Telugu Global
Health & Life Style

ఆస్తమా నుంచి ఎలా బయటపడొచ్చంటే..

ఆస్తమా సమస్య చలికాలంలో మరింత ఎక్కువగా ఉంటుంది.

ఆస్తమా నుంచి ఎలా బయటపడొచ్చంటే..
X

మనదేశంలో సుమారు రెండు కోట్లమంది ఆస్తమా సమస్యతో బాధపడుతున్నట్టు రిపోర్ట్‌లు చెప్తున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే చలికాలంలో చల్లదనానికి శ్వాసకోశ నాళాలు కుంచించుకుపోయి, ఆస్తమా సమస్య పెరుగుతుంది. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

మామూలుగా మనం పీల్చే గాలి వాయు నాళాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. కొన్నికారణాల వల్ల అవి ఉబ్బిపోయి, గాలి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. దీంతో శ్వాస సజావుగా జరగదు. కొద్దిపాటి పని చేసినా ఆయాసం వచ్చేస్తుంది. దీన్నే ఆస్తమా అంటారు.

ఆస్తమా సమస్య చలికాలంలో మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే దుస్తులు వేసుకోవడం ద్వారా వాయునాళాల వాపు తగ్గుతుంది. శ్వాస సజావుగా సాగుతుంది.

చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తే.. వాటి ప్రభావం శ్వాస వ్యవస్థపై పడొచ్చు. అందుకే ఆస్తమా ఉన్నవాళ్లు వీలైనంతవరకూ ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు, వెచ్చటి ఆహారాలు తీసుకుంటుండాలి.

చలికాలంలో కఠినమైన వ్యాయామాలు చేయకూడదు. బ్రీత్ రేట్ పెరగకుండా తేలికపాటి స్ట్రెచింగ్‌లు చేయొచ్చు.

ఆస్తమా ఉన్నవాళ్లు విటమిన్‌–డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా సమస్య నుంచి రిలీఫ్ పొందొచ్చు. విటమిన్–డి కోసం పాలు, గుడ్లు, సాల్మన్ చేపలు.. వంటివి తీసుకోవాలి.

ఆస్తమా నుంచి రిలీఫ్‌ కోసం పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉండే అరటిపండ్లు, మెగ్నీషియం ఎక్కువగా ఉండే గుమ్మడి గింజలు, డార్క్‌ చాక్లెట్‌.. వంటివి తీసుకోవాలి.

విటమిన్‌–ఎ ఎక్కువగా ఉండే క్యారెట్స్‌, చిలగడదుంపలు, ఆకుకూరల వంటివి.. శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ఆస్తమా ఉన్నవాళ్లు క్యాబేజీ, ఉల్లిపాయలు, మసాలాలు, కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.

ఉబ్బసం రాకుండా ఉండేందుకు ప్రతి రోజూ ఉదయం వేడినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. అల్లం, తేనె, నిమ్మరసంతో చేసిన టీ కూడా తాగొచ్చు.

ఆస్తమా ఉన్నవాళ్లు ఇన్‌హేలర్‌‌ను ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో పొల్యూషన్‌కు దూరంగా ఉండాలి. డాక్టర్లు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడాలి.

First Published:  24 Dec 2023 10:00 AM GMT
Next Story