Telugu Global
Cinema & Entertainment

Peddha Kapu-1 Movie Review | పెద్ద కాపు - రివ్యూ {2/5}

Peddha Kapu-1 Movie Review | లాక్ డౌన్ సమయంలో శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ తో రీమేక్ చేసిన ‘నారప్ప’ ఓటీటీ లో మాత్రమే రిలీజయ్యాక, ఇప్పుడు వెండితెర మీద ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసేందుకు ‘పెద్ద కాపు’ తో విచ్చేశాడు.

Peddha Kapu-1 Movie Review | పెద్ద కాపు - రివ్యూ {2/5}
X

Peddha Kapu-1 Movie Review | పెద్ద కాపు - రివ్యూ {2/5}

చిత్రం: పెద్ద కాపు

రచన –దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల

తారాగణం : విరాట్ కర్ణ, ప్రగతీ శ్రీవాత్సవ్, అనసూయా భరద్వాజ్, ఈశ్వరీ రావు, రావు రమేష్, నాగేంద్ర బాబు, తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, శ్రీకాంత్ అడ్డాల తదితరులు

సంగీతం : మిక్కీ జె. మేయర్, ఛాయాగ్రహణం : ఛోటా కె. నాయుడు

బ్యానర్ : ద్వారకా క్రియెషన్స్, నిర్మాత : ఎం రవీందర్ రెడ్డి

విడుదల : సెప్టెంబర్ 29, 2023

రేటింగ్: 2/5

లాక్ డౌన్ సమయంలో శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ తో రీమేక్ చేసిన ‘నారప్ప’ ఓటీటీ లో మాత్రమే రిలీజయ్యాక, ఇప్పుడు వెండితెర మీద ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసేందుకు ‘పెద్ద కాపు’ తో విచ్చేశాడు. ‘కొత్త బంగారు లోకం’ తో ప్రారంభించి ఒక హిట్, ఒక భారీ ఫ్లాప్ వంతున తీస్తూ వస్తున్న శ్రీకాంత్, ‘పెద్దకాపు’ తో తను చూసిన గోదావరి ప్రాంతపు జీవితంతో సామాజిక(?), రాజకీయ (?) సినిమా తీశాడు. దీంతో తనకున్న రాజకీయ సామాజికావగాహన ఎంతన్నది పరీక్షకి పెట్టుకున్నాడు. దీనికి కొత్త హీరో విరాట్ కర్ణని తీసుకున్నాడు. ఇంత భారీ కథకి కొత్త హీరో ఎందుకంటే, సామాన్యుడి పాత్రకి కన్విన్సింగ్ గా వుంటాడని చెప్పాడు. మరి సినిమా కన్విన్సింగ్ గా తీశాడా? తీయకపోతే ఎలా తీశాడు? ఇది తెలుసుకుందాం...

కథ

1980 లలో రాజమండ్రి దగ్గర ఓ గ్రామం. సత్య రంగయ్య (రావు రమేష్), బయ్య న్న(ఆడుకాలం నరేన్) అనే ఇద్దరు భూస్వాముల మధ్య ఆధిపత్య పోరుతో అక్కడ నిత్యం ఘర్షణలు చెలరేగుతూంటాయి. వీళ్ళ చేతిలో కింది సామాజిక వర్గాలు నరకయాతన అనుభవిస్తూ వుంటారు. ఆర్ధికంగా, రాజకీయకంగా ఎదగకుండా భూస్వాములిద్దరూ తొక్కేస్తూ వుంటారు. ఇలాటి పరిస్థితుల్లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తాడు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఏర్పాటైన పార్టీలోకి తగిన అభ్యర్ధుల్ని ఆహ్వానిస్తారు. గ్రామంలో అణిచివేతని అనుభవిస్తున్న పెద్దకాపు (విరాట్ కర్ణ) అనే కింది సామాజికవర్గానికి చెందిన యువకుడు, ఈ సదవకాశాన్ని వినియోగించుకుని, పార్టీలో చేరి భూస్వాములిద్దరికీ సవాలు విసురుతాడు. ఇదీ కథ.

ఎలావుంది కథ

ఇది గత కాలపు పీరియడ్ కథ. ఈ కథతో దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో స్పష్టత వుండదు. కాసేపు రాజకీయ కథతో, కాసేపు కులవివక్ష కథతో తికమకకి గురిచేస్తాడు. దీంతో కథా పరంగా ఈ సినిమా విఫలమైందని చెప్పుకోవాలి. రాజకీయ కథ చెప్పినా, కులవివక్ష కథ చెప్పినా అందులో కూడా విషయం లేదు. పైపైన తడిమి వదిలేశాడు. తమిళ సినిమాల్లో లాగా కులవివక్ష కథ లోతుగా చెప్తే తెలుగు ప్రేక్షకులు భరించలేరేమోనన్న సందిగ్ధం దర్శకుడిలో వున్నట్టుంది.

కానీ కులవివక్ష మీద కె. విశ్వనాథ్ తీసిన సినిమాలున్నాయి. కుల, రాజకీయ వ్యవస్థల మీద 1980 లలో టి. కృష్ణ, వేజెళ్ళ సత్యనారాయణ, ఆర్. నారాయణ మూర్తి వంటి దర్శకులు తీసిన సినిమాలున్నాయి. ఆనాటి కథతో ఇప్పటి ‘పెద్దకాపు’ కంటే ఆ సినిమాలు చూసుకోవడం బెటర్ గా వుండొచ్చు. పాటలు కూడా బావుంటాయి.

తికమక కథతోనే కాదు, పాత్రలతో, కథ చెప్పిన విధానంతోనూ కూడా తికమకే. హీరో పెద్ద కాపు ఎలా అయ్యాడో, ఆ పేరెందుకొచ్చిందో, పార్టీ టికెట్ ఇవ్వడానికి అతను చేసిన మంచి పనులేమిటో తెలియదు. కథతో పాటే, పాత్ర చిత్రణలు కూడా అర్ధవంతంగా లేవు. అక్కమ్మ అనే కీలక పాత్రకూడా ఇంతే. కథలో భావోద్వేగాల్ని పిండుకోవడానికి బలమైన పాత్ర చిత్రణలు అవసరం. కాబట్టి ఈ సినిమాతో ప్రేక్షకులు కనెక్ట్ అవడానికి సరైన భావోద్వేగాల్లేవు. హీరోకి జరిగిన అన్యాయంలోంచి భావోద్వేగాలు పుడితే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అవకాశముంటుంది.

మరి ఇలాటి కథతో, పాత్రలతో సినిమాని ఎలా నడిపాడు దర్శకుడు? డిటో బోయపాటి శీను ‘స్కంద’. కథలేని ‘స్కంద’ లో హింసాకాండ మీద ఆధారపడి సినిమా నడిపినట్టే, ‘పెదకాపు’ తోనూ ఇదే పని. అరటి తోట నరికినట్టే మనుషుల తలకాయలు తెగ నరకడం, రక్తపుటేరులు పారించడం, భీకరంగా అరవడం, చావుకేకలు పెట్టడం, జుగుప్సాకరంగా శవాలు రాలడం...ఇంత హింస 1980 లలో ఎప్పుడుందో తెలీదు. ఉంటే ఈ వూరి హీరోకి ఎన్టీఆర్ టికెట్ ఎందుకిచ్చినట్టో తెలీదు. అప్పట్లో ఎన్టీఆర్ టికెట్లు ఇచ్చింది రాజకీయాలకి కొత్తైన విద్యావంతులకే, రౌడీలకి కాదు.

హింసతో సినిమా నడపడం, దానికోసం టెక్నాలజీ నంతా వాడుకుని సినిమాకి బిల్డప్ ఇవ్వడం, అమాయక ప్రేక్షకులు ఇది చూసి గొప్పగా ఫీలవుతారనుకోవడం...అంతా దర్శకుడి భ్రమ మాత్రమే! కన్విన్సింగ్ గా సినిమా తీయలేనప్పుడు కన్వీనియంట్ గా కొత్త హీరో దేనికి? పాపం అతను ఫ్లాప్ కి బలి అయ్యాడు.

నటనలు- సాంకేతికాలు

కొత్త హీరో విరాట్ కర్ణ పాత్రకి తగ్గట్టు నటించాడు. యాక్షన్ సీన్స్ కి ప్లస్ అయ్యాడు. కానీ ఇలాటి పాత్ర, ఇలాటి యాక్షన్ సీన్స్ అతడికి మేలు చెయ్యవు. రోమాన్స్ అయితే కథలోనే సరిగా లేదు. ఈ సినిమా సామాన్యుడి సంతకమన్న దర్శకుడు, డైలాగులు మాత్రం ఆలోచిస్తేగానీ పట్టుబడని లోతైన అర్ధాలతో రాశాడు. సామాన్యుడు ఇలా మాట్లాడతాడా? ఈ లోతు డైలాగులతో కాదు- పాత్రచిత్రణలతో, కథా కథనాలతో వుండాల్సింది. అంతా ఉల్టాపల్టా వ్యవహారమే.

హీరోయిన్ ప్రగతి అందంగా వుంది గానీ, సినిమాలో ఎందుకుందో తెలీదు. విలన్లెప్పుడూ రైటే. వాళ్ళ పాత్రలెప్పుడూ తప్పుడు పనులే చేస్తాయి కాబట్టి పాత్రచిత్రణలు తప్పుడుగా వుండవు. రావురమేష్, ఆడుకాలం నరేన్ లు విలన్లుగా వైరల్ అయ్యారు. రావురమేష్ అయితే కంటి చూపులతోనే వణుకు పుట్టించే విలనీ ప్రకటించాడు. అక్కమ్మ పాత్ర నటించిన అనసూయది శక్తివంతమైన నటన. ఇక ఒక విలన్ కొడుకుగా వికలాంగ పాత్రలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విలనీ ఒకే ఎక్స్ ప్రెషన్ టో కష్టపడి నటించాడు. ఈ సినిమాతో తనకి అన్నీ కష్టాలే అన్నట్టుంది.

ఈ టైపు సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం పాటలకి సూట్ కాలేదు. పాటల పరంగానూ సినిమా జీరో. అయితే యాక్షన్ దృశ్యాలకి మాత్రం దర్శకుడి విజృంభణకి తగ్గకుండా పోటీ పడ్డాడు. చాలా కాలం తర్వాత ఛోటా కె. నాయకుడు ఛాయాగ్రహణం వహించిన సినిమా ఇది. తను ఛాయాగ్రహణం వహించాలంటే ప్రొడక్షన్ విలువలు చాలా రిచ్ గా వుండాలి. ఆ రిచ్ నెస్ అంతా వుంది. కానీ కంటెంటే రిచ్ గా లేదు. అడ్డాలకిది మరో ఆశాభంగం! ఇది పార్ట్ 1 అని వేశారు, పార్ట్ 2 ఇంకెలా వుంటుందో?



First Published:  29 Sep 2023 11:40 AM GMT
Next Story