Telugu Global
Cinema & Entertainment

ఇంగ్లీషు సరే, హిందీ వెర్షన్ ఇంకెప్పుడు?

హిందీ ప్రేక్షకులు ఓటీటీలో ‘సాలార్’ హిందీ వెర్షన్ కోసం అసహనంగా ఎదురు చూస్తూంటే ఇంగ్లీషు వెర్షన్ విడుదలైంది.

ఇంగ్లీషు సరే, హిందీ వెర్షన్ ఇంకెప్పుడు?
X

హిందీ ప్రేక్షకులు ఓటీటీలో ‘సాలార్’ హిందీ వెర్షన్ కోసం అసహనంగా ఎదురు చూస్తూంటే ఇంగ్లీషు వెర్షన్ విడుదలైంది. ఇంగ్లీషు వెర్షన్ ఎవరిక్కావాలి హిందీ స్ట్రీమింగ్ ఇంకెప్పుడో చెప్పండని సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రశ్నలకి స్పందించకుండా నెట్ ఫ్లిక్స్ సైలెంట్ గా వుంది. అసలు హిందీ వెర్షన్ థియేట్రికల్ విడుదల కూడా లేకపోవడంతో ప్రభాస్ హిందీ ఫ్యాన్స్ పిచ్చెత్తి వున్నారు. ‘సాలార్’ మిగతా అన్ని భాషల్లో థియేట్రికల్ గానే గాకుండా ఓటీటీలో కూడా విడుదలైతే, హిందీ ఒక్కటే ఏం పాపం చేసుకుందని వాపోతున్నారు. చెప్పాపెట్టకుండా ఇంగ్లీషులో స్ట్రీమ్ చేస్తూండేసరికి పుండు మీద కారం జల్లినట్టు అవుతోంది. ఇంతకీ హిందీ వెర్షన్ ఎందుకు స్ట్రీమింగ్ కావడం లేదు?

‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సాలార్ పార్ట్-1’ ప్రేక్షకులనుంచి మిశ్రమ స్పందనల మధ్య ప్రపంచవ్యాప్తంగా రూ. 615 కోట్లు రాబట్టిందని బాక్సాఫీసు ట్రాకర్ సచ్ నిక్ వెబ్సైట్ చెప్తోంది. డిసెంబర్ 22 న తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదలైన ఇది ఆ తర్వాత నెల తిరక్కుండానే జనవరి 20 నుంచి నాలుగు భాషల్లో నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రసారమవుతోంది. ఇలా 4 భాషల్లో థియేట్రికల్, ఓటీటీ వేదికల రెండు అధ్యాయాలు పూర్తయ్యాయి.

అయితే హిందీ వెర్షన్ థియేటర్లలో విడుదల కాకపోవడం పెద్ద లోపం. మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ - ఐనాక్స్ విడుదలకి అంగీకరించలేదు. అంగీకరిస్తే నిర్మాతలు ఓటీటీ విడుదలకి అన్ని భాషలకీ కలిపి 90 రోజులు ఆగాలి. ఎందుకంటే ఇది బాలీవుడ్ లో అమల్లో వున్న నిబంధన. హిందీ సినిమాల్ని థియేటర్లలో విడుదలైన 90 రోజుల వరకూ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయరాదన్న పీవీఆర్ -ఐనాక్స్ నిబంధనని పాటిస్తూ హిందీ నిర్మాతలు నడుచుకుంటున్నారు.

కానీ సౌత్ సినిమాలకి 30 రోజుల మాత్రమే ఓటీటీ విండో వుంది. థియేటర్లో విడుదల చేసిన 30 రోజుల్లో సౌత్ సినిమాల్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఈ తేడాల వల్ల ‘సాలార్’ హిందీ వెర్షన్ థియేట్రికల్ విడుదల రద్ధయింది. ఇది ప్రభాస్ హిందీ ఫ్యాన్స్ ని ఎంతో బాధించింది. మొదటిసారి ప్రభాస్ సినిమాకి ఇలా జరిగింది. ‘సాలార్’ ఒకటే కాదు, తమిళంలో రజనీకాంత్ ‘జైలర్’, విజయ్ ‘లియో’ కూడా హిందీ లో విడుదల కాలేదు.

కనుక ఇక ‘సాలార్’ హిందీ థియేట్రికల్ విడుదల అవకాశమే లేకపోగా, ఓటీటీ స్ట్రీ మింగ్ కోసం 90 రోజులు వేచి వుండాల్సిన పరిస్థితి ఏర్పడింది హిందీ ప్రేక్షక లోకానికి. ఓటీటీ స్ట్రీమింగ్ కి 90 రోజులంటే మార్చి 20 వరకూ ఆగక తప్పదు. ఐతే ఇందులోకూడా ఒక సందేహం వస్తుంది. హిందీ వెర్షన్ థియేట్రికల్ విడుదలే లేనప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి 90 రోజుల విండో దేనికన్నది. దీనిపైనే కాదు, అసలు హిందీ వెర్షన్ ప్రస్తావనే లేకుండా ఇంగ్లీష్ వెర్షన్ వదిలారు.

First Published:  7 Feb 2024 10:39 AM GMT
Next Story