Telugu Global
Health & Life Style

ఆలివ్ ఆయిల్... మెదడుకి ఎంతో మేలు

ఆలివ్ ఆయిల్ లో ఉన్న పాలీఫెనాల్స్ మెదడుకి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ (వాపు మంటలకు విరుగుడు) లక్షణాలు ఉంటాయి.

ఆలివ్ ఆయిల్... మెదడుకి ఎంతో మేలు
X

ఆలివ్ ఆయిల్... మెదడుకి ఎంతో మేలు

ఆహారంలో ఆలివ్ ఆయిల్ ని జోడించడం వలన మెదడుకి డిమెన్షియా వ్యాధి వచ్చే అవకాశం, దాని కారణంగా మరణించే ప్రమాదం తగ్గుతాయని హార్వర్డ్ టి హెచ్ ఛాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి, తార్కికంగా ఆలోచించే గుణం తగ్గుతూ మెదడు సామర్ధ్యం, ఆరోగ్యం క్షీణించి పోయే పరిస్థితిని డిమెన్షియాగా చెప్పవచ్చు. ఈ సమస్య ఉన్నవారు తమ రోజువారీ పనులను నిర్వహించలేని స్థితికి చేరతారు. గుండె ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ మేలు చేస్తుందని ఇప్పటికే పరిశోధనలు తేల్చి చెబుతుండగా మెదడు ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఈ అధ్యయనంలో తేలింది.

ఆలివ్ ఆయిల్ లో ఉన్న పాలీఫెనాల్స్ మెదడుకి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ (వాపు మంటలకు విరుగుడు) లక్షణాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఆక్సీకరణ (మన శరీరంలోని కణాలకు హానిచేసే ఒక రసాయనిక ప్రక్రియని ఆక్సిడేషన్ లేదా ఆక్సీకరణ అంటారు) వలన మెదడుకి కలిగే ఒత్తిడినుండి మెదడు కణాలను రక్షించడం. యాంటీ ఆక్సిడెంట్లు ఈ పనిచేస్తాయి. దాంతో మెదడుకి వచ్చే అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

మధ్యధరా ప్రాంతపు ఆహారపు విధానంలో ఆలివ్ ఆయిల్ ని ఆరోగ్యకరమైన కొవ్వుని ఇచ్చే పదార్థంగా తీసుకుంటూ ఉంటారు. ఇది పెద్ద వయసువారిలో మెదడుకి సంబంధించిన వ్యాధులను, క్షీణతని తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ తో ఎన్నో రకాల ఆరోగ్యలాభాలున్నాయని ఇది క్యాన్సర్, గుండె మెదడుకి సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.

ఆలివ్ ఆయిల్ తో...

-ఆలివ్ ఆయిల్ డిమెన్షియాకి చికిత్సగా పనిచేస్తుందని చెప్పలేము. కానీ దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవటం వలన డిమెన్షియా వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. ఇందులోఉన్న ఇ విటమిన్, పాలిఫెనాల్స్ మెదడు కణాలను జరిగే హానిని, వయసు కారణంగా వచ్చే క్షీణతని నివారిస్తాయి.

-ఆలివ్ ఆయిల్ శరీరంలో రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీనివలన ఆక్సిజన్ సవ్యంగా సరఫరా అయి మెదడులోని వివిధ భాగాల మధ్య అనుసంధానం బాగుంటుంది.

ఎంత తీసుకోవచ్చు...

మనం తీసుకునే ఆహారం, జీవనశైలి, మన ఆరోగ్యం ఆధారంగా మనం తీసుకోవాల్సిన ఆలివ్ ఆయిల్ మోతాదుని నిర్ణయించుకోవాలి. సాధారణంగా అయితే రోజుకి ఒక టేబుల్ స్పూను నుండి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు దీనిని తీసుకోవచ్చు. అయితే ఇందులో కేలరీలు హెచ్చుగా ఉంటాయి కనుక దీనిని ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా రోజంతటిలో విభజించి తీసుకోవాలి.

-ఆలివ్ ఆయిల్ లో ఉన్న మోనో శాచురేటెడ్ ఫ్యాట్ వలన మనకు అనేక లాభాలుంటాయి.

ఆలివ్ ఆయిల్ స్మోక్ పాయిట్ తక్కువగా ఉండటం వలన దీనిని మరీ ఎక్కువగా వేడి చేయకూడదు.

-పిల్లలకు ఆలివ్ ఆయిల్ ని వాడటం వలన వారిలో పెరుగుదల బాగుంటుంది. జీర్ణశక్తిని మెరుగుపరచి, వాపు మంట లక్షణాలతో కూడిన ఇన్ ఫ్లమేషన్ రాకుండా చేస్తుంది. పిల్లల వయసు, వారికి అవసరమైన కేలరీలను బట్టి దీనిని తీసుకోవాల్సిన మోతాదుని నిర్ణయించుకోవాలి. అనారోగ్యకరమైన కొవ్వులకు దీనిని ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. పిల్లల వైద్యుల సలహా తీసుకుని పిల్లలకు ఆలివ్ ఆయిల్ ని ఇవ్వటం మంచిది.

First Published:  29 July 2023 5:55 PM GMT
Next Story