Telugu Global
NEWS

చెప్పింది చెప్పినట్లు చేసిన విజయ్ దేవరకొండ

త్వరలో హైదరాబాద్ లో జరిగే ఖుషి సినిమా ఈవెంట్ లో వందమంది అభిమానులకు విజయ్ దేవరకొండ చెక్కులు పంపిణీ చేయబోతున్నారు.

చెప్పింది చెప్పినట్లు చేసిన విజయ్ దేవరకొండ
X

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్న చిన్న పాత్రలతో పరిచయమై ఒక్కో మెట్టు ఎక్కుతూ అతి తక్కువ కాలంలోనే పెద్ద స్టార్ గా ఎదిగిన వ్యక్తి విజయ్ దేవరకొండ. ఇటీవల ఆయన ఖుషి అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఈ సినిమా విజయోత్సవ సభలో విజయ్ మాట్లాడుతూ.. సినిమాల ద్వారా తాను సంపాదించిన మొత్తంలో కొంతమేర అభిమానులకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. వందమంది అభిమానులను ఎంపిక చేసి వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

తాజాగా విజయ్ దేవరకొండ ఎంపిక చేసిన 100 మంది అభిమానుల లిస్టును ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్ లో ఎంపిక చేసిన 100 మంది అభిమానుల పేర్లు, ఊరి పేర్లు ఉన్నాయి. ఈ లిస్టులో ఉన్న అభిమానుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా తమిళనాడు, కర్ణాటకకు చెందిన అభిమానులు కూడా ఉన్నారు.


త్వరలో హైదరాబాద్ లో జరిగే ఖుషి సినిమా ఈవెంట్ లో వందమంది అభిమానులకు విజయ్ దేవరకొండ చెక్కులు పంపిణీ చేయబోతున్నారు. ఖుషి సినిమా విజయవంతమైన నేపథ్యంలో తన సంతోషాన్ని షేర్ చేసుకునేందుకే ఈ వందమంది కుటుంబాలను ఎంపిక చేసినట్లు సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ వెల్లడించారు. ఈ లిస్టులో పేరున్న కుటుంబాలు ఎంతో ఆనందిస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఖుషి సినిమా ఓవర్సీస్ తో పాటు నైజాంలో మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఆంధ్రా ప్రాంతంలో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. దీంతో ముందు ప్రకటించినట్లు అభిమానులకు విజయ్ సహాయం చేస్తారా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా విజయ్ దేవరకొండ తాను సహాయం చేసే వందమంది పేర్ల లిస్ట్ కూడా విడుదల చేయడంతో విజయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  14 Sep 2023 11:04 AM GMT
Next Story