Telugu Global
International

800 కోట్లు దాటిన ప్రపంచ జనాభా

ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్ల(800 కోట్లు) మార్క్‌ను అందుకోనుంది. యునైటెడ్ నేషన్స్ అంచనా ప్రకారం నవంబర్ నెల మధ్యలో మానవాళి ఈ మైల్ స్టోన్‌ను దాటనుంది.

800 కోట్లు దాటిన ప్రపంచ జనాభా
X

ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్ల(800 కోట్లు) మార్క్‌ను అందుకోనుంది. యునైటెడ్ నేషన్స్ అంచనా ప్రకారం నవంబర్ నెల మధ్యలో మానవాళి ఈ మైల్ స్టోన్‌ను దాటనుంది. అయితే ఒకప్పుడు నాలుగు బిలియన్లు ఉన్న జనాభా డబుల్ అవ్వడానికి పట్టుమని యాభై ఏళ్లు కూడా పట్టలేదు. మరి ఈ జనాభా సంఖ్య మున్ముందు ఎలా ఉండబోతోంది? పెరుగుతుందా? తగ్గుతుందా?

మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద ఛాలెంజ్ జనాభా పెరుగుదల. అయితే రానున్న రోజుల్లో జనాభా పెరుగుదల కంటే తగ్గుదల ఎక్కువ ఇబ్బంది పెట్టే అంశం అని యునైటెడ్ నేషన్స్ అంచనా వేస్తుంది. ప్రపంచ జనాభా 1974లో 400 కోట్లు ఉంటే.. 2022 నాటికి జనాభా డబుల్ అయ్యి 800 కోట్లకు చేరుకుంది. కానీ ఇకపై జనాభాలో తగ్గుదల మొదలవుతుందని పలు స్టడీలు చెప్తున్నాయి. యాభై ఏళ్ల లోపు 400 కోట్ల వరకూ పెరిగిన జనాభా.. మరో 60 ఏళ్లలో కేవలం 200 కోట్లు మాత్రమే పెరిగే అవకాశం ఉందని యునైటెడ్ నేషన్స్ అంచనా వేసింది. అంటే 2080 నాటికి ప్రపంచ జనాభా వెయ్యికోట్లకు మాత్రమే చేరుకుంటుంది. దీనికి కారణం ఫెర్టిలిటీ రేటు తగ్గుతుండడమే. 1950 ల్లో 4.5 గా ఉన్న ఫెర్టిలిటీ రేటు 2020 నాటికి 2.4 కి పడిపోయింది. రానున్న రోజుల్లో 2.1 కి తగ్గే అవకాశాలున్నాయి. ఫెర్టిలిటీ రేటు అంటే ఒక మహిళకు సగటున పుట్టే బిడ్డల సంఖ్య. సగటున ప్రతి మహిళా ఇద్దరు పిల్లలకు జన్మనిస్తే జనాభా సంఖ్యలో పెద్దగా తేడాలుండవు. అంతకంటే పెరిగితే జనాభా పెరుగుతుంది. తగ్గితే జనాభా కూడా తగ్గుతుంది. దీన్ని బట్టి చూస్తే మరో యాభై ఏళ్లలో ప్రపంచ జనాభా భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దేశాలవారీగా ఈ పరిస్థితి మారొచ్చు. ఉదాహరణకు రాబోయే రోజుల్లో కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, నైజీరియా, పిలిప్ఫైన్స్, టాంజానియా, పాకిస్తాన్ దేశాల్లో జనాభా పెరిగే అవకాశాలుంటే.. చైనాలో తగ్గే అవకాశం ఉంది.

రాబోయే పదేళ్లలో ఇండియా జనాభా చైనాను దాటేస్తుంది. కానీ దీర్ఘకాలంలో చూసుకుంటే మనదేశంలో కూడా ఫెర్టిలిటీ రేటు ఇబ్బంది పెట్టే సమస్యే. డెబ్భై ఏళ్ల క్రితం భారతీయ మహిళలు సగటున ఆరుగుర్ని కనేవాళ్లు. ఇప్పుడా సగటు 2.2కు పడిపోయింది. 2006–08 మధ్య కాలంలో భారత్‌ సగటు ఫెర్టిలిటీ రేటు 2.7 ఉంటే.. తాజాగా అది 2.2గా ఉంది. సాధారణంగా ప్రతి వెయ్యి మంది జనాభాకు 183 మంది పిల్లల్ని కనగలిగే మహిళలు ఉంటారు. వీళ్లు సరైన వయస్సులో పిల్లలకు జన్మనిస్తేనే జనాభా వయస్సుల్లో అసమానతలు ఉండవు. లేటు మ్యారేజీలు, పిల్లలను ఆలస్యంగా కనడం లాంటి కారణాల వల్ల సంతానోత్పత్తి సమస్యగా మారింది. దీనికి తోడు ఆర్థిక, సామాజిక పరిస్థితుల వల్ల కూడా ఫెర్టిలిటీ రేటు తగ్గుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు.

ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉంది. దక్షిణాదిలో ఏ రాష్ట్రం చూసుకున్నా 1.7 కంటే ఎక్కువ లేదు. ఇలా జనాభా తగ్గుతూపోతే యువత తగ్గిపోయి వర్క్‌ ఫోర్స్‌ అంటే పనిచేసే వాళ్ల సంఖ్య పడిపోతుంది. వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. ఏదేమైనా భూమిపై ఉన్న వనరులను బట్టి ప్రపంచ జనాభా స్థిరంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు భావిస్తున్నారు. ఫెర్టిలిటీ రేటు మరీ పెరగకుండా అలాగే తగ్గకుండా కాపాడుకోవాల్సి ఉంది. వనరులు తక్కువగా ఉన్న దేశంలో జనాభా పెరిగిపోతే ఆకలి సమస్యలు తలెత్తుతాయి. దేశ సామర్థ్యాన్ని బట్టి జనాభాను కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.

First Published:  8 Nov 2022 2:04 PM GMT
Next Story