Telugu Global
International

ఇదే జరిగితే.. సెమీకండక్టర్ ఇండస్ట్రీలో చైనాను కొట్టేవాడే ఉండడు!

సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో చైనాను అగ్రగామిగా నిలిపేందుకు గాను ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదే జరిగితే.. సెమీకండక్టర్ ఇండస్ట్రీలో చైనాను కొట్టేవాడే ఉండడు!
X

చైనా ఆలోచనలు చాలా భారీగా.. సుదూర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొనే ఉంటాయి. అన్ని రంగాల్లో ప్రపంచ అగ్రగామిగా ఉండాలనేదే చైనా లక్ష్యం. అక్కడి సామాన్య పౌరుడి నుంచి దేశాధ్యక్షుడి వరకు ఒకేలా ఆలోచిస్తారా అనేలా వారి అభివృద్ధి కూడా ఉంటుంది. 90వ దశకంలో ఇండియా, చైనా జీడీపీ సమానంగా ఉండేది. కానీ ముప్పై ఏళ్లలోనే చైనా అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఇప్పుడు అమెరికాతో నువ్వా నేనా అనేలా చైనా వ్యవహరిస్తోంది. తాజాగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీపై చైనా ఫోకస్ చేసింది. రాబోయే రోజుల్లో ఈ రంగంలో చైనాను ఢీకొట్టే వాడే లేకుండా భారీ స్కెచ్ వేసింది.

సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో చైనాను అగ్రగామిగా నిలిపేందుకు గాను ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను 40 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.3 లక్షల కోట్లు) నిధిని ఏర్పాటు చేయనున్నది. అమెరికాతో పాటు ఈ రంగంలో తమ ప్రత్యర్థులను వెనక్కు నెట్టేలా సెమీ కండకర్ ఇండస్ట్రీని అందనంత ఎత్తుకు తీసుకెళ్లాలని చైనా నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ భారీ ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి నిధుల సమీకరణ మొదలు పెట్టింది. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సెమీకండక్టర్ల ప్రాధాన్యత ఎంతో ఎక్కువ. మొబైల్ ఫోన్ల నుంచి అంతరిక్ష ప్రయోగాల వరకు వీటిపైనే ఎక్కువగా ఆధార పడతారు. కానీ ఈ ఇండస్ట్రీలో ఉత్పత్తి అనుకున్నంత వేగంగా సాగడం లేదు. అందుకే ఈ రంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోడానికి చైనా భారీ ప్రణాళిక సిద్ధం చేసింది.

చైనా ఇలాంటి భారీ ఫండ్‌ను ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో 2104, 2019లో రెండు సార్లు ఇలాంటి భారీ నిధుల సేకరణను చేపట్టింది. 2014లో 138.7 బిలియన్ యువాన్లు, 2019లో 200 బిలియన్ యువాన్ల నిధులను సేకరించింది. ఇక ఇప్పుడు సేకరించబోయే నిధులను చిప్ మాన్యుప్యాక్చరింగ్ రంగానికే ఎక్కువగా కేటాయించనున్నట్లు తెలుస్తున్నది.

సెమీకండక్టర్ల విషయంలో చైనా స్వయం సమృద్ధి సాధించడమే ఆ దేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్ లక్ష్యంగా పెట్టారు. సెమీకండక్టర్ల ఎగుమతి విషయంలో అమెరికా అనేక ఆంక్షలు పెట్టడంతో చైనా ఈ నిర్ణయం తీసుకున్నది. తమ మిలటరీ అవసరాల కోసమే కాకుండా దేశంలోని ఇతర అవసరాలకు సెమీకండక్టర్లను చైనాలోనే భారీ ఎత్తున తయారు చేసేందుకు ఈ నిధిని ఉపయోగించనున్నది.

నిరుడు అక్టోబర్‌లో ఆడ్వాన్స్‌డ్ చిప్ మేకింగ్ పరికరాల విషయంలో చైనాపై అమెరికా ఆంక్షలు విధించింది. అంతే కాకుండా జపాన్, నెదర్లాండ్స్ కూడా ఇలాంటి ఆంక్షలే విధించేలా అమెరికా ప్రేరేపించింది. అప్పుడే చైనా సెమీకండక్టర్ల విషయంలో కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నది. కొన్ని నెలల క్రితమే ఈ ఫండ్‌కు చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చైనా ఆర్థిక శాఖ ఈ ఫండ్‌కు 60 బిలియన్ల యువాన్లను విరాళంగా ఇస్తోంది. అయితే ఇంకా ఎవరెవరు ఈ ఫండ్ ఏర్పాటులో భాగస్వాములయ్యారనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. చైనా ఏర్పాటు చేయనున్న నిధికి ఎవరెవరు విరాళాలు ఇస్తున్నారని 'రాయ్‌టర్స్' ప్రతినిధులు ఆరా తీయగా.. స్పందించడానికి స్టేట్ కౌన్సిల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నిరాకరించినట్లు తెలుస్తున్నది.

నిధుల సేకరణ ఎప్పటికి పూర్తవుతుందో తెలియనప్పటికీ.. వీలైనంత త్వరిత గతిన పూర్తి చేయాలనే సంకల్పంతో చైనా ఉన్నది. ఈ మూడో ఫండ్‌ను ఎప్పటికి లాంఛ్ చేస్తారో కూడా తెలియాల్సి ఉన్నది. గతంలో సేకరించిన రెండు భారీ నిధుల వెనుక ఫైనాన్స్ మినిస్ట్రీతో పాటు చైనా ప్రభుత్వానికి చెందిన చైనా డెవపల్‌మెంట్ బ్యాంక్ కాపిటల్, చైనా నేషనల్ టొబాకో కార్పొరేషన్, చైనా టెలికాంలు ఉన్నాయి.

ఈ మూడో ఫండ్ కోసం నిధుల సేకరణ పూర్తయితే.. చైనాకు చెందిన రెండు చిప్ తయారీ సంస్థలకు ఈ నిధులు వెచ్చించే అవకాశం ఉన్నది. చైనా చిప్ ఇండస్ట్రీ ఇప్పటికీ అంతర్జాతీయంగా కీలకమైన పాత్ర పోషించడంలో సతమతం అవుతోంది. దీన్ని అధిగమించడానికి ఈ నిధి తప్పకుండా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇంత భారీ నిధులతో సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో రారాజుగా నిలవాలని చైనా భావిస్తోంది. అదే జరిగితే ఇక సెమీకండక్టర్ ఇండస్ట్రీలో చైనాను కొట్టే వాడే ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

First Published:  6 Sep 2023 5:33 AM GMT
Next Story