Telugu Global
Cinema & Entertainment

మోస్ట్ వాంటెడ్ విలన్ @ రూ. 15 కోట్లు!

సంజు బాబా అంటే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సౌత్ సినిమాల్లో అతి ఖరీదైన విలన్ గా మారాడు.

మోస్ట్ వాంటెడ్ విలన్ @ రూ. 15 కోట్లు!
X

మోస్ట్ వాంటెడ్ విలన్ @ రూ. 15 కోట్లు!

సంజు బాబా అంటే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సౌత్ సినిమాల్లో అతి ఖరీదైన విలన్ గా మారాడు. కొందరు హీరోలు (జగపతి బాబు, సైఫలీ ఖాన్), కమెడియన్లు (సునీల్, పరేష్ రావల్) తమ సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ ఫుల్ విలన్లుగా రాణించినట్టే 1980-90 లనాటి పాపులర్ బాలీవుడ్ స్టార్, ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ ఫేమ్ సంజయ్ దత్ సరికొత్త దుష్టపాత్రలకి కేరాఫ్ అడ్రసుగా మారాడు. అలనాటి బాలీవుడ్ ప్రసిద్ధ హీరో హీరోయిన్లు సునీల్ దత్-నర్గీస్ ల కుమారుడు సంజయ్ దత్, 2022 లో కన్నడ పానిండియా ‘కేజీఫ్2’ లో క్రూరాతి క్రూర విలన్ ఆధీర గా ప్రదర్శించిన చిరస్మరణీయ నటన అతడ్ని దక్షిణ భారత ప్రేక్షకులకి పరిచయం చేసింది. ఇదే దక్షిణ సినిమాల్లో ప్రతినాయక పాత్రలు పోషించడానికి అతడికి ద్వారాలు తెరిచింది. ఇక తెలుగు, తమిళ సినిమాల్లో ఒకదాని తర్వాత మరొకటి ఆఫర్స్ అందుకుంటూ బిజీ అయిపోయాడు.

64 ఏళ్ళ వయస్సులో దృఢ కాయుడుగా కన్పించే సంజయ్ విలన్ పాత్రలకి పరాకాష్ఠగా మారాడు. హీరోలని డామినేట్ చేసే పాత్రలతో భయంకర ప్రతినాయకుడుగా అవతరించాడు. ‘జైలర్’ లో రజనీకాంత్ ని డామినేట్ చేసిన విలన్ వినాయకన్ ఎంత పవర్ఫుల్ గా నటించాడో, అంతటి శక్తివంతమైన విలన్ పాత్రల సృష్టి అతడికోసం జరుగుతోంది. ఇప్పుడు అందరి దృష్టీ అక్టోబర్ లో విడుదల కానున్న తమిళ స్టార్ విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘లియో’ మీదే వుంది. ఇందులో బరితెగించిన దుష్ట పాత్ర ఆంటోనీ దాస్ గా నటించాడు. దీనికి లోకేష్ కనక రాజ్ దర్శకుడు. ఇదిలా వుండగా, తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించనున్న ‘డబుల్ ఇస్మార్ట్’ లో బుక్కయ్యాడు.

ఇటీవల సూపర్ హిట్టయిన షారుఖ్ ఖాన్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘జవాన్‌’ లో అతిథి పాత్రలో కనిపించిన సంజయ్ దత్, ఒకప్పుడు సౌత్ నుంచి వస్తున్న ఆఫర్లని పరిగణనలోకి తీసుకోకుండా తప్పించుకుని, ఇప్పుడు తప్పని సరిగా సౌత్‌లోనే ఎక్కువ సినిమాల్ని ఇష్టపడుతున్నాడు. హీరోల్ని ఎలా చూపించాలో సౌత్ సినిమాల నుంచి నేర్చుకోవాలని పాఠాలు కూడా చెప్తున్నాడు. ‘కేజీఎఫ్2’ తో శాండల్ వుడ్ (కన్నడ సినిమారంగం) మీద ముద్రవేసిన తను, ‘లియో’ తో కోలీవుడ్ (తమిళ సినిమారంగం) లో పెద్ద విజయాన్ని సాధిస్తానన్న నమ్మకంతో వున్నాడు.. ‘లియో’ లో సంజయ్ పాత్ర చుట్టూ భారీ హైప్ వుంది. విలన్ కి ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యరు. అలాటిది మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిన సంజయ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. దీంతో సౌత్‌లో సంజు బాబా హవా వేగమందుకుంది.

ఇక కన్నడలో రానున్న మరో యాక్షన్ మూవీ ‘కేడీ- ది డెవిల్’ లో మరో కరుడు గట్టిన విలన్ పాత్రలో కన్పించనున్నాడు. ఇందులో ధృవ సర్జా హీరో. దర్శకత్వం ప్రేమ్. గూండాలు, క్రిమినల్స్ అందరూ జైల్లో వున్న కాళీ అనే విలన్ని చంపడానికి జైలు బైట మాటు వేసే యాక్షన్ కథతో ఇది రూపొందుతోంది. ఈ కాళీ సంజయ్ దత్తేనా అనేది సస్పెన్సులో వుంచారు.

విజయ్ దేవర కొండతో భారీ ఫ్లాప్ ‘లైగర్’ తో స్తంభించిన పూరీ జగన్నాథ్ కెరీర్ ఇప్పుడిప్పుడే ముందుకు కదులుతోంది. గతంలో రామ్ పోతినేనితో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే హిట్ తీసిన పూరీ, ఇప్పుడు అదే రామ్ తో ‘డబుల్ ఇస్మార్ట్’ తీస్తున్నాడు. ఇందులో పైన చెప్పుకున్నట్టు విలన్ గా సంజయ్ దత్ డేట్స్ తీసుకున్నాడు. ‘డబుల్ ఇస్మార్ట్’ లో సంజయ్ దత్ చేరిక ఇప్పటికే అభిమానుల్లో చాలా ఉత్సాహాన్ని నింపింది. ఇందులో సంజయ్ షూటింగ్ కోసం 60 రోజులు కేటాయించారు. దీనికి గాను సంజయ్ కి చెల్లిస్తున్న పారితోషికం అక్షరాలా రూ. 15 కోట్లు!

విలన్ పాత్ర ధారికి ఈ స్థాయిలో పారితోషికం ఇవ్వలేదు. ‘లియో’ లో నటించేందుకు రూ. 10 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘డబుల్ ఇస్మార్ట్’ లో రూ. 15 కోట్ల మార్క్ తో సంజయ్ ఇప్పుడు దేశంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న విలన్ ఆర్టిస్టుగా నమోదయ్యాడు.

తమిళంలో ఇప్పుడు చెప్పుకుంటున్నది ఇద్దరు విలన్ల గురించే- టాలీవుడ్ నుంచి సునీల్, బాలీవుడ్ నుంచి సంజయ్ దత్. విలాన్లు గా వీళ్ళిద్దర్నీ కలిపి సినిమా తీస్తే బాక్సాఫీసుని బ్లాస్ట్ చేసి కరెన్సీ నోట్లని గాల్లో కెగరేయగలరు!

First Published:  25 Sep 2023 11:40 AM GMT
Next Story