Telugu Global
Cinema & Entertainment

హైకోర్టు తీర్పుతో రీ ఎంట్రీ ఇస్తున్న పాక్ నటి?

పాకిస్థానీ స్టార్ మహిరా ఖాన్ ఇండియన్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమవుతోంది.

హైకోర్టు తీర్పుతో రీ ఎంట్రీ ఇస్తున్న పాక్ నటి?
X

పాకిస్థానీ స్టార్ మహిరా ఖాన్ ఇండియన్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమవుతోంది. పాకిస్థానీ కళాకారులపై సినిమా సంఘాలు విధించిన నిషేధాన్ని కొట్టి వేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ననుసరించి తిరిగి ఇండియన్ సినిమాల్లో ఎంట్రీయిస్తోంది. ఇందుకు మలయాళం సినిమా ఆహ్వానం పలుకుతోంది. మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ సీక్వెల్‌ ‘ఎల్ 2 : ఎంపురాన్’ లో సూపర్ స్టార్ మోహన్‌లాల్ సరసన కీలక పాత్రలో మాహీరా నటించనున్నట్టు తెలుస్తోంది. మాలీవుడ్ లో వస్తున్న ఈ వార్తలపై దర్శకుడు పృథ్వీరాజ్ అధికారికంగా స్పందించలేదు. అయితే పృథ్వీరాజ్, మహీరా కుటుంబాల మధ్య గల సన్నిహిత సంబందాల కారణంగా ఇలాటి వార్తలు పుడుతున్నట్టు తెలుస్తోంది. అంతేగాక మాల్దీవుల వెకేషన్ నుంచి వైరల్ అయిన ఈ రెండు కుటుంబాల గ్రూప్ ఫోటో ఈ వార్తలకి బలాన్నిస్తోంది.

మాహీరా గతంలో ఒక పాక్ లోకల్ నెట్వర్క్ కిచ్చిన ఇంటర్వ్యూలో, మలయాళ సినిమాలపై తన అభిమానాన్ని వ్యక్తం చేసింది. మలయాళ సినిమాల్ని చూసేందుకు తన సన్నిహితుల్ని ప్రోత్సహిస్తోంది కూడా. మలయాళ సినిమాల కథాకథనాలు, నటనలు, నిర్మాణ విలువల గురించి ప్రశంసించింది. మలయాళ సినిమాల్లో పని చేయాలనే తన కోరికని కూడా ఇంటర్వూలో వ్యక్తం చేసింది.

‘ఎల్ : ఎంపురాన్‌’ లో మోహన్‌లాల్, మంజూ వారియర్, ఇంద్రజిత్ సుకుమారన్, టోవినో థామస్, సాయి కుమార్, బైజు సంతోష వంటి విశిష్ట తారాగణం వుంది. ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో మహీరా ఎంట్రీ జరిగితే అది సంచలనాన్ని సృష్టిస్తుందని భావిస్తున్నారు.

ఏడు సంవత్సరాల క్రితం వరకు పాకిస్తాన్ కళాకారులు విరివిగా బాలీవుడ్ లో పనిచేస్తూ వచ్చారు. నటీనటులు మహీరా ఖాన్, సారా ఖాన్, వీణా మాలిక్, హుమైమా మాలిక్, సనమ్ సయీద్, సబా ఖబర్, హానియా అమీర్, ఫవాద్ ఖాన్, అలీ సేథీ, ఇమ్రాన్ అబ్బాస్, జావేద్ ఖాన్, ఇఖ్రా అజీజ్ హుస్సేన్, అలీ జాఫర్, మికాల్ జుల్ఫికర్; గాయకులు ఆతిఫ్ అస్లం, జావేద్ బషీర్, రాహత్ ఫతే అలీ ఖాన్, ఉస్తాద్ నుస్రత్ ఫతే అలీ ఖాన్ మొదలైన కళాకారులు బాలీవుడ్ లో తమ తమ స్థానాల్ని సుస్థిరం చేసుకుంటూ వుండగానే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి.

2016 లో యురీలోని భారత సైనిక స్థావరంపై టెర్రర్ దాడి తర్వాత, ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) పాకిస్తానీ కళాకారులపై నిషేధం విధించింది. ఉగ్ర దాడి సంఘటనకి పాకిస్థాన్‌ని నిందిస్తూ రెండు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడికి ముగింపు పలికింది.

అయితే, పాకిస్థానీ కళాకారులు భారతదేశంలో పని చేయకుండా లేదా ప్రదర్శనలు ఇవ్వకుండా నిషేధించాలనే ఉద్దేశ్యంతో వేసిన పిటిషన్‌ ని బాంబే హైకోర్టు ఇటీవల అక్టోబరులో కొట్టి వేసింది. పాకిస్థానీ నటీనటులు, సంగీతకారులు, గాయకులు, గీత రచయితలు, సాంకేతిక నిపుణులకి ఉపాధి కల్పించడంపై నిషేధం విధించాలని పిటిషన్ ప్రత్యేకంగా కోరింది. న్యాయమూర్తులు సునీల్ షుక్రే, ఫిర్దోష్ పూనివాలాతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. రెండు దేశాల మధ్య సాంస్కృతిక సామరస్యాన్ని, ఐక్యతని పెంపొందించడంలో ఇటువంటి చర్య తిరోగమన దిశగా దారితీయిస్తుందని కోర్టు పేర్కొంది.

విదేశీ పౌరుల పట్ల, ముఖ్యంగా పొరుగు దేశాల నుంచి వచ్చిన వారి పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శించడం దేశభక్తి కాజాలదని కోర్టు నొక్కి చెప్పింది. అయితే ఈ తీర్పు పట్ల బాలీవుడ్ వర్గాలు మౌనం వహించాయి. అసలే దేశంలో ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణం రీత్యా, బాలీవుడ్ లోనే అటువంటి వాతావరణం పట్ల మొగ్గు చూపుతున్న బలమైన వర్గం ఉనికి రీత్యా, ఎవరూ పాక్ కళాకారులతో రిస్కు తీసుకునే పరిస్థితిలో లేరు. మహీరా ఖాన్ తో మలయాళ దర్శకుడు పనిచేసేందుకు ముందుకొస్తే పరిణామాలు ఎలా వుంటాయో తెలియదు. అన్నిటికంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆమెకి వీసా జారీ చేస్తుందో లేదో తెలియదు. ఇంతా చేసి మహీరా నటించింది ఒక్క బాలీవుడ్ సినిమాలోనే. ‘రయీస్’ లో షారూఖ్ ఖాన్ సరసన కనిపించింది. ఇంకో పాక్ నటి వీణా మాలిక్ తెలుగులో ‘నగ్నసత్యం’, కన్నడలో ‘డర్టీ పిక్చర్’ లో నటించింది.

బాంబే హైకోర్టు తీర్పు తర్వాత పాక్ కళాకారులు కూడా మౌనంగా వున్నారు- సింగర్ జావేద్ బషీర్ తప్ప. తీర్పు నాహ్వానిస్తూ తిరిగి బాలీవుడ్ లో పనిచేయాలని వుందని చెప్పాడు.

కాగా, ‘జిందగీ’ ఛానెల్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ శైలజా కేజ్రీవాల్ బాంబే హైకోర్టు తీర్పు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇండో-పాక్ షోస్ ని ప్రసారం చేసిన భారతదేశపు మొదటి ఛానెల్ ‘జిందగీ’. ఈ తీర్పు అద్భుతమైనదని, సరిహద్దుల వెలుపల వున్న సహచరులతో తిరిగి కలిసి పని చేసేందుకు దోహదం చేస్తుందనీ, విభిన్న భాగస్వామ్య ప్రతిభతో పరిశ్రమ అభివృద్ధికి అవకాశం కల్పిస్తుందనీ, తద్వారా విభిన్న మనస్సులు కలిసి ఫార్ములా కాకుండా ఆసక్తికరమైన, కొత్తదనంతో కూడిన కంటెంట్ ని సృష్టించవచ్చనీ ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

First Published:  3 Dec 2023 6:15 AM GMT
Next Story