Telugu Global
Health & Life Style

జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా దువ్వుకోవాలి!

జుట్టును అదే పనిగా దువ్వడం ద్వారా జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. అలాగని దువ్వకుండా వదిలేసినా జుట్టు చిక్కుపడి రాలిపోతుంటుంది. అందుకే జుట్టు దువ్వుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా దువ్వుకోవాలి!
X

జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా దువ్వుకోవాలి!

సాధారణంగా చాలామందికి రోజూ జుట్టు దువ్వుకునే అలవాటుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లు బయటకు వెళ్లేటప్పుడు లేదా తలస్నానం చేసిన తర్వాత కచ్చితంగా జుట్టు దువ్వుకుంటారు. అయితే దువ్వుకునేటప్పుడు చాలామందికి జుట్టు రాలిపోతుంటుంది. అసలు జుట్టు రాలకుండా ఉండాలంటే ఎలా దువ్వుకోవాలి?

జుట్టును అదే పనిగా దువ్వడం ద్వారా జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. అలాగని దువ్వకుండా వదిలేసినా జుట్టు చిక్కుపడి రాలిపోతుంటుంది. అందుకే జుట్టు దువ్వుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే..

జుట్టు చిక్కుపడుతుందేమో అన్న భయంతో పైపైన దువ్వుకొని వదిలివేయడం వల్ల జుట్టు చిందరవందరగా మారుతుంది. ఇది తలలో చెమట పట్టడానికి, జుట్టు రాలడానికి కారణమవుతుంది. కాబట్టి జుట్టు కాస్త తడిగా ఉన్నప్పుడు లేదా ఒత్తుగా నూనె రాసుకున్నప్పడు జుట్టుని కుదుళ్ల నుంచి చివర్ల దాకా నెమ్మదిగా దువ్వుకోవాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

జుట్టు దువ్వుకునేటప్పుడు సాధారణంగా 50 నుంచి 100 వెంట్రుకల దాకా రాలిపోతాయట. అయితే కాస్త టైం కేటాయించి నెమ్మదిగా ఓపికతో దువ్వుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుందని చెప్తున్నారు కాస్మటాలిజిస్టులు.

పొడవాటి జుట్టు ఉన్నవాళ్లు సాధారణంగా రోజుకి రెండుసార్లు దువ్వుకుంటే మంచిది. బెజిల్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉన్న వెడల్పాటి చెక్క దువ్వెన ఉపయోగిస్తే వెంట్రుకలు, కుదుళ్లు డ్యామేజ్‌ అవ్వకుండా ఉంటాయి.

తలస్నానం చేసిన తర్వాత జుట్టుకి కండిషనర్‌ అప్లై చేసుకుని దువ్వుకుంటే జుట్టు చిక్కుపడకుండా ఉంటుంది. దువ్వుకునేటప్పుడు చిక్కులు కట్టినట్లు అనిపిస్తే వాటిని చేతివేళ్లతో సున్నితంగా తొలగించే ప్రయత్నం చేయాలేతప్ప అదే పనిగా దువ్వకూడదు.

జుట్టుని సక్రమంగా దువ్వుకోవడం వల్ల కుదుళ్ల నుంచి సహజసిద్ధమైన నూనెలు విడుదల అవుతాయి. జుట్టు పెరుగుదలకు ఈ నూనెలు చాలా అవసరం. ఇవి జుట్టు తేమ కోల్పోకుండా చూస్తాయి.

జుట్టుకి నూనె అప్లై చేసి మెల్లగా దువ్వుకోవడం ద్వారా కుదుళ్లకు చక్కటి మసాజ్‌ అందుతుంది. తద్వారా మాడుపై రక్తప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.

First Published:  14 Oct 2023 6:45 AM GMT
Next Story