమ మనోభావాలు దెబ్బతీసేలా రాజకీయ ప్రకటనలు చేసినట్లు ఉదయనిధిపై ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వైరస్‌లతో ఉదయనిధి పోల్చారని.. ఇవి తమ మనోభావాలను దెబ్బతీశాయని వారు పేర్కొన్నారు.

కాగా, డీఎంకేకు చెందిన ఉదయనిధి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దీనిపై సీరియస్‌గానే స్పందించింది. ఇది విద్వేష ప్రసంగం కిందకే వస్తుందని బీజేపీ ఆరోపించింది. ఇండియా కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ఉదయనిధి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.

First Published:  6 Sep 2023 6:13 AM GMT
Next Story