Telugu Global
Health & Life Style

టపాసులు కాల్చేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి!

ముఖ్యంగా దీపావళి పండుగంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. టపాసులు కాల్చడమంటే పిల్లలకు ఎనలేని ఉత్సాహం. అయితే ఈ సమయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి.

టపాసులు కాల్చేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి!
X

టపాసులు కాల్చేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి!

పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. ముఖ్యంగా దీపావళి పండుగంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. టపాసులు కాల్చడమంటే పిల్లలకు ఎనలేని ఉత్సాహం. అయితే ఈ సమయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

టపాసులు కాల్చడం వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. కానీ, దీపావళికి టపాసులు కాల్చకుండా నివారించడం అనేది అసాధ్యం. పొల్యూషన్ కంట్రోల్‌లో భాగంగా ఇటీవల చేసిన ఓ సర్వేలో దేశంలో దాదాపు సగం మంది టపాసులు కాల్చకుండా ఉండలేమని తేల్చి చెప్పారు. అయితే ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా గుర్తుంచుకోవాలి.

వాయు కాలుష్యం, టపాసుల శబ్ధం కారణంగా గుండెజబ్బుల ప్రమాదం పెరుగుతుంది. పెద్దవయసులో ఉన్న హార్ట్ పెషెంట్లు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పేషెంట్లు ఉన్న ఇంట్లో శబ్దాలు వచ్చే టపాసులు కాల్చకపోవడం మంచిది.

టపాసులు కాల్చే విషయంలో కొంత బాధ్యతగా వ్యవహరించడం కూడా అవసరం. బాణాసంచా కొనుగోలు చేసే సమయంలో ఎక్కువగా శబ్దం, పొగ వచ్చే టపాసులు కాకుండా తేలికపాటి టపాసులను ఎంచుకుంటే ప్రమాదాలు, పొల్యూషన్ ను తగ్గించినవారవుతారు. కాలుష్యాన్ని పెంచని గ్రీన్ క్రాకర్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. అలాంటి ఆప్షన్లు ఎంచుకుంటే కొంతైనా మంచిది.

టపాసులు కొనేందుకు లైసెన్స్ పొందిన దుకాణాలనే ఎంచుకోవాలి. నాసిరకం టపాసులతో అనుకోని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది.

టపాసులు కాల్చే సమయంలో పిల్లలను జాగ్రత్తగా గమనిస్తుండాలి. అలాగే ముందస్తుగా ఒక బకెట్ నీళ్లను పక్కన పెట్టుకోవాలి. అనుకోని సందర్భాల్లో మంటలు వ్యాపించినప్పుడు వాటిని ఆర్పేందుకు నీళ్లు పనికొస్తాయి.

టపాసులు కాల్చేటప్పుడు చేతులు, కాళ్లు కవర్ అయ్యేలా మందపాటి దుస్తులు ధరించాలి. పిల్లలకు కూడా అలాంటి బట్టలే వేయాలి. ఇలా చేయడం ద్వారా నిప్పు రేణువులు అంటుకోకుండా జాగ్రత్తపడొచ్చు.

బాణాసంచా కాల్చే సమయంలో కాళ్లకు బూట్లు వేసుకోవడం ద్వారా కాళ్లను నిప్పులు తగలకుండా చూసుకోవచ్చు. అలాగే కళ్లకు గ్లాసెస్ ధరించడం ద్వారా కళ్లలో దుమ్ము, నిప్పు రేణువుల వంటివి పడకుండా జాగ్రత్తపడొచ్చు.

మద్యం సేవించి బాణా సంచా కాల్చడం లేదా పోటీ పడి బాంబులు కాల్చడం, రాకెట్లు వదలడం వంటివి చేయకూడదు. టపాసుల వల్ల జరిగే ప్రమాదాలు కోలుకోలేని విధంగా ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

గాలులు బాగా వీస్తున్న సమయంలో టపాసులు కాల్చడంఅంత మంచిది కాదు. అలాగే గడ్డి వాము, గుడిసెలు ఉన్న చోట టపాసులు కాల్చకపోవడమే మంచిది.

టపాసులు కాల్చే సమయంలో చర్మంపై నిప్పురవ్వలు పడితే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.

వీలైనంత వరకూ శబ్ధం రాని, పొగ తక్కువగా వచ్చే బాణాసంచాను ఎంచుకుంటే పర్యావరణానికి తక్కువ నష్టం చేసినవారవుతారు.

First Published:  11 Nov 2023 6:19 AM GMT
Next Story