Telugu Global
Health & Life Style

కాఫీ మనదేశానికి ఎలా వచ్చిందో తెలుసా?

కమ్మని కాఫీ గొంతులో పడనిదే రోజు మొదలవ్వదు చాలామందికి. ఓ కప్పు కాఫీ తాగితే ఫుల్ ఎనర్జీ వస్తుంది. కాఫీని కేవలం డ్రింక్ గా కాదు, దాన్నొక ఎమోషన్ లా ఫీలయ్యేవాళ్లూ ఉన్నారు.

కాఫీ మనదేశానికి ఎలా వచ్చిందో తెలుసా?
X

కమ్మని కాఫీ గొంతులో పడనిదే రోజు మొదలవ్వదు చాలామందికి. ఓ కప్పు కాఫీ తాగితే ఫుల్ ఎనర్జీ వస్తుంది. కాఫీని కేవలం డ్రింక్ గా కాదు, దాన్నొక ఎమోషన్ లా ఫీలయ్యేవాళ్లూ ఉన్నారు. అయితే కాఫీ అనేది మనచేతి వరకూ రావడం వెనుక చాలానే హిస్టరీ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రీ.శ. తొమ్మిదో శతాబ్దంలో ఇథియోపియాలో పుట్టిన కాఫీ దేశ దేశాలు దాటి ప్రపంచమంతా పాకింది. అలాగే మనదేశానికీ వచ్చింది. కాఫీని మొదటిసారి రుచి చూసింది మనిషి కాదు, గొర్రెలు. ఇథియోపియాలోని కాల్దీ అనే గొర్రెల కాపరి తన గొర్రెలను తీసుకొని ఒక కొండ ప్రాంతానికి వెళ్లి.. అక్కడ గొర్రెలను పచ్చగడ్డి మేసేందుకని వదిలిపెట్టాడు. కాసేపటి తర్వాత చూస్తే గొర్రెలన్నీ వింతగా గెంతుతూ కనిపించాయి. ఇదేంటా అనుకున్నాడు. అంతేకాదు ఆ రోజు రాత్రి ఆ గొర్రెలు సరిగా నిద్ర పోకపోవడాన్ని కూడా కాల్దీ గమనించాడు. అప్పుడే అతనికి డౌట్ వచ్చింది. గొర్రెలు ఈ రోజు ఎదో కొత్తరకం ఆకుల్ని తిని ఉంటాయని అనుకున్నాడు. మరుసటి రోజు గొర్రెలు మేసిన ప్రాంతానికి వెళ్లి అక్కడున్న చెట్లన్నీ వెతికాడు. అక్కడ ఎర్రగా కొన్ని బెర్రీస్ కనిపించాయి. వాటిని తీసుకుని నోట్లో వేసుకున్నాడు. వాటి రుచి చాలా కొత్తగా అనిపించింది అతనికి. ఈ గింజల్లో ఏదో మ్యాజిక్ ఉందని.. వాటి గురించి ఎవరికైనా తెలుసేమో అడగడానికి ఊరంతా తిరిగాడు. ఎవ్వరూ వాటి గురించి తెలియదని చెప్పారు. చివరగా అక్కడుండే కొంతమంది సాధువులకు ఆ గింజలు ఇస్తే.. వాళ్లు ఆ గింజలను మరిగించి డ్రింక్ లా తయారు చేశారు. దాన్ని రుచి చూసి ఆహా అనుకున్నారు. అదే మనిషి మొదటిసారి తాగిన కాఫీ.

కాఫీ అంటే లగ్జరీ

కాఫీ రుచి తెలిసిన తర్వాత ఆ గింజలను సేకరించి ప్రత్యేకంగా సాగు చేయడం మొదలుపెట్టారు. కాఫీ గింజలకు అప్పట్లో విపరీతమైన డిమాండ్ ఉండేది. అప్పట్లో కాఫీ అంటే లగ్జరీకి, స్టేటస్‌కు సింబల్‌గా ఉండేది. కాఫీ గింజలను పండించేందుకు అప్పట్లో అందరికీ అనుమతి ఉండేది కాదు. చాలాకొద్ది మంది మాత్రమే కాఫీ పండించేవాళ్లు. కొంతమంది దొంగచాటుగా కూడా కాఫీ గింజలను పండించి, పక్క దేశాలకు స్మగ్లింగ్ చేసేవాళ్లు. అలా కాఫీ దేశదేశాలు దాటి ప్రపంచమంతా పాపులర్ అయింది. కాఫీ మనదేశానికి 17 వ శతాబ్దంలో ఎంట్రీ ఇచ్చింది. చిక్‌మగళూరుకి చెందిన బుదాన్ అనే వ్యక్తి హజ్ యాత్ర నుంచి తిరిగి వస్తూ ఎవరికీ తెలియకుండా ఏడు ‘అరబికా’ కాఫీ గింజలను ఇండియాకి పట్టుకొచ్చాడు. వాటిని తన పెరట్లో నాటి కాఫీ మొక్కలను పెంచాడు. అలా కాఫీని సాగు చేసి జనానికి కాఫీ అలవాటు చేశాడు. అందుకే ఇప్పటికీ చిక్‌మగళూరుని.. కాఫీకి పుట్టినిల్లు అంటుంటారు. అయితే బ్రిటిష్ వాళ్లు వచ్చాక దేశంలో కాఫీ వాడకం బాగా పెరిగింది. ఇక్కడి వాతావరణం కాఫీ పంటకు అనుకూలంగా ఉండడంతో ఇక్కడి రాజులని ఒప్పించి కాఫీ పంటలు వేశారు. అక్కడ పండే కాఫీ గింజలను విదేశాలకు కూడా పంపేవాళ్లు. అలా మనదేశంలో కాఫీ ఎక్స్‌పోర్ట్ మొదలుపెట్టారు బ్రిటిష్ వాళ్లు. అలా ఆ తర్వాతి రోజుల్లో ఇండియాలో కాఫీ తోటలు పెరుగుతూ పోయాయి. దాంతో లగ్జరీకి సింబల్ గా ఉండే కాఫీ సామాన్యుల వరకూ చేరగలిగింది. కాఫీ పాపులారిటీని గుర్తించిన అప్పటి ప్రభుత్వం 1942 లో ‘కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా’ ను ఏర్పాటు చేసింది. ఆ బోర్డుసాయంతో ఇప్పటికీ చాలాదేశాలకు మనదేశం నుంచి కాఫీ ఎగుమతి అవుతుంది.

కాఫీలో వెరైటీలెన్నో..

కాఫీ గింజలు, తయారీ విధానాన్ని బట్టి.. ఎస్‌ప్రెస్సో, కేపచ్చినో, ఐరిష్ కాఫీ, ఫ్లాట్‌వైట్, మాకియాటో, మోచా.. ఇలా కాఫీలో యాభైకి పైగా వెరైటీలున్నాయి. ప్రతీ కాఫీకి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. మనదేశం విషయానికొస్తే.. ప్రస్తుతం మనదేశంలో అరబికా, రొబస్టా, లిబరికా.. ఇలా రకరకాల కాఫీ బీన్స్ పండుతాయి. మనదేశంలో ఫిల్టర్ కాఫీ, డిగ్రీ కాఫీ, సొంఠి కాఫీ లాంటి ప్రత్యేకమైన రకాలున్నాయి. తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో కాఫీకి ప్రత్యేకమైన స్థానం ఉంది.

ఇవి తెలుసా?

కాఫీ గింజలను కాఫీ బీన్స్ అంటారు. కానీ నిజానికి అవి బీన్స్ జాతికి చెందినవి కావు. కాఫీ గింజల్ని కాఫీ బెర్రీస్ పండ్ల నుంచి తీస్తారు. ఈ బెర్రీస్ తియ్యటి రుచి కలిగి ఉంటాయి.

కాఫీ అన్న పదం ‘ఖహ్వా’ అనే అరబిక్ పదం నుంచి పుట్టింది. ‘ఖహ్వా’ అంటే అరబిక్‌ భాషలో ‘వైన్’ అని అర్థం.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ ధర లక్ష రూపాయల వరకూ ఉంటుంది.

2019లో అతిపెద్ద కాఫీ కప్‌ను తయారు చేసి అందులో 20 వేల లీటర్ల కాఫీని నింపి గిన్నీస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు.

అప్పట్లో కొన్ని రాజ్యాలు కాఫీని బ్యాన్ చేశాయి. ఒట్టోమన్ రాజ్యంలో కాఫీ తాగితే మరణ శిక్ష విధించేవాళ్లు.

కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రోజుకి సుమారు 200 కోట్ల కాఫీ కప్‌లు ఖాళీ అవుతున్నాయట.

First Published:  13 Aug 2023 5:45 AM GMT
Next Story