Telugu Global
Health & Life Style

వ్యాయామం గురించి అపోహలు.. వాస్తవాలు!

వ్యాయామం వల్ల ఎన్ని లాభాలున్నాయో.. సరైన అవగాహన లేకుండా చేసే వ్యాయామాల వల్ల నష్టాలూ ఉన్నాయి.

వ్యాయామం గురించి అపోహలు.. వాస్తవాలు!
X

రకరకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేందుకు యాక్టివ్ లైఫ్‌స్టైల్ ఉండడం అవసరం. రోజూ వ్యాయామం చేయడం వల్ల చాలారకాల అనారోగ్యాలను నివారించుకోవచ్చని డాక్టర్లు చెప్తుంటారు. అయితే వ్యాయామం చేయడం గురించి చాలామందిలో రకరకాల అపోహలు ఉంటాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం.

వ్యాయామం వల్ల ఎన్ని లాభాలున్నాయో.. సరైన అవగాహన లేకుండా చేసే వ్యాయామాల వల్ల నష్టాలూ ఉన్నాయి. అందుకే వ్యాయామం ఎవరు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? అనే విషయాల్లో కొంత స్పష్టత అవసరం.

వయసు ముదిరే కొద్దీ వ్యాయామం లాంటివి చేయకూడదని ఒక అపోహ ఉంది. అయితే ఇది వాస్తవం కాదు. వయసు మీద పడినవాళ్లు ఎక్కువగా రెస్ట్ తీసుకుంటుంటారు. కాబట్టి శరీరానికి ఎంతో కొంత కదలిక అవసరం. లేకపోతే కీళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వయసు మీద పడిన వాళ్లు వాకింగ్ లాంటి తేలిక పాటి వ్యాయామాలు చేయడం మంచిది.

వ్యాయామంతో ఎక్కువ అలసిపోతాం, పని చేసుకోలేము. అన్న మరో అపోహ కూడా ఉంది. అయితే ఇందులో కూడా నిజం లేదు. వ్యాయామం చేయడం వల్ల మెటబాలిజం పెరిగి మరింత ఉత్సాహంగా అనిపిస్తుంది. అయితే వ్యాయామం చేసేవాళ్లు ఖర్చు చేసిన క్యాలరీలను తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాయామంతోపాటు సరైన డైట్ పాటించడం కూడా ముఖ్యమే.

తిన్న తర్వాత వ్యాయామం చేయొచ్చా? లేదా? అన్న విషయంలో కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అయితే తిన్న తర్వాత కష్టతరమైన వ్యాయామాలు చేయడం మంచిది కాదని, కేవలం వాకింగ్ మాత్రమే చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

వ్యాయామంతో టైం వేస్ట్, డైట్ సరిగ్గా ఉంటే చాలు.. అని కొంతమంది భావిస్తుంటారు. అయితే డైట్‌తో పాటు వ్యాయామం కూడా అత్యంత ముఖ్యం అని నిపుణులు చెప్తున్నారు. హెల్దీ లైఫ్ కోసం వారానికి 150 నిముషాల వ్యాయామం ఉండాలి. వ్యాయామం వల్ల టైం వేస్ట్ అవ్వడం మాట అటుంచితే.. మానసిక ఆరోగ్యం మెరుగుపడి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. తద్వారా సమయం కలిసొస్తుంది.

ఇకపోతే వ్యాయామాలను ఎంచుకునే క్రమంలో కొంతమంది పొరబడుతుంటారు. ఫిట్‌గా ఉన్నవాళ్లు అదే ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేయడానికి వెయిట్ ట్రైనింగ్, కార్డియో.. రెండు రకాల వ్యాయామాలు చేయొచ్చు. అయితే బరువు తగ్గాలనుకునేవాళ్లు ముందుగా కార్డియోతో మొదలుపెట్టాలి. కీళ్లనొప్పులు ఉన్నవాళ్లు బరువులు ఎత్తే వ్యాయామాలు చేయకూడదు. ఏదేమైనా వ్యాయామాలను ఎంచుకునేటప్పుడు మీ అవసరాలను బట్టి నిపుణుల సలహా తీసుకోవడం ఎంతైనా మంచిది.

First Published:  1 April 2024 11:07 AM GMT
Next Story