Telugu Global
Cinema & Entertainment

దిగి వచ్చిన నెట్ ఫ్లిక్స్ : వ్యూస్ డేటా వెల్లడి!

నెట్‌ఫ్లిక్స్ ఇన్ కార్పొరేషన్ తన షోలను ఎంత మంది చూస్తున్నారో ప్రపంచానికి వెల్లడించడానికి సిద్ధమైంది.

దిగి వచ్చిన నెట్ ఫ్లిక్స్ : వ్యూస్ డేటా వెల్లడి!
X

నెట్‌ఫ్లిక్స్ ఇన్ కార్పొరేషన్ తన షోలను ఎంత మంది చూస్తున్నారో ప్రపంచానికి వెల్లడించడానికి సిద్ధమైంది. కంపెనీ అందిస్తున్న సేవలలోని ప్రతీ టైటిల్ కి గ్లోబల్ అర్ధవార్షిక వ్యూస్ డేటాని విడుదల చేసింది. నెట్‌ఫ్లిక్స్ డేటా ప్రకారం పొలిటికల్ థ్రిల్లర్ ‘ది నైట్ ఏజెంట్’ 2023 ప్రథమార్థంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన టైటిల్‌గా నిలిచింది. 812.1 మిలియన్ గంటల వీక్షణని ఇది క్రియేట్ చేసినట్టు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో ‘ఫ్యామిలీ డ్రామా- సీజన్ 2’, ‘గిన్నీ అండ్ జార్జియా’, దక్షిణ కొరియా సిరీస్ ‘ది గ్లోరీ’ వున్నాయి. ఈ కాలంలో అన్ని సిరీస్ సీజన్‌లని పరిగణనలోకి తీసుకుంటే ‘గిన్నీ అండ్ జార్జియా’ ని అత్యధిక మంది ప్రేక్షకులు చూశారు.

ఈ డేటా ఇటీవల హాలీవుడ్ లేబర్ యూనియన్‌లు, ప్రధాన స్టూడియోల మధ్య నెలల తరబడి సాగిన సమ్మె నేపథ్యంలో విడుదలైంది. సమ్మెలో పాల్గొన్న రచయితలు, నటీనటులు స్ట్రీమింగ్‌లో తాము చేసిన పనికి మరింత పరిహారం పొందేందుకు ఈ డేటాలోని వ్యూస్ పరిమాణం తోడ్పడింది. ఇప్పుడు కంపెనీ ప్రతి ఒక్కరికీ అంటే- వీక్షకులు, సరఫరాదారులు, పోటీదారులకి - అర్ధవార్షిక వారీ ‘What We Watched: A Netflix Engagement Report’ తో వ్యూస్ గురించిన లోతైన పరిశీలనని అందించేందుకు నిర్ణయించింది.

గత 16 సంవత్సరాలుగా కంటెంట్ ప్రొవైడర్లు వ్యూస్ డేటా అడుగుతున్నారనీ, పారదర్శకత లేకపోవడంతో కాలానుగుణంగా వారికి అపనమ్మకం ఏర్పడిందనీ, నెట్‌ఫ్లిక్స్ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెడ్ సరండోస్ తెలిపారు.

కొన్నేళ్ళుగా నెట్‌ఫ్లిక్స్ వీక్షకుల గణాంకాల్ని వెల్లడించడానికి నిరాకరించింది. ఇతర ప్రధాన స్ట్రీమింగ్ సేవలనే తనూ అనుసరించింది. ఇటీవల హాలీవుడ్ రచయితలు, నిర్మాతలు నెట్‌ఫ్లిక్స్‌ ని విమర్శించారు. నెట్ ఫ్లిక్స్ అత్యంత విజయవంతమైన ప్రోగ్రాములకి ఎక్కువ చెల్లించకుండా వుండడానికి ప్రేక్షకుల డేటాని దాచిపెడుతోందనీ దుయ్యబట్టారు.

ఇప్పుడు ఈ స్ట్రీమింగ్ దిగ్గజం మరింత డేటాని బహిర్గతం చేయడం ప్రారంభించింది. ఇందులో కొన్ని జనాదరణ పొందిన టైటిల్స్ -ప్రేక్షకుల గణాంకాలు- ఇంగ్లీషులో, ఇతర భాషల్లో అత్యధిక వ్యూవ్స్ సాధించిన సినిమాలు, టీవీ కార్యక్రమాలు - అంటూ వెల్లడి చేసే వారంవారీ టాప్ 10 లిస్టులు వున్నాయి. ఈ టాప్ 10 లిస్టులు ఏ షోలు ఎంత జనాదరణ పొందాయనే దాని గురించి ప్రజలకి మంచి అవగాహనని అందిస్తాయి. ఈ వారం విడుదల చేసిన డేటాలో 50,000 గంటల నుంచి 100,000 గంటల మధ్య రూపొందిన వేల సినిమాలూ షోలు సహా 18,000 కి పైగా టైటిల్స్ ని కవర్ చేస్తున్నాయి.

ఈ లిస్టులో ఇండియా విషయానికొస్తే- ఆశ్చర్యకరంగా యామీ గౌతమ్ నటించిన 'చోర్ నికల్ కే భాగా’ అనే ఒక ఛోటా హిందీ మూవీ వ్యూస్ లో టాప్ లో వుంది! దీంతో ఇతర నిర్మాతలు, దర్శకులూ పిచ్చెత్తిపోయారు. ఎక్కువ మంది చూసిన సిరీస్ లో వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన 'రానా నాయుడు' టాప్ లో వుంది.

సినిమాల్లో 'చోర్ నికల్ కే భాగా’ తర్వాతి స్థానాల్లో 'మిషన్ మంజు', 'ఇండియన్ మ్యాచ్ మేకింగ్', 'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే', 'ఆర్ ఆర్ ఆర్’, 'తూ ఝూటీ మైన్ మక్కా ర్', 'షెహజాదా' చోటు సంపాదించుకున్నాయి.

నెట్ ఫ్లిక్స్ దారిలో అమెజాన్ ప్రైమ్, డిస్నీ+హాట్ స్టార్, సోనీలివ్, జీ5 మొదలైన ఇతర ఓటీటీలు కూడా వ్యూస్ డేటా అందిస్తాయేమో చూడాలి. ఈ డేటా వల్ల ఎలాటి కంటెంట్ క్రియేట్ చేయాలో ఒక అవగాహనకి రాగలుగుతారు కంటెంట్ ప్రొవైడర్లు.

First Published:  17 Dec 2023 8:53 AM GMT
Next Story