Telugu Global
Cinema & Entertainment

ఇక నుంచి స్థానికంగానే హిందీ డబ్బింగుల సెన్సార్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు)) ప్రాంతీయ భాషా చలన చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్‌ల సర్టిఫికేట్ కోసం అన్ని దరఖాస్తుల్ని ప్రత్యేకంగా ముంబాయి కార్యాలయానికి సమర్పించాలనే ఆదేశాన్ని రద్దు చేసింది.

ఇక నుంచి స్థానికంగానే హిందీ డబ్బింగుల సెన్సార్
X

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు)) ప్రాంతీయ భాషా చలన చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్‌ల సర్టిఫికేట్ కోసం అన్ని దరఖాస్తుల్ని ప్రత్యేకంగా ముంబాయి కార్యాలయానికి సమర్పించాలనే ఆదేశాన్ని రద్దు చేసింది. ప్రాంతీయ సినిమాల హిందీ వెర్షన్ సర్టిఫికేషన్ ఇప్పుడు ఒరిజినల్ సినిమా సెన్సారైన కార్యాలయంలోనే స్థానికంగా జరుగుతుందని ఈ రోజు విడుదలైన కొత్త నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ నోటిఫికేషన్ అక్టోబర్ 18, 2023 తేదీతో వుంది. పాత నిబంధన 2017 లో వెలువడింది. సెన్సార్ బోర్డు ముంబాయి కార్యాలయం సీఈఓ రవీందర్ భాస్కర్ ఈ మేరకు ప్రకటించారు.

ఒక తమిళ సినిమా హిందీ వెర్షన్ కోసం నిర్మాత సర్టిఫికేషన్ కోరితే, తమిళ ఒరిజినల్ కి మొదట సర్టిఫికేట్ ఇచ్చిన ప్రాంతీయ కార్యాలయమే ఇప్పుడు హిందీ డబ్బింగ్ సర్టిఫికేట్ జారీ చేయడానికి అధికారం కలిగి వుందని నోటీసులో ఆయన పేర్కొన్నారు.

ఈ నిర్ణయం పట్ల అన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిళ్ళలోని నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు. ధృవీకరణ ప్రక్రియని క్రమబద్ధీకరించడానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిళ్ళు సెన్సార్ బోర్డు తో చురుకుగా పనిచేశాయి. ఈ మార్పుతో నిర్మాతలపై ఆర్ధిక, ప్రయాణ భారాలు తగ్గుతాయి. ఇప్పుడు ముంబాయిలో తమ సినిమాల హిందీ వెర్షన్‌ల సెన్సారింగ్ పొందడానికి జాప్యాలు, భారీ రుసుములు ఆదా అవుతాయి.

ఈ మార్పు వెనుక ఇటీవల తమిళ స్టార్ విశాల్ కొందరు ముంబాయి సెన్సార్ కార్యాలయం ఉద్యోగులపై చేసిన అవినీతి ఆరోపణలున్నాయి. తను నటించిన 'మార్క్ ఆంటోనీ' హిందీ సెన్సార్ క్లియరెన్స్ కోసం ముంబాయి కార్యాలయం లోని ముగ్గురు ఉద్యోగులు తన నుంచి రూ. 6.5 లక్షల రూపాయలు లంచం వసూలు చేశారని (స్క్రీనింగ్ కోసం రూ. 3 లక్షలు, సర్టిఫికేట్ కోసం రూ. 3.5 లక్షలు), ఈ పరిస్థితి తానెన్నడూ చూడలేదనీ పేర్కొంటూ విశాల్ విడుదల చేసిన వీడియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వెంటనే కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకి ఆదేశించగా, సిబిఐ ఆ ఉద్యోగుల్ని అరెస్టు చేసి బ్యాంకు ఖాతాని సీజ్ చేసింది.

అయితే విశాల్ ఆరోపణలపై లోతుగా పరిశీలించామని, ప్రారంభంలో పేర్కొన్న సిబ్బంది సెన్సార్ బోర్డు ఉద్యోగులు కాదని, అనధికార థర్డ్-పార్టీ మధ్యవర్తులని గమనించాలని సెన్సార్ బోర్డు తాజా ప్రకటనలో పేర్కొంది. మధ్యవర్తుల పాత్రని నిరోధించడానికి ఇప్పటికే డిజిటలైజేషన్ ప్రక్రియ, ఆటోమేషన్, కనిష్ట మాన్యువల్ జోక్యం అమలులో వున్నాయని, దీనిని నిర్మాతలు సద్వినియోగం చేసుకోకుండా మధ్యవర్తుల్ని ఆశ్రయిస్తున్నారనీ, దీనినుంచి విరమించుకోవాలనీ సెన్సార్ బోర్డు విజ్ఞప్తి చేసింది. అలాగే, సినిమా సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు నిర్దేశించిన నిబంధనల ప్రకారం చేయాలని, చివరి నిమిషంలో హడావిడీ చేయవద్దని కోరింది.

ఏటా 12,000- 18, 000 మధ్య వివిధ భాషల చలనచిత్రాలు సెన్సార్ బోర్డు ద్వారా సర్టిఫికేట్ పొందుతున్నాయి. వీటిని సెన్సార్ బోర్డు సభ్యులు వీక్షించడానికి సమయం పడుతుంది. చాలా సార్లు నిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీల్ని ముందే ప్రకటించుకుని సెన్సార్ కోసం హడావిడీ పడుతూంటారు. ఇలా కాకుండా, సెన్సార్ బోర్డు సినిమాల్ని వీక్షించే షెడ్యూళ్ళని దృష్టిలో పెట్టుకుని, ధృవీకరణ ప్రక్రియకి తీసుకునే నిర్ణీత సమయాన్ని నిర్మాతలు గౌరవించాలని, తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలనీ సెన్సార్ బోర్డు సూచించింది.

దరఖాస్తు ప్రక్రియలో మధ్యవర్తుల జోక్యాన్ని నివారించడానికి సెన్సార్ బోర్డు కొన్ని చర్యలు చేపట్టింది. వాటి ప్రకారం, పత్రాల భౌతిక సమర్పణకి అనుమతి లేదు. దరఖాస్తుదారు/ప్రతినిధి ద్వారా వ్యక్తిగతంగా ఎటువంటి భౌతిక పత్రాల సమర్పణని ఆమోదించడం జరగదు. ప్రతి పత్రాన్ని ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో మాత్రమే అప్‌లోడ్ చేయాలి.

సర్టిఫికేట్ భౌతిక కాపీ సేకరణ ఆన్ లైన్ లోనే జరుగుతుంది. సర్టిఫికేట్ల కాపీ స్కాన్ చేసి సంబంధిత దరఖాస్తుదారు రిజిస్టర్డ్ ఈ మెయిల్ ఐడీలో షేర్ చేయడం జరుగుతుంది. దరఖాస్తు దారు అభ్యర్థించినట్లయితే సర్టిఫికేట్ భౌతిక కాపీని పంపడం జరుగుతుంది. సర్టిఫికేట్ వ్యక్తిగత సేకరణకి అనుమతి లేదు.

డిసిపి/డివిడి సీలింగ్ - పరీక్ష కోసం ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ సినిమా ప్యాకేజీ (కంటెంట్) ఇ-డెలివరీ- ఇది కంటెంట్ భద్రతకి, దరఖాస్తుదారు ఆన్‌లైన్ కంటెంట్ స్థితిని ట్రాక్ చేయడానికీ సహాయపడుతుంది. కొత్త విధానం అమలులోకి వచ్చే వరకు, సీసీటీవీ పర్యవేక్షణలో అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లో సీలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.

grievence.cbfc@gmail.com పరిష్కార విధానం త్వరలో సెన్సార్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తుంది. ఎవరైనా మూడవ పక్షం వారు సెన్సార్ బోర్డుకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు, లేదా యాక్సెస్ కలిగి వున్నారని క్లెయిమ్ చేస్తే, లంచం డిమాండ్ చేస్తే, లేదా గడువు ప్రక్రియని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినట్లయితే, వారిని వెంటనే ఫిర్యాదు సెల్‌ దృష్టికి తీసుకెళ్ళాలి.

అంటే ఇక నుంచి తెలుగు సినిమాల హిందీ డబ్బింగులు, తెలుగు పానిండియా సినిమాల హిందీ వెర్షన్లు ఇక్కడే హైదరాబాద్ లోనే సెన్సార్ కి పంపుకోవచ్చన్న మాట.

First Published:  23 Oct 2023 10:03 AM GMT
Next Story