Telugu Global
International

చంద్రుడిపై ప్లాట్ కొనుగోలు చేయవచ్చు.. కానీ ఇక్కడే పెద్ద ట్విస్టుంది

చంద్రుడిపై ప్లాట్లు కొనుగోలు చేసినా.. దాని యాజమాన్యపు హక్కులు మాత్రం పొందడం అసాధ్యం.

చంద్రుడిపై ప్లాట్ కొనుగోలు చేయవచ్చు.. కానీ ఇక్కడే పెద్ద ట్విస్టుంది
X

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయిన తర్వాత చంద్రుడికి సంబంధించిన అనేక ముచ్చట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో చంద్రుడిపై తెలంగాణకు చెందిన ఒక మహిళ ప్లాట్ కొనుగోలు చేసిన వార్త వైరల్ అయ్యింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచందర్-వకుళాదేవి దంపతుల పెద్ద కుమార్తె సుద్దాల సాయి విజ్ఞత అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో గవర్నర్ కిమ్ రెనాల్స్ వద్ద ప్రాజెక్ట్ మేనేజర్, ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పని చేస్తున్నారు.

చంద్రుడిపై భూమి కొనుగోలు చేయవచ్చని తెలుసుకున్న సాయి విజ్ఞత.. తన తల్లి, కూతురు పేరు మీద చంద్రుడిపై ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. ఇప్పుడు ఈ వార్త మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం సాయి విజ్ఞత మాత్రమే కాకుండా.. అనేక మంది ప్రముఖులు కూడా చంద్రుడిపై ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే, చంద్రుడిపై ప్లాట్లు కొనుగోలు చేస్తే అది మన సొంతం అవుతుందా? ఎప్పటికైనా చంద్రుడిపైకి వెళ్తే.. మన సొంత ప్లాటులో నివాసం ఉండవచ్చా అనే విషయంపై నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు.

చంద్రుడిపై ప్లాట్లు కొనుగోలు చేసినా.. దాని యాజమాన్యపు హక్కులు మాత్రం పొందడం అసాధ్యం. చంద్రుడిపై ఉండే ప్లాట్ కేవలం మీ పేరుపై మాత్రమే రిజిస్టర్ అయి ఉంటుంది. అంతే కానీ దాన్ని క్లెయిమ్ చేసుకోలేరు. దానిపై ఎలాంటి హక్కులు ఉండబోవు. ఇందుకు 1967లో 104 దేశాలు చేసుకున్న ఒప్పందమే కారణం.

1967లో సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ కొలోనియల్ కాంపిటీషన్‌ను నిరోధించడానికి ఔటర్ స్పేస్ ట్రీటీ అని పిలిచే అంతర్జాతీయ ఒప్పందానికి తెర తీశాయి. దీని ప్రకారం భూమిని దాటి ఉండే ఏ ప్రాంతంపై అయినా ఏ ఒక్క వ్యక్తికి గానీ.. ఏ దేశానికి గానీ యాజమాన్యపు హక్కులు ఉండబోవని ఈ ఒప్పందం తెలియజేస్తుంది. దీనిపై అప్పట్లోనే 104 దేశాలు సంతకాలు చేశాయి. ఈ అగ్రిమెంట్‌పై ఇండియా కూడా సంతకం చేసింది.

అంటే చంద్రుడిపై ప్లాటు, ఫలానా నక్షత్రం నాది అని చెప్పుకొని తిరగవచ్చు. కానీ దాన్ని మీ సొంతం చేసుకోలేరు. కాగా, ఈ ఒప్పందం అమలులో ఉన్నా.. లూనార్ రిజిస్ట్రీ అనే సంస్థ సరదాగా చంద్రుడిపై ప్లాట్లు అమ్మేస్తోంది. https://lunarregistry.com అనే వెబ్‌సైట్‌కు వెళ్లి మీరు కూడా చంద్రుడిపై ప్లాట్లు కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ప్లాటు కొనుగోలు చేసిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా పంపిస్తారు. ఇక వీటిని చూసుకొని మురిసిపోవడమే తప్ప.. దానిపై మీకు ఎలాంటి అధికారం ఉండబోదు.

First Published:  26 Aug 2023 3:36 PM GMT
Next Story