Telugu Global
Cinema & Entertainment

డబ్బింగ్ కంపెనీలకి చిచ్చు పెడుతున్న ఓటీటీ?

దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన భాషల్లో సౌత్ సినిమాలకు పెరుగుతున్న ప్రజాదరణ వాటి శాటిలైట్, యూట్యూబ్ ఛానెల్స్ లో హక్కుల కొనుగోలుదార్లని ఇరుకున పడేస్తోంది.

డబ్బింగ్ కంపెనీలకి చిచ్చు పెడుతున్న ఓటీటీ?
X

డబ్బింగ్ కంపెనీలకి చిచ్చు పెడుతున్న ఓటీటీ? 

దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన భాషల్లో సౌత్ సినిమాలకు పెరుగుతున్న ప్రజాదరణ వాటి శాటిలైట్, యూట్యూబ్ ఛానెల్స్ లో హక్కుల కొనుగోలుదార్లని ఇరుకున పడేస్తోంది.

ఈ సినిమాల హిందీ డబ్బింగ్స్ కోసం హక్కుల్ని పొందుతున్న ముంబాయిలో ప్రధాన సంస్థ గోల్డ్ మైన్స్ టెలిఫిలిమ్స్ తోబాటు, ఇతర సంస్థలు మూతబడే ప్రమాదం పొంచి వుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి విదేశీ దిగ్గజాలతో సహా ప్రధాన ఓటీటీ ప్లేయర్‌లు ఇప్పుడు దక్షిణాది చిత్రాల హక్కుల్ని పొందేందుకు పోటీ పడుతూండడంతో ఈ సంక్షోభం ఎదురవుతోంది. చాలా మంది దక్షిణాది నిర్మాతలు కూడా హిందీ డబ్బింగ్ హక్కుల్ని అమ్మకుండా ఓటీటీ ఆఫర్ల కోసం అట్టిపెట్టుకుంటున్నారు.

ఇది స్టార్ సినిమాలే కాదు, స్టార్-యేతర, చిన్నస్థాయి సినిమాలపై కూడా ఓటీటీ కంపెనీలు దృష్టి పెట్టడంతో ఏర్పడిన పరిణామం. ప్రాంతీయ కంటెంట్ లైబ్రరీలని నిర్మించుకోవాలని భావిస్తున్న నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రధాన ప్లేయర్‌లతో పాటు, గత కొన్ని నెలల్లో అనేక భాషా-నిర్దిష్ట ఓటీటీ ప్లేయర్‌లు వచ్చాయని మీడియా పరిశ్రమ నిపుణులు అంటున్నారు.

అదనంగా వూట్, ఆహా వీడియో వంటి స్వదేశీ ఓటీటీలు ఈ హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. దక్షిణ సినిమాల మార్కెట్ ఆల్ టైమ్ హైలో వుంది. కాబట్టి నిర్మాతలు రీమేక్ లేదా డబ్బింగ్ హక్కుల్ని అంత తేలికగా ఇవ్వడానికి ఇష్టపడడడం లేదు. స్టార్లు భారీగా పారితోషికాలు వసూలు చేస్తున్నారు. నిర్మాతలు తమ సినిమాల హక్కుల విక్రయాలతో తగినంత సంపాదించినట్లయితే మాత్రమే మళ్ళీ స్టార్ సినిమాలు తీయగలమని భావిస్తున్నారు.

గత 22 సంవత్సరాలుగా డబ్బింగ్ రంగంలో వున్న గోల్డ్ మైన్స్ టెలిఫిలిమ్స్, దీని యూట్యూబ్ ఛానెల్ గోల్డ్ మైన్స్ మూవీస్, దక్షిణాది సినిమాల్ని పట్టణ, లోతట్టు గ్రామాల ప్రేక్షకుల వరకూ తీసికెళ్ళడంలో ప్రసిద్ధి చెందాయి. ఈ సంస్థ వినోద వ్యాపారాన్ని పునర్నిర్వచించిందని చెప్పొచ్చు. రావడం రావడం ఛానెల్స్ కి కనీ వినని టీఆర్పీ ని సంపాదించి పెట్టిన 'రిష్తే' వంటి హిట్ టీవీ షోలతో దూసుకొచ్చింది. డబ్బింగ్ రంగంలో పోటీదార్లు ఉలిక్కిపడేలా ఎంట్రీ ఇచ్చింది.

కంపెనీ వెబ్సైట్ లో పంపిణీ చేసిన ప్రసిద్ద డబ్బింగ్ సినిమాల టైటిల్స్ లో కింగ్ నెం.1, మగధీర, చిరుత మొదలైన ప్రసిద్ధ సినిమాలు కన్పిస్తాయి. ఈ డబ్బింగ్ సినిమాలు ఛానెల్స్ కి కనీ వినని టీఆర్పీలని ఆర్జించి పెట్టాయి. ఈ సంస్థ కంటెంట్‌ ని ఖరారు చేసే ముందు అన్వేషిస్తుంది, విశ్లేషిస్తుంది, మూల్యాంకనం చేస్తుంది. తద్వారా సినిమా హక్కుల్ని కొనుగోలు చేసి, హిందీలోకి డబ్ చేసి శాటిలైట్ ఛానెల్స్ కి అమ్మి, వాటికి టాప్ టీఆర్పీలని సమకూర్చి పెడుతుంది. దూరదర్శన్‌ గరిష్ట ఆదాయాన్ని ఆర్జించడంలో కంపెనీ పాటించే విజయవంతమైన సినిమాల సరైన ఎంపికే కారణమని చెప్తున్నారు.

మన స్టార్లు హిందీ భాయీలు

రజనీ కాంత్ -ది యాక్షన్ మాన్ అధినాయకుడు, నాగార్జున- బీవీ నెం 2, డాన్ నెం 1, గ్యాంబ్లర్ నెం 1, కింగ్ నెం 1, బాస్, కెప్టెన్ నాగార్జున, హాకీఖత్, మేరే హిందూస్తాన్ కీ కసమ్, మేరీ జంగ్; మహేష్ బాబు -బెట్టింగ్ రామ్, ఎన్టీఆర్ - దమ్ము, మర్ మిటేంగే, రౌడీ బాద్షా, మేరా కానూన్, ది ఫైటర్ మాన్ ఘాయల్, ది సూపర్ ఖిలాడీ, యమరాజ్ ఏక్ ఫౌలాదీ; అల్లు అర్జున్- డేంజరస్ ఖిలాడీ, రక్షక్, బన్నీ ది హీరో, వీరతా ఏక్ పవర్, గంగోత్రి; రామ్ చరణ్- బెట్టింగ్ రాజా, చిరుత, మగధీర, డబుల్ ఎటాక్; రవి తేజ- దాదాగిరీ, మై హూ ఖతర్నాక్, జానీ దుష్మాన్, కృష్ణ ది పవరాఫ్ ఎర్త్, జీనే నహీ దూంగా, మేరా ఇన్సాఫ్... ఇలా చిత్ర విచిత్ర టైటిల్స్ తో మన స్టార్స్ సినిమాల్ని నార్త్ లో టాప్ టీఆర్పీలతో పాపులర్ చేసింది గోల్డ్ మైన్స్ సంస్థ.

అశ్వనీ దత్, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతలతో బాటు ఇంకా సూర్య, విజయ్, అజిత్ మొదలైన తమిళ స్టార్స్ సినిమాల్ని కూడా హిందీలో డబ్ చేసి ఛానెల్స్ కి లాభాలు చేకూర్చి పెట్టింది. ఏ సినిమా డబ్బింగ్ హక్కులైనా 99 సంవత్సరాల కాలానికి తీసుకుం

టుంది. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో దక్షిణాది నిర్మాతలు హిందీ రీమేక్/ఓటీటీ డబ్బింగ్ హక్కుల ద్వారా హీనపక్షం 25 కోట్లు రాబట్టలని నిర్ణయించుకోవడంతో, గోల్డ్ మైన్స్ సహా ఇతర డబ్బింగ్ రంగంలో వున్న సంస్థలకి బ్రేకులు పడే పరిస్థితి దాపురించింది.

ఓటీటీ ఆట!

ఓటీటీ కంపెనీలు తమ కంటెంట్ ని వీలైనన్ని భాషల్లో అందిస్తూ మార్కెట్ ని విస్తృతపర్చుకోవడానికి డబ్బింగ్ ఆట మొదలెట్టాయి. డబ్బింగ్ రచయితలకి, కళాకారులకి, డబ్బింగ్ థియేటర్లకీ మంచి గిరాకీ ఏర్పడింది. ఒకరి గిరాకీ మరొకరి చిరాకు అయింది. సబ్ టైటిల్స్ రైటర్స్ కి పని తగ్గింది. సినిమాల సంభాషణలకి ఇంగ్లీషు సబ్ టైటిల్స్ వేస్తే ఇంగ్లీషు తెలియని ప్రేక్షకుల్లోకి అంతగా సినిమాలు వెళ్ళవు. అదే ఆయా భాషల్లో డబ్బింగ్ చేస్తే అర్బన్ నుంఛీ రూరల్ ప్రాంతాల వరకూ మార్కెట్ పెరుగుతుంది.

ఇంకోటేమిటంటే, డబ్బింగ్ అంటే కేవలం డబ్బింగ్ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పించడం గాక, స్టార్స్ తో డబ్బింగ్ చెప్పిస్తే ఆకర్షణ పెరుగుతుందన్న ఆలోచన కొచ్చాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో సూపర్ హీరో సిరీస్ 'ది బాయ్స్ 2' కి బాలీవుడ్ స్టార్స్ అర్జున్ కపూర్, రాజ్‌కుమార్ రావ్ లచేత డబ్బింగ్ చెప్పించింది.

హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'జాక్ ర్యాన్‌' లో ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ వాయిస్‌ని వాడుకుంది అమెజాన్. ఆస్కార్ అవార్డు పొందిన కొరియన్ మూవీ 'పారసైట్‌' ని హిందీలోకి డబ్ చేసింది. స్టార్స్ పారితోషికాలు అధికంగా వున్నా ఖాతరు చేయడం లేదు. తమిళ స్టార్ విజయ్ సేతుపతి చేత 'ధీర' అనే యానిమేషన్ కి డబ్బింగ్ చెప్పించారు.

నెట్‌ఫ్లిక్స్ 'ఎక్స్ ట్రాక్షన్', 'ఏ సూటబుల్ బాయ్', 'ది జంగిల్ బుక్' వంటి అంతర్జాతీయ ఒరిజినల్స్ ని భారతీయ భాషల్లోకి డబ్ చేసిన తర్వాత, సోనీలివ్ '1992-ది హర్షద్ మెహతా స్టోరీ' ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోకి డబ్ చేసింది. డిస్నీ+ హాట్‌స్టార్ కూడా 'ఆర్య' వెబ్ సిరీస్ ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో బాటు బెంగాలీ, మరాఠీల్లో కూడా డబ్ చేసి విడుదల చేసింది.

ప్రముఖ హాలీవుడ్ బ్యానర్స్ థియేట్రికల్ రిలీజులకి అగ్రశ్రేణి బాలీవుడ్ స్టార్స్ చేత డబ్బింగ్ చెప్పించిన కొన్ని సందర్భాలు ఓటీటీకి స్ఫూర్తి నిచ్చాయి. 'స్పైడర్ మ్యాన్ : హోమ్‌కమింగ్' హిందీ వెర్షన్‌ కి టైగర్ ష్రాఫ్ చేత టామ్ హాలండ్‌ కి డబ్బింగ్ చెప్పించారు. అలాగే సూపర్ హీరో మూవీ 'కెప్టెన్ అమెరికా: సివిల్ వార్‌' కి వరుణ్ ధావన్ వాయిస్‌ని అందించారు.

మహమ్మారితోనే ఓటీటీల పండుగ!

కోవిడ్ -19 మహమ్మారి టైమ్ లో రెండవ శ్రేణి, మూడవ శ్రేణి పట్టణాల్లోకి చొచ్చుకుపోయిన ఓటీటీని మరింత చేరువయ్యేందుకు డబ్బింగ్ గేమ్ ముఖ్యమని భావిస్తున్నారు. దేశీయ ప్రేక్షకులు స్థానికీకరించిన కంటెంట్ పట్ల ఆకలి మీదున్నారని ఓటీటీలు కనిపెట్టాయి. దీంతో గ్లోబల్ కంటెంట్ ని స్థానికీకరించి వీలైనన్ని వ్యూస్ పిండుకోవాలని ప్రణాళికలు రూపొందించు కుంటున్నాయి.

ప్రేక్షకులు ఇప్పుడు మామూలుగా లేరు. హిందీ ప్రేక్షకులు హిందీ సినిమాలు చూడడం లేదు, తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాలు చూడడం లేదు. ఏ భాష ప్రేక్షకులు ఆ భాష సినిమాలకి థియేటర్లో డుమ్మా కొడుతున్నారు.

అంతర్లీనంగా వారికేదో సాంస్కృతిక ఆసక్తి పెరిగింది. ప్రపంచం నలుమూలల నుంచి కథల పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. డబ్బింగ్ ద్వారా ఈ గొప్ప కథల్ని అందించే అవకాశం ఓటీటీలకి చిక్కింది. ఈ పోటీలో నెట్ ఫ్లిక్స్ కంటెంట్‌ ని ప్రపంచ వ్యాప్తంగా 32 భాషల్లో డబ్ చేసి అదర గొడుతోంది. నెట్ ఫ్లిక్స్ ఇంటర్ఫేస్ లో ఆడియో టాబ్ ని క్లిక్ చేసి స్క్రోల్ చేస్తే బారులు తీరిన భాషలు పలకరిస్తూ కన్పిస్తాయి.

ఈ వాతావరణ పరిస్థితుల్లో థియేట్రికల్, శాటిలైట్ డబ్బింగ్ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్ధకమైంది. అయితే డబ్బింగ్ రచయితలకి, కళాకారులకి, డబ్బింగ్ థియేటర్లకీ అవకాశాలు పెరుగుతున్నాయి. ఓటీటీలు వచ్చాక టీవీలే చూడనప్పుడు టీవీల్లో శాటిలైట్ సినిమాల ప్రసారమనేది అర్ధం కోల్పోతోంది. అన్నినదులూ సముద్రంలో కలిసినట్టు, సినిమాలకి సంబంధించిన అన్ని వ్యాపారాలూ వెళ్ళి ఓటీటీలో కలవాల్సిందే.

First Published:  20 Dec 2022 7:42 AM GMT
Next Story