Telugu Global
CRIME

గుంటూరులో ఇద్దరు మైనర్ల బీభత్సం, ఇద్దరు వాచ్‌మెన్ల హత్య

అక్కడ సమీపంలోనే మరో మూడు దుకాణాల షెట‌ర్లు, మీ సేవా కేంద్రం తాళాలు పగులగొట్టారు. పక్కనే ఉన్న స్వీట్ షాపు యజమాని గుర్తించి దొంగలంటూ కేకలు వేయగా అతడిపైనా గడ్డపారతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

గుంటూరులో ఇద్దరు మైనర్ల బీభత్సం, ఇద్దరు వాచ్‌మెన్ల హత్య
X

గుంటూరులో ఇద్దరు మైనర్లు బీభత్సం సృష్టించారు. రాత్రి వేళ బైక్‌పై స్వైరవిహారం చేస్తూ వరుస దాడులు, దొంగతనాలకు పాల్ప‌డ్డారు. ఆ సమయంలో వారిద్దరూ గంజాయి మత్తులో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.

తొలుత బుధవారం తెల్లవారుజామున రెండున్నర సమయంలో గుంటూరు అమరావతి రోడ్డులో వీరి బీభత్సం మొదలైంది. అమరావతి రోడ్డులో ఉన్న ద్విచక్ర వాహనాల దుకాణంలో చోరీకి ప్రయత్నించారు. అక్కడే వాచ్‌మెన్‌గా ఉన్న రిటైర్డ్ కానిస్టేబుల్‌ కృపానిధి అడ్డు రావడంతో అతడిని గడ్డపారతో తలపై కొట్టారు. దాంతో కుర్చీలోనే కుప్పకూలి చనిపోయాడు.

షాపు అద్దాలు పగులగొట్టి బైకులను తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా మైనర్లకు అది సాధ్యం కాలేదు. దాంతో కౌంటర్‌లో వెతికి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అరండల్‌పేట వద్ద లిక్కర్ స్టోర్‌లోకి చొరబడ్డారు. అక్కడ వాచ్‌మెన్‌గా ఉన్న సాంబశివరావుపై దాడి చేసి చంపేశారు. షెట‌ర్ తాళాలను పగులగొట్టేందుకు ప్రయత్నించినా అదీ సాధ్యం కాక వెళ్లిపోయారు.

అక్కడ సమీపంలోనే మరో మూడు దుకాణాల షెట‌ర్లు, మీ సేవా కేంద్రం తాళాలు పగులగొట్టారు. పక్కనే ఉన్న స్వీట్ షాపు యజమాని గుర్తించి దొంగలంటూ కేకలు వేయగా అతడిపైనా గడ్డపారతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఒక సెల్‌ఫోన్ షాపు నుంచి కొన్ని ట్యాబ్‌లను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత డొంక రోడ్డు మీదుగా పాతగుంటూరు వెళ్లి ఒక ఎలక్ట్రానిక్ దుకాణం, రెండు ఫైనాన్స్ కార్యాలయాలు, ఒక కూల్ డ్రింక్స్ షాపుపై దాడి చేశారు. కొన్ని వస్తువులను ఎత్తుకెళ్లారు. 2.30 నుంచి తెల్లవారుజాము నాలుగున్నర వరకు వీరి స్వైరవిహారం సాగింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించారు. దొంగలిద్దరూ గుంటూరులోని కోబాల్ట్‌పేటకు చెందిన వారిగా తేల్చారు. వారిద్ద‌రినీ రాజీవ్‌ గృహకల్ప వద్ద అరెస్ట్‌ చేశారు.

First Published:  2 March 2023 2:56 AM GMT
Next Story