Telugu Global
International

పాకిస్థాన్‌ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి

పాకిస్తాన్‌లో సైనికులే లక్ష్యంగా ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌‌లో ఉగ్రదాడి జరిగింది.

పాకిస్థాన్‌ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
X

పాకిస్తాన్‌లో సైనికులే లక్ష్యంగా ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌‌లో ఉగ్రదాడి జరిగింది. డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో తాత్కాలిక సైనిక స్థావరంగా వినియోగిస్తున్న పాఠశాల భవనం వద్ద ఉగ్రవాదులు మంగళవారంనాడు తెల్లవారుజామున ఆత్మాహుతి దాడికి జరిపారు. ఈ దాడిలో 23 మంది మృతి చెందగా, మరో ౩౦ మందికి పైగా గాయపడ్డారు. ఈ ఆత్మాహుతి దాడికి బాధ్యతవహిస్తూ పాకిస్థాన్ తాలిబన్లకు చెందిన తెహ్రీక్-ఇ-జిహాద్ పాకిస్థాన్ ప్రకటన చేసింది. ఆత్మాహుతి దాడి జరిగిన సమయానికి సైనికులంతా గాఢనిద్రలో ఉన్నారని , అది కూడా సాధారణ దుస్తుల్లో ఉండటం వల్ల వీరంతా సైనికులేనా లేక బయటి వ్యక్తులు కూడా ఉన్నారా అనేది ఖచ్చితంగా గుర్తించలేకపోతున్నామని అధికారులు వెల్లడించారు.

సైనికులు ఉన్న స్థావరాన్ని పేలుడు పదార్ధాలతో కూడిన వాహనంతో ఉగ్రవాదులు ఢీకొట్టారని, అనంతరం మోర్టార్ దాడులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమైనట్టు స్థానిక ఏఆర్‌వై న్యూస్ ఛానెల్ తెలిపింది. ఘటన సమాచారం తెలియగానే అదనపు భద్రతా బలగాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి.

జిల్లాలోని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించగా, స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. ఈ ఘటనలో మరో 34 మందికి గాయాలయ్యాయని, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. తాత్కాలిక సైనిక స్థావరంగా వినియోగిస్తోన్న పాఠశాల భవనం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపి ఉంచినట్టు గుర్తించారు. పేలుడు ధాటికి మూడు గదులు కుప్పకూలిపోగా.. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

పాకిస్థాన్‌ తాలిబన్లు గత నవంబర్‌ నుంచి వరుస ఉగ్ర దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో పెషావర్‌లో రద్దీగా ఉండే ఒక మసీదు సమీపంలో ఉగ్రవాదులు భారీ పేలుడుకు దిగడంతో సుమారు 100 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

First Published:  12 Dec 2023 11:20 AM GMT
Next Story