Telugu Global
International

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధంలో కీలక పరిణామం.. బంధీలకు విముక్తి

అయితే బందీల విడుదల ఒప్పందం తాత్కాలికమేనన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు. అంతిమ లక్ష్యాన్ని చేరేవరకు పోరాటం ఆగదన్నారు.

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధంలో కీలక పరిణామం.. బంధీలకు విముక్తి
X

ఎట్టకేలకు ఇజ్రాయెల్‌, హమాస్‌ ఉగ్రవాదుల మధ్య సయోధ్య కుదిరింది. ఇవాళ్టి నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఇజ్రాయెల్‌, హమాస్‌ కాల్పుల విరమణ ప్రక్రియ పలు సంప్రదింపుల తర్వాత శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో బందీల విడుదల మొదలైంది. వాస్తవానికి గురువారమే కాల్పుల విరమణ ప్రారంభం కావాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. గురువారం సాయంత్రం వరకు చర్చలు జరిపిన ఖతార్‌ చివరకు రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చింది.

శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి నాలుగు రోజులపాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది. ఈ 4 రోజులు ఇజ్రాయెల్‌, హమాస్‌ తమ దగ్గర ఉన్న బంధీలను పరస్పరం విడతలవారీగా విడుదల చేసుకుంటాయి. హమాస్‌ 50 మందిని రిలీజ్ చేస్తుండగా, ఇజ్రాయెల్‌ 150 మందిని వదిలిపెడుతోంది. విడుదలకు అర్హులైన 300 మంది లిస్ట్ ఇప్పటికే ఇజ్రాయెల్‌ రిలీజ్ చేసింది. దీంతోపాటు గాజాకు సహాయం చేయాలనుకునే వాళ్లను కూడా ఇజ్రాయెల్‌ అనుమతించింది. శుక్రవారం మధ్యాహ్నానికి 13 మంది బందీలు విడుదల అవుతారు. ఇందులో మహిళలు, పిల్లలున్నారు.

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధంలో ఇప్పటిదాకా 13,300 మంది చనిపోయారు. 6,000 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. అయితే బందీల విడుదల ఒప్పందం తాత్కాలికమేనన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు. అంతిమ లక్ష్యాన్ని చేరేవరకు పోరాటం ఆగదన్నారు.


First Published:  24 Nov 2023 5:09 AM GMT
Next Story