Telugu Global
Cinema & Entertainment

ఏ పీరియడ్ సినిమాలు ఎలా వుంటే ఆడతాయి?

పీరియాడికల్ డ్రామా సినిమాలు వరుసగా ఫ్లాపవుతున్నాయి...సాంఘిక కథల్ని పూర్వకాలంలో స్థాపించి, ఆనాటి వాతావరణ సృష్టి చేస్తూ తీస్తున్న సాంఘిక సినిమాలు ఇప్పటి ప్రేక్షకులకి రుచించడం లేదు.

ఏ పీరియడ్ సినిమాలు ఎలా వుంటే ఆడతాయి?
X

పీరియాడికల్ డ్రామా సినిమాలు వరుసగా ఫ్లాపవుతున్నాయి...సాంఘిక కథల్ని పూర్వకాలంలో స్థాపించి, ఆనాటి వాతావరణ సృష్టి చేస్తూ తీస్తున్న సాంఘిక సినిమాలు ఇప్పటి ప్రేక్షకులకి రుచించడం లేదు. వర్తమాన కాలపు కథలతో, పాత్రలతో, వేషభాషలతో తీసే సినిమాలనే ఆదరిస్తున్నారు- అవి బావుంటే సక్సెస్ చేస్తున్నారు. అసలు ఇప్పటి జనరేషన్ (జనరేషన్ జడ్) కి తాజాగా జరుగుతున్న ఇప్పటి ఆధునిక కథలు కాక, వాళ్ళకి పరిచయం లేని రెండు మూడు దశాబ్దాల నాటి గత కాలపు కథలతో సాంఘీక సినిమాలు తీస్తే ఏం ఆసక్తి వుంటుంది. అందులో సెల్ ఫోన్లో కాకుండా టెలిఫోన్లో మాట్లాడుకుంటూ, మెసేజిలు పంపడం గాక ఉత్తరాలు రాసుకుంటే; రిమోట్ కంట్రోలు కాక ఇంటిమీద సిగ్నల్ రాక టీవీ యాంటెన్నాలు తిప్పుకుంటూ వుంటే, ఇప్పటి ప్రేమలు కాక, అప్పటి కాలం చెల్లిన ప్రేమలు చూపిస్తే-ఏంట్రా ఈ బోరు అనుకుని సెల్ ఫోన్లో షార్ట్స్, రీల్స్ చూసుకుంటూ కూర్చుంటున్నారు థియేటర్లలో.

పెదకాపు, బెదురులంక, రుద్రాంగి, ఒకే ఒక్క జీవితం, గద్దలకొండ గణేష్, ఆచార్య, విరాటపర్వం, మహా సముద్రం, స్కై లాబ్... ఇవన్నీ ప్లాపయిన ఇలాటి సినిమాల్లో కొన్ని. 1970, 80, 90 ల నాటి కథల్నే చూడాలనుకుంటే అప్పటి సినిమాలు దసరాబుల్లోడు, ఖైదీ, ఎదురులేని మనిషి, అత్తకు యముడు -మామకు అల్లుడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి...ఇలా బోలెడున్నాయి. అవి వొరిజినల్ గా అప్పటి కాలపు కథలతో సినిమాలుగా వుంటాయి. అప్పటి కాలపు కథలతో, ఇప్పటి హీరో హీరోయిన్లతో వాతావరణ సృష్టి చేస్తే కృత్రిమంగా కూడా వుంటున్నాయి.

ఇక నక్సలైట్ ఉద్యమం సినిమాలకి 1990 ల వరకూ మంచి ముడిసరుకే. 1980 లనుంచి 1990 ల వరకూ అప్పటి ప్రేక్షకులు నక్సలిజాన్ని ప్రత్యక్షంగా కన్నారు, విన్నారు, రోజూ వార్తలు చదివారు కాబట్టి, పీపుల్స్ ఎన్ కౌంటర్ దగ్గర్నుంచీ ఒసే రాములమ్మ వరకూ నక్సల్ సినిమాల సీజన్ ఉధృతంగా కొనసాగింది. అదే ఇప్పటి జనరేషన్ నక్సలైట్లని చూడలేదు, నక్సలిజం గురించి తెలియదు. దీంతో రానాతో విరాటపర్వం తీసినా, చిరంజీవి- రామ్ చరణ్ లతో ఆచార్య తీసినా ఫ్లాపయ్యాయి.

చరిత్రతో పీరియడ్ సినిమాలు తీస్తే 1940 లలో తెలంగాణ దొరల- బానిసల సినిమాలు, అదే కాలపు-లేదా మరికొంత పూర్వకాలపు బ్రిటిష్ స్వాతంత్ర్య పోరాటపు సినిమాలు తీస్తున్నారు. ఇవి కూడా ఫ్లాపవుతున్నాయి. ఇప్పటి జనరేషన్ కి వీటిలో కూడా ఏమాత్రం ఆసక్తి లేదు. సమీప చరిత్ర నక్సలిజంతోనే సినిమాలు చూడకపోతే, సుదూర చరిత్రలు ఏం నచ్చుతాయి. తెలంగాణ దొర కథతో రుద్రాంగి ఫ్లాపయ్యింది. నాగార్జునతో రాజన్న కూడా ఫ్లాపయ్యింది. బ్రిటిష్ కాలపు 1945 కూడా ఫ్లాపయ్యింది.

చరిత్రతో పీరియెడ్ సినిమాలు తీస్తే చిరంజీవితో సైరా నరసింహారెడ్డి, రామ్ చరణ్ ఎన్టీఆర్ లతో ఆర్ ఆర్ ఆర్ స్థాయిలో తీయాలి. అప్పుడే జనరేషన్ జడ్ కనెక్ట్ అవుతారు కథలతో కాదు- వాటి స్టార్ డమ్ తో. వరుణ్ తేజ్ తో రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న తెలుగు సైనికుల కథతో ‘కంచె’ తీస్తే హిట్టయ్యింది. అంటే పీరియడ్ సినిమాలుగా చారిత్రికాలు, జానపదాలు, సైన్స్ ఫిక్షన్లు భారీ స్థాయిలో తీస్తేనే తప్ప జనరేషన్ జడ్ కి నచ్చవు. మగధీర, బాహుబలి, గౌతమీ పుత్ర శాతకర్ణి, రుద్రమ దేవి, చివరికి ఫిక్షన్ బింబిసార కూడా హిట్ చేశారు.

అంతేగానీ మామూలు సాంఘికాల్ని పీరియడ్ సినిమాలుగా తీస్తే కల్చర్ క్లాష్ వస్తోంది. హీరోయిన్ పట్టు పరికిణీ, హీరో బెల్ బాటమ్స్ వేసుకుని కన్పిస్తే వీళ్ళెవర్రా అని తలపట్టుకుంటున్నారు. సెల్ ఫోన్లో ఏవో కామెడీలైనా చూస్తున్నారు గానీ, దర్శకులు చాదస్తం కొద్దీ తీసే ఇలాటి పీరియెడ్ సినిమా ఆడుతున్న తెరపైకి కన్నెత్తి చూడడం లేదు. ఏ సినిమా అయినా హిట్టా ఫ్లాపా తెలుసుకోవాలంటే ప్రేక్షకుల చేతుల్లో సెల్ ఫోన్లు వెలుగుతున్నాయా లేదా చూస్తే చాలు.

First Published:  2 Nov 2023 6:23 AM GMT
Next Story