Telugu Global
International

భూకంపం వచ్చి అల్లాడుతున్న సిరియాపై ఇజ్రాయిల్ క్షిపణి దాడులు...15 మంది పౌరులు మృతి !

ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు సెంట్రల్ డమాస్కస్‌లోని కాఫర్ సౌసా పరిసరాల్లోని ఇరాన్ రాయబార కార్యాలయానికి దగ్గరగా ఉన్న భవనంపై జరిగినట్టు సాక్షులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

భూకంపం వచ్చి అల్లాడుతున్న సిరియాపై ఇజ్రాయిల్ క్షిపణి దాడులు...15 మంది పౌరులు మృతి !
X

ఇప్పటికే భూకంపంతో అల్లకల్లోలంగా ఉన్న సిరియాపై ఇజ్రాయిల్ క్షిపణి దాడులతో విరుచుకపడింది.

సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 15 మంది పౌరులు మరణించారు, అనేక‌ మంది గాయపడ్డారు. అనేక నివాస భవనాలు దెబ్బతిన్నాయని సిరియన్ స్టేట్ మీడియా నివేదించింది.

ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు సెంట్రల్ డమాస్కస్‌లోని కాఫర్ సౌసా పరిసరాల్లోని ఇరాన్ రాయబార కార్యాలయానికి దగ్గరగా ఉన్న భవనంపై జరిగినట్టు సాక్షులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

12.30 గంటలకు (2130 GMT శనివారం) రాజధాని మధ్య ప్రాంతంలో పెద్ద పెద్ద పేలుళ్లు వినిపించాయి. "డమాస్కస్ ఆకాశం నుంచి శత్రు దాడులను ఎదుర్కొంటోంది" అని సిరియన్ అరబ్ న్యూస్ ఏజెన్సీ SANA నివేదించింది.

" డమాస్కస్. ఆ పరిసర ప్రాంతాలలో అనేక పౌర గృహాలు కూలిపోయాయి. దాడి జరిగిన చుట్టుపక్కల అనేక ఇళ్ళు ధ్వంసం అయ్యాయి." అని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

దాదాపు ఒక దశాబ్ద కాలంగా సిరియా, ఇరాన్ మధ్య స్నేహం పెరగడం, ఇరాన్ సిరియాకు పెద్ద ఎత్తున ఆయుధాలను సప్లై చేయడం, ఇరానియన్ సైన్యం సిరియాలో ఉండటం ఇజ్రాయిల్ కు కోపంగా ఉంది. అందుకే ఇజ్రాయెల్ ఈ వైమానిక దాడులను నిర్వహిస్తోంది అని రాయిటర్స్ నివేదించింది.

తాజా దాడిపై వ్యాఖ్యానిస్తూ, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసర్ కనాని, అసలే బాధల్లో ఉన్న సిరియా పై దాడి దుర్మార్గమని మండిపడ్డారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.

"ఇటీవలి భూకంపం సృష్టించిన విధ్వంసం నుంచి సిరియా ఇంకా బయటపడకముందే సిరియాపై ఇజ్రాయిల్ దాడి చేసి సిరియా బాధలను మంరింత పెంచింది. " అని కనాని అన్నారు, దాడులపై స్పందించాలని UN భద్రతా మండలికి ఆయన‌ పిలుపునిచ్చారు.

కాగా, సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వం, సిరియా అంతర్యుద్ధంలో తమ‌ తరపున ఇరాన్ దళాలు పనిచేస్తున్నాయని బహిరంగంగా ఎప్పుడూ అంగీకరించలేదు, టెహ్రాన్‌లో కేవలం సైనిక సలహాదారులు మాత్రమే ఉన్నారని చెప్పారు.

First Published:  19 Feb 2023 8:30 AM GMT
Next Story