Telugu Global
International

రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్ర దాడి.. - 60 మంది మృతి

దాడికి పాల్పడిన దుండగులు హాల్లో బాంబులు సైతం విసిరినట్టు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. దీంతో భవనమంతా మంటలు వ్యాపించాయి.

రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్ర దాడి.. - 60 మంది మృతి
X

రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు తెగబడ్డారు. క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్లో జరుగుతున్న ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ ’ఫిక్‌ నిక్‌’ సంగీత కార్యక్రమంలోకి తుపాకులతో ప్రవేశించిన దుండగులు జనంపైకి ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో 60 మంది మృతిచెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. సంగీత కార్యక్రమం పూర్తయి జనం బయటికి వెళుతున్న సమయంలో ఈ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఏం జరుగుతోందో అర్థంగాక జనం భయాందోళనలకు గురయ్యారు. పలువురు సీట్ల మధ్య దాక్కున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఐదుగురు సాయుధులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ఈ దాడి తామే చేసినట్లు ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించుకుంది. ఈ దాడికి సంబంధించి సోషల్‌ మీడియాలో పలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. దాడికి పాల్పడిన దుండగులు హాల్లో బాంబులు సైతం విసిరినట్టు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. దీంతో భవనమంతా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనపై అమెరికా వైట్‌హౌస్‌ స్పందిస్తూ.. దాడి ఘటన దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయని తెలిపింది. ఈ ఘటనపై ఇప్పుడే ఏం మాట్లాడలేమని ఆ దేశ జాతీయ భద్రత సలహాదారు జాన్‌ కిర్బీ పేర్కొన్నారు.

గత రెండు దశాబ్దాల్లో రష్యాలో ఇదే అతి పెద్ద ఉగ్రదాడిగా భావిస్తున్నారు. 2002లో చెచెన్‌ మిలిటెంట్లు మాస్కో థియేటర్‌లో సుమారు 800 మందిని బందీలుగా చేసుకున్నారు. దీంతో రష్యాన్‌ ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి వారిని విడిపించాయి. ఈ క్రమంలో 129 మంది బందీలు, 41 మంది మిలిటెంట్లు చనిపోయారు. ఇక 2004లో 30 మంది చెచెన్‌ సాయుధులు బెస్లాన్‌లోని ఓ పాఠశాలను ఆధీనంలోకి తీసుకొని వందల సంఖ్యలో బందీలుగా చేసుకున్నారు. వారిని విడిపించే క్రమంలో సుమారు 330 మంది చనిపోయారు. వారిలో సగం వరకు చిన్నారులే ఉన్నారు.

First Published:  23 March 2024 3:03 AM GMT
Next Story