Telugu Global
Cinema & Entertainment

Sampoornesh Babu | సంపూ రీమేక్ ప్రాజెక్టు రెడీ

Sampoornesh Babu - కెరీర్ లో తొలిసారి ఓ రీమేక్ లో నటించాడు సంపూర్ణేష్ బాబు. తన ఆశలన్నీ ఆ సినిమాపైనే పెట్టుకున్నాడు.

Sampoornesh Babu | సంపూ రీమేక్ ప్రాజెక్టు రెడీ
X

కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్నాడు సంపూర్ణేష్ బాబు. అతడి ఇమేజ్ కు తగ్గట్టు సరైన సినిమా పడడం లేదు. అందుకే సంపూర్ణేష్ కూడా గ్యాప్ తీసుకున్నాడు. మంచి సబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇన్నాళ్లకు అతడి నిరీక్షణ ఫలించింది. ఓ సూపర్ హిట్ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు సంపూర్ణేష్ బాబు.

యోగి బాబు మండేలా ఇటీవలి కాలంలో వచ్చిన సర్ ప్రైజ్ హిట్స్ లో ఒకటి. ఈ పొలిటికల్ సెటైర్ చిత్రంలో యోగి బాబు ప్రధాన పాత్రలో నటించాడు. నేటి రాజకీయాలకు సంబంధించిన సబ్జెక్ట్ కావడంతో కంటెంట్ అందరికీ కనెక్ట్ అయింది. ఊహించిన దానికి మించి ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో కేంద్రంగా మారిన మండేలా అనే గ్రామంలోని ఓ క్షురకుడు జీవితం ఎలా మారిందనే కోణంలో ఈ కథ సాగింది.

తమిళనాట విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, ఇప్పుడు తెలుగులో సంపూర్ణేష్ బాబు టైటిల్ రోల్ లో రీమేక్ కానుంది. ఈ పొలిటికల్ సెటైర్‌లో నటుడు నరేష్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగులో ఈ చిత్రానికి మార్టిన్ లూథర్ కింగ్ అనే టైటిల్ పెట్టారు. వై నాట్ స్టూడియోస్ సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన చేసింది.

పూజ కొల్లూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, కేరాఫ్ కంచరపాలెం సినిమాకు దర్శకత్వం వహించిన వెంకటేష్ మహా, ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. దీనిని ఎస్ శశికాంత్, రామచంద్ర చక్రవర్తి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

యోగి బాబు నటించిన మండేలా.. 2 జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ నూతన దర్శకుడిగా ఈ సినిమాకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అలాంటి సినిమాలో సంపూర్ణేష్ బాబు నటిస్తున్నాడు. అక్టోబర్ 27న విడుదలవుతున్న మార్టిన్ లూథర్ కింగ్ ఎలా ఉంటుందో చూడాలి.




First Published:  19 Sep 2023 4:30 PM GMT
Next Story