Telugu Global
International

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్.. చైనాను అధిగమించి తొలి స్థానంలోకి..

జనాభాకు సంబంధించి చైనా, భారత్ నుంచి కచ్చితమైన సమాచారం అందకపోవడం వల్లే ఏప్రిల్‌లో ఏ తేదీన భారత్‌లో అత్యధిక జనాభా నమోదవుతుందన్న విషయం చెప్పలేమని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్.. చైనాను అధిగమించి తొలి స్థానంలోకి..
X

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు చైనా అత్యధిక జనాభా ఉన్న దేశంగా రికార్డుల్లో ఉండగా.. తాజాగా చైనా కంటే 29 లక్షల మంది అధిక జనాభాతో భారత్ ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు యునైటెడ్ నేషన్స్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన తాజా నివేదికను ఐక్యరాజ్య సమితి బుధవారం విడుదల చేసింది. ప్రపంచ జనాభాకు సంబంధించిన సమాచారాన్ని 1950 నుంచి యూఎన్ఓ వెల్లడిస్తూ వస్తోంది. ఆ జాబితాలో ఇండియా అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

జనాభా అంచనాలకు సంబంధించి 'స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు - 2023' పేరుతో తాజాగా యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ నివేదికను విడుదల చేసింది. లేటెస్ట్ రిపోర్టు ప్రకారం ఇండియాలో అత్యధికంగా 142.86 కోట్ల జనాభా ఉండగా.. చైనాలో 142.57 కోట్లుగా పేర్కొన్నది. అంటే మన దేశంలో కంటే చైనాలో 29 లక్షల మంది తక్కువగా ఉన్నట్లు యూఎన్ఓ నివేదికలో వెల్లడించింది. మూడో స్థానంలో అమెరికా ఉండగా.. అక్కడ కేవలం 34 కోట్ల జనాభా మాత్రమే ఉన్నది.

ప్రపంచంలో దాదాపు 804.5 కోట్ల మంది ప్రజలు ఉన్నారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అందులో మూడింటా ఒకటో వంతు జనాభా కేవలం ఇండియా, చైనాలోనే ఉండటం గమనార్హం. జనాభాను నియంత్రించడానికి రెండు దేశాల ప్రభుత్వాలు కొన్నేళ్లుగా అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నాయి. కుటుంబ నియంత్రణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో చైనాలో జనాభా గణనీయంగా తగ్గిపోయింది. అదే సమయంలో ఇండియాలో కూడా జనాభా తగ్గుదల కనిపించింది.

ఇండియాలో 2011 నుంచి జనాభా పెరుగుదల 1.2 శాతం పెరుగుతూ వస్తోంది. అయితే అంతకు ముందు పదేళ్లు మాత్రం 1.7 శాతంగా ఉండేది. ఇక చైనా గణాంకాల ప్రకారం.. ఆ దేశంలో జనాభా పెరుగుదల గత ఆరేళ్లతో పోలిస్తే భారీగా క్షీణించినట్లు కనపడుతున్నది. వాస్తవానికి ఈ రోజే చైనాను భారత్ అధిగమిస్తుందని కచ్చితంగా చెప్పడానికి వీల్లేదు. అయితే పలు అంతర్జాతీయ సంస్థల నివేదికలను బట్టి ఏప్రిల్‌లో ఏదో ఒక రోజు భారత్ నెంబర్ 1 దేశంగా అవతరించడం మాత్రం ఖాయం.

జనాభాకు సంబంధించి చైనా, భారత్ నుంచి కచ్చితమైన సమాచారం అందకపోవడం వల్లే ఏప్రిల్‌లో ఏ తేదీన భారత్‌లో అత్యధిక జనాభా నమోదవుతుందన్న విషయం చెప్పలేమని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. కోవిడ్ కారణంగా 2021లో చేపట్టాల్సిన జనగణన ఆలస్యమైంది. వీటికి సంబంధించిన పూర్తి రిపోర్టు ఇంకా రాలేదు. అందుకే ఇండియా జనాభా పెరుగుదల రేటు కచ్చితంగా ఎంతనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే గత గణాంకాల ప్రకారం ఈ నెలలో ఇండియా అత్యధిక జనాభా ఉన్న దేశంగా మాత్రం అవతరిస్తుందని యూఎన్ఓ స్పష్టం చేసింది.

ఇండియాలో వేగంగా జనాభా పెరగడంపై సామాన్యుల్లో ఆందోళన కనిపిస్తోందని తాజా సర్వేలో తేలింది. అయితే, పెరిగే జనాభా వల్ల తీవ్రమైన నష్టాలు వస్తాయని చెప్పడమే ఆ ఆందోళనకు అసలు కారణమని నిపుణులు చెబుతున్నారు. జనాభా పెరుగుదల అంటే పురోగతి, అభివృద్ధి, వ్యక్తిగత హక్కులు, ఇతర అంశాలకు చిహ్నాలుగా చూడాలని యూఎన్‌పీఎఫ్ఏ భారత ప్రతినిధి ఆండ్రియా అభిప్రాయపడ్డారు.

First Published:  19 April 2023 10:34 AM GMT
Next Story