Telugu Global
International

' లక్షల మంది మరణాలకు కారణం ఆ 125 మందే, వారిని ప్రభుత్వాలు కట్టడి చేయాలి'

ప్రపంచంలోని వాయు కాలుష్యానికి అత్యంత ధనవంతులైన 125 మందే కారణమని ఆక్స్‌ఫామ్ సంస్థ నివేదించింది.వీరి కంపెనీల వల్ల‌ సంవత్సరానికి 39.3 కోట్ల టన్నుల గ్రీన్‌హౌస్ వాయువులు వెలువడుతున్నాయని ఆక్స్‌ఫామ్ సంస్థ సోమవారం విడుదల చేసిన రిపోర్టులో తెలిపింది.

 లక్షల మంది మరణాలకు కారణం ఆ 125 మందే,  వారిని ప్రభుత్వాలు కట్టడి చేయాలి
X

ప్రపంచంలో వాయుకాలుష్య‍ం వల్ల ప్రతి సంవత్సరం లక్షల మంది మరణాలపాలవుతున్నారు. అయితే ఈ కాలుష్యంలో అత్యంత ఎక్కువ వెదజల్లుతున్నది ప్రంపంచంలోని 125 మంది బిలియనీర్లేనని ఆక్స్‌ఫామ్ సంస్థ నివేదించింది. వీరి కంపెనీల వల్ల‌ సంవత్సరానికి 39.3 కోట్ల టన్నుల గ్రీన్‌హౌస్ వాయువులు వెలువడుతున్నాయని , సగటున ఒక్కొక్క కంపెనీ 30 లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి విడుదల చేస్తోందని ఆక్స్‌ఫామ్ సంస్థ సోమవారం విడుదల చేసిన రిపోర్టులో తెలిపింది.

ఓ సగటు వ్యక్తి విడుదల చేసే గ్రీన్ హౌజ్ వాయువులకన్నా ఈ బిలియనీర్లు విడుదలచేసేది పది లక్షల‌ రెట్లు ఎక్కువ అని నివేదిక తేల్చింది. వీరి కంపెనీలు విడుదల చేసే గ్రీన్ హౌజ్ వాయువులు ఒక్క ఫ్రాన్స్ దేశం విడుదల చేసే మొత్త విషవాయువులతో సమానం.

ఈ 125 మంది అత్యంత ధనికులకు ప్రపంచవ్యాప్తంగా 183 కంపెనీల్లో 2.4 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. ముఖ్యంగా సిమెంట్, శిలాజ ఇంధనాల వంటి అత్యంత ఎక్కువ‌ కాలుష్యాన్ని విడుదల చేసే కంపెనీల్లోనే వీరి పెట్టుబడి అధికంగా ఉంది.

ఈ రిపోర్టులు ఆ కంపెనీలు ఇచ్చే నివేదిక ఆధారంగా తయారు చేశామని, నిజానికి ఆయా కంపెనీలు విడుదల చేసే గ్రీన్ హౌజ్ వాయువుల వాస్తవ సంఖ్యను ఎప్పుడూ బహిర్గతం చేయవని ఆక్స్ ఫామ్ పేర్కొంది. అందువల్ల వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఆక్స్‌ఫామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డానీ శ్రీస్కందరాజా మాట్లాడుతూ... "ప్రపంచ వాతావరణ సంక్షోభానికి దారితీసే కాలుష్యం నుండి ఈ పెట్టుబడిదారులు లాభం పొందాలని చూస్తున్నారు. ఈ ప్రపంచ పర్యావరణ నాశనంలో వీరి పాత్రను బహిర్గతపర్చడం తక్షణ అవసరం. తక్కువ ఆదాయ దేశాల ప్రజలు ఈ పర్యావరణ మార్పులతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పు ఆఫ్రికాలో వినాశకరమైన కరువు, పాకిస్తాన్‌లోని తీవ్ర‌ వరదలతో ప్రజలు అల్లకల్లోలం అవుతున్నారు. ఈ పెట్టుబడిదారులను బహిర్గతం చేయడం అలాంటి పేద దేశాలకు చాలా అవసరం'' అని అన్నారు.

"ఈ 125 మంది తమ కంపెనీల ద్వారా విడుదల చేస్తున్న కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వాలు వారిని నియంత్రించాలి. వారి సంపదపై అధిక పన్నులు విధించాలి.'' అని డానీ శ్రీస్కందరాజా అన్నారు

"వాతావరణాన్ని ఇన్ బ్యాలెన్స్ చేయడంలో ఈ అతి సంపన్నుల పాత్ర చాలాఎక్కువని అయితే వీరి పాత్రపై చర్చ జరగడం లేదని, వారు చాలా కాలంగా జవాబుదారీతనం నుండి తప్పించుకున్నారు.ఈ పరిస్థితి మారాలి అని ఆయన అన్నారు.

భూ వాతావరణం 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ వేడెక్కడం అనే ప్రపంచ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ బిలియనీర్లపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం తక్షణావసరం , 2050 నాటికి కార్బన్ న్యూట్రాలిటీని చేరుకోవడానికి గ్లోబల్ క్లైమేట్ ఛేంజ్ లక్ష్యాలకు అనుగుణంగా స్వల్ప-మధ్యకాలిక లక్ష్యాలతో సమయానుకూలమైన వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళికలను ప్రభుత్వాలు రూపొందించాలని ఆక్స్ ఫామ్ పేర్కొంది.

అంతే కాదు ప్రపంచంలోని అత్యంత సంపన్నులపై సంపద పన్ను సంవత్సరానికి 1.4 ట్రిలియన్ డాలర్లు సేకరించవచ్చని ఆక్స్‌ఫామ్ అంచనా వేసింది. ఈ సొమ్ము ను వాతావరణ సంక్షోభం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశాలకోసం ఖర్చుపెట్టాలని ఆక్స్‌ఫామ్ సూచించింది.

ఈజిప్టు వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ వాతావరణ సదస్సు నేపథ్యంలో ఆక్స్ ఫామ్ ఈ నివేదికను విడుదల చేయడం గమనార్హం

First Published:  8 Nov 2022 10:28 AM GMT
Next Story